మూడు రాష్ట్రాల్లో బీజేపీ సాధించిన విజయాలపై స్పందించిన పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఇది కాంగ్రెస్ పార్టీ ఓటమేనని, ప్రజలది కాదన్నాని స్పష్టం చేశారు. ముఖ్యంగా హిందీ రాష్ట్రాల్లో జరిగిన మూడు అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమి, ఇండియా ప్రతిపక్ష కూటమిలో గుబులు రేపింది.
ప్రధాన ప్రతిపక్ష పార్టీ సొంతంగా ఎన్నికల్లో పోరాడాలన్న నిర్ణయం ఓట్ల విభజనకు ఎలా దారితీసిందో మిత్రపక్షాలు గుర్తుచేస్తున్నాయి. ఇండియా కూటమిలో ఇతర పార్టీలతో సీట్ల పంపకం లేకపోవడం వల్లే ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోయిందని తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ విశ్లేషించారు.
సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ కూడా కాంగ్రెస్ ఓటమిపై స్పందిస్త ప్రాంతీయ పార్టీలు తాము అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో బీజేపీపై పోరాటానికి నాయకత్వం వహించాలని సూచించారు. మూడు రాష్ట్రాల్లో ఇండియా కూటమి పార్టీల మధ్య పొత్తు లేకపోవడం వల్లే నష్టపోయినట్లు తెలిపారు.
తెలంగాణను కాంగ్రెస్ గెలుచుకుందని, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్‌లను కూడా గెల్చుకునేది కానీ కొన్ని ఓట్లను ఇండియా పార్టీలు చీల్చుకున్నట్లు మమతా బెనర్జీ తెలిపారు. ఇది వాస్తవం అని పేర్కొన్నారు. తాము ఆయా రాష్ట్రాల్లో సీట్ల పంపకం చేసుకుందామని ప్రతిపాదించినట్లు మమత గుర్తుచేశారు. కానీ కాంగ్రెస్ అంగీకరించకపోవడం వల్ల ఓట్ల విభజన జరిగి ఓడిపోయిందని మమత వెల్లడించారు.
అసెంబ్లీ వద్ద మమతా బెనర్జీ మాట్లాడుతూ.. ‘‘తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ విజయఢంకా మోగించింది. ఒకవేళ వాళ్లు ఇండియా కూటమిలోని మిత్రపక్షాలతో సీట్లు పంచుకుని ఉండుంటే.. బహుశా మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్ రాష్ట్రాల్లోనూ గెలుపొందేవారు. కానీ.. మిత్రపక్షాలతో సీట్లు పంచుకోకుండా ఒంటరిగా రంగంలోకి దిగడంతో ఓట్లు చీలాయి. ఇది వాస్తవం. ఎన్నికల ముందు సీట్ల పంపకాల విషయంపై మేము కాంగ్రెస్ పార్టీకి సూచనలు ఇచ్చాం. కానీ.. వాళ్లు పట్టించుకోలేదు. ఓట్లు చీలిపోవడం వల్లే కాంగ్రెస్ పార్టీ వాళ్లు ఆ మూడు రాష్ట్రాల్లో ఓడిపోయారు’’ అని వివరించారు.
ఐడియాలజీతో పాటు సరైన వ్యూహం కూడా ఉండాలని మమతా బెనర్జీ సూచించారు. సీట్ల పంపకం కుదిరితే.. 2024లో జరిగే ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి రాదని ఆమె చెబుతూ వచ్చే ఏడాది జరగనున్న సార్వత్రిక ఎన్నికలలోపు ఇండియా కూటమిలోని పార్టీలన్ని కలిసి పని చేసి, తప్పులను సరిదిద్దుకుంటామని పేర్కొన్నారు. ఈ ఎన్నికల్లో జరిగిన తప్పులు పునరావృతం కాకుండా చూసుకుంటామని చెప్పారు. వచ్చే ఏడాది జరిగే సార్వత్రిక ఎన్నికల్లో ఇండియా కూటమిలోని పార్టీలు కలిసికట్టుగా పని చేస్తేనే.. బీజేపీని ఓడించగలమని మమతా బెనర్జీ ఉద్ఘాటించారు.