తెలంగాణ ప్రస్తుత డీజీపీ అంజనీ కుమార్‌ను తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్న క్రమంలో ఎన్నికల కమిషన్ సస్పెండ్ చేసింది. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న సమయంలోనే నిబంధనల్ని ఉల్లంఘిస్తూ ఆయన పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని కలవడంతో ఈసీ సీరియస్ అయింది. పూర్తి స్థాయి ఫలితాలు రాకముందే రేవంత్ రెడ్డిని కలిసినందుకు ఆయనపై చర్యలు తీసుకుంది.
ఈ నేపథ్యంలోనే అంజనీ కుమార్‌ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇదే అంశంపై అదనపు డీజీలు సందీప్ కుమార్ జైన్, మహేశ్ భగవత్‌కు కూడా ఈసీ నోటీసులు జారీ చేసింది. అంతకుముందు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో భాగంగా కాంగ్రెస్ మెజార్టీ స్థానాల్లో ఆధిక్యంలో దూసుకెళ్తున్న క్రమంలో డీజీపీ అంజనీకుమార్, ఇద్దరు అదనపు డీజీలు రేవంత్ రెడ్డిని కలిసి అభినందనలు తెలిపారు.
ఇది ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించడమేనని ఈసీ చర్యలు తీసుకుంది. ఆయన నుంచి వివరణ కూడా కోరింది. అంజనీ కుమార్‌ను డీజీపీగా సస్పెండ్ చేసిన కొద్దిసేపటికే తెలంగాణ రాష్ట్రానికి నూతన డీజీపీని ప్రకటించింది ఎన్నికల సంఘం. కొత్త డీజీపీ ఎంపిక కోసం ముగ్గురు సీనియర్ అధికారుల పేర్లను ఈసీకి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి సిఫార్సు చేయగా, రవి గుప్తా ఐపీఎస్‌ను ఆయన స్థానంలో నియమించింది.
అంతకుముందు కూడా ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పటి నుంచి పలువురు అధికారులపై ఈసీ వేటు వేసిన సంగతి తెలిసిందే. ఎన్నికల విధుల్లో నిర్లక్ష్యం వహించారన్న కారణంతో డీసీపీ, ఏసీపీ, సీఐల్ని సస్పెండ్ చేసింది. హైదరాబాద్ ముషీరాబాద్ పరిధిలో నగదు పట్టుబడిన వ్యవహారంలో పక్షపాతం చూపించారన్న కారణంతో డీసీపీ వెంకటేశ్వర్లు, ఎసిపి యాదగిరి, సిఐ జహంగీర్‌లను విధుల నుంచి తప్పించింది ఈసీ. వీరిపై శాఖాపరమైన చర్యలు కూడా తీసుకోవాలని సీఎస్‌కు లేఖ రాసింది ఎన్నికల సంఘం. ఇప్పుడు ఏకంగా డీజీపీపైనే చర్యలు తీసుకోవడం గమనార్హం.