తనను మోదీజీ అని పిలవద్దని, మోదీ అంటే సరిపోతుందని చెబుతూ పార్టీలో ఏకనాయకత్వం కాదు సమిష్టిత్వం అవసరం అని ప్రధాని నరేంద్ర మోదీ ఉద్బోధించారు. గురువారం ఆయన ఢిల్లీలో బిజెపి పార్లమెంటరీ పార్టీ సమావేశంలో మాట్లాడుతూ పార్టీలో ఏ కోణంలోనూ ప్రజాస్వామిక లక్షణాలు లోపించరాదని స్పష్టం చేశారు.
ఎప్పుడైతే వ్యక్తి ఆరాధనభావం నెలకొంటుందో అప్పుడు పరిస్థితి మరో విధంగా ఉంటుందని మోదీ హెచ్చరించారు. పార్టీ అందరిది, కొందరిదే అనుకోరాదని పిలుపు నిచ్చారు. కొన్ని అంశాలు సమాజంలో అతి త్వరగా రూపం సంతరించుకుంటాయని, కొన్ని విషయాలు ఇతరత్రా అపార్థాలకు దారితీస్తాయని, దీనిని నేతలు పార్టీ కార్యకర్తలు అంతా గ్రహించితీరాల్సి ఉందని హితువు చెప్పారు.
ఇప్పుడు బిజెపికి వ్యతిరేకంగా ఓ ప్రచారం జరుగుతోందని పేర్కొంటూ బిజెపి కేంద్రంలో బలంగా ఉందని, రాష్ట్రాల స్థాయిల్లోకి వచ్చే సరికి డీలా పడిందనే విమర్శలు వెలువడుతున్నాయనే వాదన సరికాదని ప్రధాని స్పష్టం చేశారు. రాష్ట్రాల్లోనూ పరిస్థితి బాగా ఉందని, ఇటీవలి అసెంబ్లీ ఎన్నికలలో ఫలితాలను బేరీజు వేసుకుంటే పరిస్థితి బాగా ఉందని చెప్పారు.
పైగా మన బలం రెండింతలు అయిందని, మిజోరంలో మెరుగుపడిందని, తెలంగాణలో బలం పుంజుకొంటోందని ప్రధాని గుర్తు చేశారు. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను విశ్లేషించుకుంటే విజయానికి కారణం అంతా కలిసికట్టుగా పనిచేయడమే అని తెలిపారు. కేంద్రంలో గతంలో అధికారంలో ఉంటూ వచ్చిన కాంగ్రెస్ పార్టీకి పలు సార్లు ఎదుర్కోవల్సి వచ్చిందని గుర్తు చేశారు.
ఏడుసార్లు ఈ క్రమంలో ఎన్నికలు రాగా ఇందులో ఒకే ఒక్కసారి ఆ పార్టీ తిరిగి అధికారం సంపాదించుకుందని మోదీ తెలిపారు. ఇదే దశలో వివిధ రాష్ట్రాలలో కలిపి బిజెపి 17 సార్లు ఓటు పోరుకు దిగాల్సి వచ్చిందని, ఇందులో పది సార్లు బిజెపి విజయం పొందిందని మోదీ గుర్తు చేశారు. గుజరాత్ వంటి రాష్ట్రాల్లో ఏడు సార్లు గెలిచామని, ఇక మధ్యప్రదేశ్లో ఇప్పటికీ విజయాలు సాధిస్తూనే వెళ్లుతున్నామని తెలిపారు.