తెలంగాణను అభివృద్ధి చేయడం కేవలం బిజెపికి మాత్రమే సాధ్యమని ఆ పార్టీ ఎమ్మెల్యే రాజాసింగ్ స్పష్టం చేశారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో మూడు రాష్ట్రాలను బిజెపి గెల్చుకుందని చెప్పారు. తెలంగాణలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కువ రోజులు ఉండదని, కెసిఆర్ చేసి వెళ్లిన అప్పులు తీర్చే క్రమంలో చతికిలపడుతుందని ఆయన జోస్యం చెప్పారు.
ఏడాది లోపే ఆ పార్టీ కూడా చేతులెత్తేస్తుందని, ఆపై తెలంగాణలో కూడా బిజెపి ప్రభుత్వమే వస్తుందని రాజా సింగ్ ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు నెరవేర్చాలంటే మరిన్ని అప్పులు చేయాలని చెబుతూ కేసీఆర్ దిగిపోతూ రాష్ట్రాన్ని అప్పుల పాలుచేశారని ఆరోపించారు. ఆ అప్పులు తీర్చలేక కాంగ్రెస్ నేతల్లో గందరగోళం మొదలవుతుందని చెప్పారు.
బుధవారం బిజెపి రాష్ట్ర కార్యాలయంలో జరిగిన బీఆర్ అంబేద్కర్ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొన్న రాజాసింగ్ ఈ సంచలన వాఖ్యలు చేశారు. కేసీఆర్ పథకాలను అమలు చేస్తామని రేవంత్ రెడ్డి చెప్పారని, దళితులను మోసం చేస్తే బీజేపీ వదిలిపెట్టదని స్పష్టం చేశారు. కాంగ్రెస్ ఆరు గ్యారంటీల పేరుతో మోసపూరిత హామీలను ఇచ్చిందని రాజాసింగ్ విమర్శించారు.
రాజ్యాంగాన్ని మార్చేస్తానన్న కేసీఆర్ ను ప్రజలు మార్చేశారని రాజాసింగ్ విమర్శించారు. ప్రజల్ని మోసం చేసిన కేసీఆర్ను ప్రజలు ఫామ్ హౌస్ కు పంపించేశారని ఎద్దేవా చేశారు. తెలంగాణలో రావణ రాజ్యం అంతమైందని రాజాసింగ్ విమర్శించారు. కేసీఆర్ దళితులను మోసం చేశారని చెబుతూ బీజేపీ ఒత్తిడితోనే అంబేడ్కర్ విగ్రహాన్ని కేసీఆర్ ఏర్పాటు చేశారని తెలిపారు.