ప్రధాని నరేంద్ర మోదీ చరిష్మా మరోసారి ప్రపంచయవనికపై నిలిచింది. ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన నేతగా మోదీ మరోసారి తన పట్టు నిలుపుకున్నారు. యూఎస్ ఆధారిత కన్సల్టెన్సీ సంస్థ మార్నింగ్ కన్సల్ట్ డిసెంబర్ 7న విడుదల చేసిన డేటా ప్రకారం మోదీ 76 శాతం రేటింగ్ తో అగ్రస్థానంలో నిలిచారు.
మెక్సికో అధ్యక్షుడు ఆండ్రెస్ మాన్యుయెల్ లోపెజ్ ఒబ్రాడోర్ 66 శాతం ఆమోదం రేటింగ్‌తో జాబితాలో రెండో స్థానంలో ఉన్నారు. స్విస్ కాన్ఫెడరేషన్ అధ్యక్షుడు అలైన్ బెర్సెట్ 58 శాతం ఆమోదం రేటింగ్‌తో మూడో స్థానంలో నిలిచారు. బ్రెజిల్ లులా డ సిల్వా, ఆస్ట్రేలియాకి చెందిన ఆంథోనీ అల్బనీస్ వరుసగా నాలుగు, ఐదో స్థానాల్లో ఉన్నారు.
అయితే అమెరికా ప్రెసిడెంట్ జో బిడెన్ 37 శాతం ఆమోదం రేటింగ్‌తో ఎనిమిదో స్థానానికి పరిమితమయ్యారు. చెక్ రిపబ్లిక్ ప్రధాన మంత్రి పీటర్ ఫియాలా అతి తక్కువగా 16 శాతం రేటింగ్ పొందారు.
బ్రిటన్ ప్రధాన మంత్రి రిషి సునక్ 25 శాతం రేటింగ్ పొందారు. అయితే నిరాకరణల రేటింగ్ విషయానికొస్తే మోదీని 18 శాతం ప్రజలు వద్దనుకుంటున్నారు. వారం రోజుల పాటు ఆయా దేశాల్లో స్టడీ చేసి రిపోర్ట్ విడుదల చేశామని కన్సల్టెన్సీ అధికారులు తెలిపారు.
మోదీ అంతర్జాతీయ రేటింగ్ లో అగ్రభాగాన నిలవడంపై బీజేపీ నేతలు ఆయన నాయకత్వాన్ని కొనియాడారు. మోదీ మ్యాజిక్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఈ సర్వే ప్రధాని పనితీరుకు నిదర్శనం అని చెబుతున్నారు.