రెండు తెలుగు రాష్ట్రాలలో రాజకీయంగా బిజెపికి పట్టు లభించేటట్లు చేయడం కోసం కేంద్ర హోం మంత్రి అమిత్ షా స్వయంగా రంగంలోకి దిగిన్నట్లు కనిపిస్తున్నది. రెండు రాష్ట్రాలలోని పార్టీ నేతలతో వ్యక్తిగతంగా భేటీలు జరుపుతూ, వారికి మార్గనిర్ధేశం చేస్తున్నారు.
తెలంగాణలో 2023లో అధికారంలోకి వచ్చే విధంగా, ప్రస్తుతం ప్రాతినిధ్యం లేని ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ బలమైన ప్రాతినిధ్యం పొందేవిధంగా వ్యూహాత్మకంగా అడుగులు వేసే విధంగా వారికి ఆదేశాలు ఇస్తున్నారు. వాస్తవానికి 2014లో బిజెపి అధ్యక్ష పదవి చేపట్టిన్నప్పుడే ఇప్పటి వరకు పార్టీకి చెప్పుకోదగిన ప్రాతినిధ్యం చట్టసభలలో లేని దక్షిణాది, తూర్పు రాష్ట్రాలలో పార్టీని బలోపేతం చేయడమే తన లక్ష్యంగా ప్రకటించారు.
ఆ తర్వాతనే అస్సాం, త్రిపుర, పుదుచ్చేరి లలో అధికారంలోకి రావడం, పశ్చిమ బెంగాల్ లో అధికారం కోసం గట్టి ప్రయత్నం చేయగలగడం చేశారు. అయితే రెండు తెలుగు రాష్ట్రాలలో బిజెపికి చెప్పుకోదగిన ప్రాతినిధ్యం చట్టసభలలో లభించడం లేదు. జనవరి, 2015లో హైదరాబాద్, విజయవాడలలో పర్యటించిన ఆయన 2019 నాటికి అధికార పక్షంగా మారాలంటూ సూచించినా, చెప్పుకోదగిన పురోగతి కనిపించలేదు.
అయితే తెలంగాణలో నాలుగు ఎంపీ సీట్లు గెల్చుకోవడంతో పాటు వరుసగా రెండు అసెంబ్లీ ఉపఎన్నికలలో బిజెపి గెలుపొందడం, ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ అంతర్గత కుమ్ములాటలతో చతికిలబడుతూ ఉండడంతో ఇక్కడ గట్టి పట్టుబడితే అధికారంలోకి రావచ్చని అభిప్రాయంకు వచ్చిన్నట్లు కనిపిస్తున్నది. అందుకనే ఇటీవల రాష్ట్రంలోని కీలక బిజెపి నేతలను ఢిల్లీకి పిలిపించి మార్గనిర్ధేశం చేశారు.
రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అరెస్ట్ సందర్భంగా జాతీయ నాయకత్వం స్పందించి, అండగా ఉండడం గమనిస్తే తెలంగాణకు ఇస్తున్న ప్రాధాన్యత స్పష్టం అవుతున్నది. నిత్యం ప్రజలతో సంబంధం గల ఇతర పార్టీలలోని నేతలను ఆకట్టుకొనే ప్రయత్నం కూడా చేస్తున్నారు.
మరోవంక, ఆంధ్ర ప్రదేశ్ లో గత ఎన్నికలలో నోటా కన్నా తక్కువ ఓట్లు రావడంతో ఉనికి కోసం బిజెపి ఆరాట పడుతున్నది. గత నెలలో తిరుపతి వచ్చిన సందర్భంగా రాష్ట్ర బిజెపి నేతలతో భేటీ అయి, అధికార పార్టీని ప్రజాక్షేత్రంలో నిలదీసే విధంగా ప్రజా ఉద్యమాలు చేపట్టాలని ఆదేశించారు. అధికారంలో ఉన్న వైసీపీకి బిజెపి బి- టీమ్ అనే దురభిప్రాయం తొలగించాలని స్పష్టం చేశారు.
ఇప్పటి నుండే గట్టి పోటీ ఇవ్వగల నియోజకవర్గాలను ఎన్నుకొని, అక్కడ బలమైన అభ్యర్థులను సిద్ధం చేయడంలో నిమగ్నం కావాలని కూడా ఆదేశించారు. బీజేపీలో అటువంటి వారు లేని పక్షంలో, ఇతర పార్టీలలోని వారిని ఆహ్వానించమని సూచించారు. ముఖ్యంగా ఎస్సి, ఎస్టీ నియోజకవర్గాలపై ప్రత్యేక దృష్టి పెట్టమని పేర్కొన్నారు. అక్కడ బలమైన పోటీ ఇస్తే ఎక్కువ సీట్లు గెల్చుకోవచ్చని చెప్పారు.
ఇప్పటి నుండే నియోజకవర్గాల ప్రాతిపదికగా కార్యక్రమాలు జరపాలని స్పష్టం చేశారు. పార్టీ సంస్థాగత కార్యక్రమాలు చేపట్టినా, రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలు నిర్వహించినా.. అన్ని నియోజకవర్గాల్లో జరిగేలా చూడాలని ఆయన అన్నట్లు తెలిసింది. రెండు రాష్ట్రాలలో ముందస్తు ఎన్నికలు అనే కధనాలు వెలువడుతూ ఉండడంతో ఎప్పుడు ఎన్నికలు వచ్చిన సిద్ధంగా ఉండాలని చెప్పారు.
తెలంగాణలోని 119 నియోజకవర్గాలలో కనీసం 90 చోట్ల అయిన బలమైన అభ్యర్థులను నిలబెట్టేందుకు ఇప్పటి నుండే కార్యాచరణ ప్రారంభించామని సూచించారని చెబుతున్నారు. దుబ్బాక, హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో పార్టీ తరపున గట్టి అభ్యర్థులు ఉండడంతోనే విజయం సాధ్యమైందని గుర్తించిన బీజేపీ అధిష్ఠానం అన్ని చోట్ల అటువంటి అభ్యర్థుల అన్వేషణలో పదిన్నల్టు తెలుస్తున్నది.
రెండు తెలుగు రాష్ట్రాలలో అధికార పక్షాలు తీవ్రమైన ప్రజా వ్యతిరేకతను ఎదుర్కొంటు ఉండటం, ప్రధాన ప్రతిపక్షాలు బలహీనమవుతూ ఉండడంతో బిజెపి ఎదుగుదలకు ఇదే సరైన అదనుగా భావిస్తున్నారు. పార్టీకి మంచి కార్యకర్తల బలం ఉన్నప్పటికీ బలమైన అభ్యర్థులు లేని పక్షంలో గెలుపొందడం కష్టం కాగలదని హెచ్చరిస్తున్నారు.
దక్షిణాదిన కర్ణాటకలో అధికారంలో ఉండగా కేరళ, తమిళనాడులలో ఎంత ప్రయత్నం చేసిన సీట్ల పరంగా చెప్పుకోదగిన ప్రగతి చూపలేక పోతున్నది. అందుకనే కర్ణాటక తర్వాత అధికారంలోకి రాగాల అవకాశాలు తెలంగాణలో ఉన్నాయని, ఆంధ్ర ప్రదేశ్ లో బలం పుంజుకొని పరిస్థితులు నెలకొన్నాయని భావిస్తున్నారు.