తృణమూల్ కాంగ్రెస్ ఎంపి మహువా మొయిత్రాపై శుక్రవారం బహిష్కరణ వేటు పడింది. దీంతో ఆమె సభ్యత్వం రద్దు అయింది. డబ్బులు తీసుకుని లోక్ సభలో ప్రశ్నలు అడిగారని మహువాపై ఆరోపణలు ఉన్నాయి. ఎథిక్స్ కమిటీ ఛైర్మన్ నివేదికను లోక్ సభలో ప్రవేశపెట్టారు.
ఎథిక్స్ కమిటీ నివేదికపై లోక్ సభలో వాడీవేడి చర్చ జరిగింది. ఎథిక్స్ కమిటీ నివేదికను లోక్ సభ ఆమోదించింది. ఇక ఆమె ఎంపిగా కొనసాగడం తగదని స్వీకర్ ఓం బిర్లా వెల్లడించారు. ఆమె లోక్ సభ సభ్యత్వాన్ని రద్దు చేస్తూ మహువా మొయిత్రాను సభనుంచి బహిష్కరిస్తున్నట్లు ప్రకటించారు.
బీజపీ ఎంపీ, ఎథిక్స్ కమిటీ చైర్మన్ విజయ్ సోంకర్ 500 పేజీల నివేదికను సమర్పించారు. టీఎంసీ ఎంపీలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఎథిక్స్ కమిటీ నివేదికను ‘ఫిక్స్డ్ మ్యాచ్’గా అభివర్ణించాయి.
ఇది ముమ్మటికీ రాజకీయ కక్ష సాధింపేనని తృణమూల్ కాంగ్రెస్ ఎంపి సుదీప్ బంధోపాధ్యాయ తెలిపారు. అదానీకి వ్యతిరేకంగా మాట్లాడకుండా గొంతు నొక్కుతున్నారని సుదీప్ పేర్కొన్నారు. ఎథిక్స్ కమిటీ ఇచ్చిన నివేదికపై తమకు కొంత సమయం కావాలని, నివేదికపై ఓటింగ్ కు ముందు సభలో చర్చ జరపాలని టిఎంసి సహా పలువురు విపక్ష ఎంపిలు డిమాండ్ చేశారు.
నివేదికపై చర్చ సందర్భంగా కాంగ్రెస్ నేతలు అధీర్ రంజన్ చౌదరి, మనీష్ తివారీ తదితరులు మహువా మొయిత్రీని మాట్లాడేందుకు అవకాశం ఇవ్వాలని స్పీకర్‌కు విజ్ఞప్తి చేశారు. అయితే అందుకు స్పీకర్ నిరాకరించారు. స్పీకర్ వారించినప్పటికీ ప్రతిపక్షాలు ఆందోళన విరమించకపోవడంతో సభ మధ్యాహ్నానికి వాయిదా పడింది.
మహువా మొయిత్రాపై నిషాకాంత్ దూబే చేసిన ఆరోపణలకు సంబంధించి విచారణ జరిపిన ఎథిక్స్ కమిటీ 500 పేజీల నివేదికను నవంబర్ 9న ఆమోదించింది. మెయిత్రా అభ్యంతకరమైన, అనైతిక, నేర ప్రవర్తనకు పాల్పడ్డారని, ఆమెను 17వ లోక్‌సభ నుంచి బహిష్కరించాలని కమిటీ సిఫారసు చేసింది. 6:4 మెజారిటీతో తీర్మానాన్ని కమిటీ ఆమోదించింది.
పారిశ్రామికవేత్త హీరానాందనాని నుంచి మొయిత్రా డబ్బులు తీసుకుని లోక్‌సభలో ప్రశ్నలు అడిగారనే ఆరోపణలను ఎదుర్కొంటున్నారు. దీనిపై నవంబర్ 2న ఎథిక్స్ కమిటీ ముందు మెయిత్రా హాజరై తన వాదనను వినిపించారు.
మహువా మొయిత్రా నోటుకు ప్రశ్నల వ్యవహారంపై ఇప్పటికే సీబీఐ దర్యాప్తు జరుపుతోంది. అందుబాటులో ఉన్న సాక్ష్యాధారాల ఆధారంగా దానిని సాధారణ కేసుగా మార్చాలా లేక ఎఫ్ఐఆర్ నమోదు చేయాలా అన్నది సీబీఐ పరిశీలిస్తోంది. ఈ లోపే మహువా మొయిత్రాను లోక్ సభ నుండి బహిష్కరించారు.