సూర్యుడి అధ్యయనం కోసం ప్రయోగించిన ఆదిత్య ఎల్1 మిషన్ సౌరగాలులపై అధ్యయనం ప్రారంభించింది. సౌరగాలులను రికార్డు చేసింది. ఈ ఫోటోలను ఇస్రో తన సామాజిక మాధ్యమాల్లో పంచుకుంది. ఆదిత్య ఎల్ 1 ప్రయాణంలో ఇది మరో మైలురాయిగా ఇస్రో శాస్త్రవేత్తలు అభివర్ణిస్తున్నారు.
ఈ శాటిలైట్ లోని ఆదిత్య సోలార్ విండ్ పార్టికల్ ఎక్స్పరిమెంట్ పేలోడ్ లోని రెండు పరికరాలు పరిశోధనలను విజయవంతంగా కొనసాగిస్తున్నాయని ఇస్రో వెల్లడించింది. ఈ రెండు పరికరాల్లో సూపర్థర్మర్ అండ్ ఎనర్జిటిక్ పార్టికల్ స్పెక్ట్రోమీటర్ ను సెప్టెంబర్ 10న యాక్టివేట్ చేయగా, సోలార్ విండ్ అయాన్ స్పెక్ట్రోమీటర్ (స్విస్)ను నవంబరు 2న యాక్టివేట్ చేశారు.
సోలార్ విండ్ అయాన్ స్పెక్ట్రోమీటర్ లోని రెండు సెన్సర్లు 360 డిగ్రీల్లో తిరుగుతూ నవంబర్ లోని రెండు తేదీల్లో సోలార్ విండ్ అయాన్లు, ప్రైమరీ ప్రోటాన్స్, ఆల్ఫా పార్టికల్స్‌ను విశ్లేషించాయని ఇస్రో వెల్లడించింది. ఈ మేరకు సేకరించిన ఎనర్జీ హస్టోగ్రామ్‌ను పరిశీలించగా, ప్రోటాన్, ఆల్ఫా పార్టికల్స్‌లో కొన్ని వైవిధ్యాలు ఉన్నట్టు గుర్తించామని ఇస్రో వివరించింది.
సౌర గాలుల లక్షణాలపై గత కొన్నేళ్లుగా ఎదురౌతున్న ప్రశ్నలకు ఈ తాజా విశ్లేషణతో సమాధానాలు లభించే అవకాశం ఉందని ఇస్రో అభిప్రాయపడింది. ఇవేకాకుండా సౌర గాలుల్లో అంతర్లీనంగా ఉండే ప్రక్రియలు, భూమిపై వాటి ప్రభావం తదితర కీలక అంశాలపై పూర్తిగా అధ్యయనం చేయడానికి ఈ సమాచారం ఉపయోగపడుతుందని ఇస్రో వెల్లడించింది.
అలాగే లాగ్రాంజ్ పాయింట్ వద్ద చోటు చేసుకునే కరోనల్ మాస్ ఎజెక్షన్పై ఓ అవగాహన ఏర్పడుతుందని పేర్కొంది. ఈ ఏడాది సెప్టెంబరు 2న ఆదిత్య ఎల్ 1 ప్రయోగం జరిగింది. ఈ ప్రయోగం దాదాపు చివరి దశకు చేరుకుంది. ఈ ఉపగ్రహాన్ని లాగ్రాంజ్ 1 పాయింట్లో ప్రవేశ పెట్టడానికి తగిన విన్యాసాలు 2024 జనవరి 7 నాటికి పూర్తవుతాయని ఇస్రో ఛైర్మన్ సోమనాథ్ ఇటీవల తెలియజేశారు.
భూమి నుంచి 15 లక్షల కిమీ దూరంలో లాగ్రాంజ్ పాయింట్ 1 ఉంది. అక్కడికి చేరుకున్న తరువాత ఆ కక్షంలో పరిభ్రమిస్తూ ఆదిత్య ఎల్ 1 సూర్యుడిని అధ్యయనం చేస్తుందని ఇస్రో వివరించింది.