భారత తొలి ప్రధాని నెహ్రూ చేసిన రెండు పొరపాట్ల వల్లనేనే జమ్మూ కాశ్మీర్ నష్టపోయిందని కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా జమ్ముకశ్మీర్ బిల్లులపై చర్చ సందర్భంగా లోక్ సభలో విమర్శించారు. మొదట కాల్పుల విరమణ ప్రకటించి, ఆపై కాశ్మీర్ సమస్యను ఐక్యరాజ్యసమితికి తీసుకెళ్లడం ద్వారా నెహ్రూ తప్పులు చేశారని పేర్కొన్నారు.
జవహర్లాల్ నెహ్రూ సరైన చర్యలు తీసుకుంటే, పాక్ ఆక్రమిత కాశ్మీర్ ఇప్పుడు భారతదేశంలో భాగమై ఉండేదని, ఇది చారిత్రాత్మక తప్పిదమని అమిత్ షా విమర్శించారు. దీనిపై విపక్షాలు మండిపడ్డాయి. అనంతరం రెండు బిల్లులు ఆమోదం పొందగానే విపక్షాలు వాకౌట్ చేశాయి.
పార్లమెంట్ శీతాకాల సమావేశాల మూడో రోజు లోక్ సభ జమ్ము కశ్మీర్ కు సంబంధించిన రెండు కీలక బిల్లుల్ని ఆమోదించింది.లోక్సభ ఆమోదించిన బిల్లుల్లో జమ్మూ కాశ్మీర్ రిజర్వేషన్ (సవరణ) బిల్లు, 2023, అలాగే జమ్మూ కాశ్మీర్ పునర్వ్యవస్థీకరణ (సవరణ) బిల్లు, 2023 ఉన్నాయి.
1947 లో పాకిస్తాన్ తో యుద్ధం సమయంలో, భారత్ గెలుస్తున్న సమయంలో, కాల్పుల విరమణకు అంగీకరించడం నాటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ చేసిన తొలి పెద్ద తప్పు అని అమిత్ షా తెలిపారు. నెహ్రూ ఆ తప్పు చేసి ఉండకపోతే, పీఓకే భారత్ లో అంతర్భాగమయ్యేదని పేర్కొన్నారు.
నెహ్రూ చేసిన ఆ పెద్ద తప్పు వల్ల భారీ భూభాగాన్ని భారత్ కోల్పోయిందని ఆరోపించారు. భారతీయ సైన్యం విజయం దిశగా వెళ్తున్న సమయంలో కాల్పుల విరమణకు అంగీకరించడం పొరపాటేనని ఆ తరువాత నెహ్రూ కూడా ఒప్పుకున్నారని అమిత్ షా గుర్తు చేశారు. అయితే, అది చిన్న పొరపాటు కాదని, అతి పెద్ద తప్పు అని షా స్పష్టం చేశారు.
జమ్మూకశ్మీర్ పునర్వ్యవస్థీకరణపై మాట్లాడుతూ గతంలో జమ్మూలో 37 అసెంబ్లీ స్థానాలు ఉండగా, ఇకపై 43 అసెంబ్లీ స్థానాలు ఉంటాయని, అలాగే, కశ్మీర్లో గతంలో 46 అసెంబ్లీ స్థానాలు ఉండగా, ఇకపై 47 ఉంటాయని వివరించారు. మొత్తంగా జమ్మూకశ్మీర్లో 90 అసెంబ్లీ సీట్లు ఉంటాయని తెలిపారు.
మరోవైపు, పాక్ ఆక్రమిత కశ్మీర్ భారత్ లో అంతర్భాగమేనని తాము విశ్వసిస్తున్నామని, అందువల్ల ఆ ప్రాంతం కోసం 24 అసెంబ్లీ స్థానాలను రిజర్వ్ చేశామని స్పష్టం చేశారు. మరోవైపు లోక్సభలో ప్రతిపక్ష సభ్యులు జమ్మూ కాశ్మీర్లో అసెంబ్లీ ఎన్నికలను నిర్వహించడానికి ప్రభుత్వం గడువు చెప్పాలని కోరారు. అయితే ఇందుకు కేంద్రం సిద్ధంగా ఉందని, నిర్ణయం తీసుకోవాల్సింది ఎన్నికల సంఘమేనని కేంద్రం స్పష్టత ఇచ్చింది.
వాస్తవానికి ఈ కేంద్రపాలిత ప్రాంతం 2018 నుంచి కేంద్ర పాలనలో ఉంది. ఈ చర్చలో హోంమంత్రి అమిత్ షా జోక్యం చేసుకుంటూ దేశానికి ఒకే జెండా, ఒకే రాజ్యాంగం ఉండేలా మోదీ ప్రభుత్వం హామీ ఇచ్చిందని గుర్తు చేశారు. రెండు బిల్లులను జులై 26న లోక్ సభలో ప్రవేశపెట్టి ఆమోదించారు.