గత పార్లమెంట్ సమావేశాల సందర్భంగా బీజేపీ ఎంపీ రమేష్ బిధూరి నుంచి మతపరమైన దూషణలు ఎదుర్కొన్న బీఎస్పీ ఎంపీ డానిష్ అలీని ఆ పార్టీ బహిష్కరించింది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినందుకు క్రమశిక్షణ చర్యలు తీసుకున్నట్లు మాయావతి నేతృత్వంలోని బీఎస్పీ పేర్కొంది. ఈ మేరకు శనివారం ఒక ప్రకటన విడుదల చేసింది.
‘పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడకూడదని మీకు గతంలోనే స్పష్టంగా చెప్పాం. పార్టీ కోసం పని చేసే షరతుతో అమ్రోహా నుంచి టిక్కెట్ ఇచ్చాం. అయితే ఆ సమయంలో చేసిన వాగ్దానాలను మీరు మర్చిపోయారు. అందుకే మిమ్మల్ని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నాం’ అని అందులో పేర్కొంది. అయితే ఎంపీ డానిష్ అలీ సస్పెన్షన్కు నిర్దిష్ట కారణాన్ని వెల్లడించలేదు.
కాగా, ఈ ఏడాది సెప్టెంబర్లో చంద్రయాన్-3 మిషన్పై చర్చ సందర్భంగా బీజేపీ ఎంపీ రమేష్ బిధురి చేసిన వ్యాఖ్యలపై రాజకీయ దుమారం చెలరేగింది. ప్రధాని మోదీని కించపరిచే పదాలను ఉపయోగించారంటూ బీఎస్పీ ఎంపీ డానిష్ అలీని బీజేపీ ఎంపీలు లక్ష్యంగా చేసుకున్నారు.
ఆయనపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేయడంతో బీజేపీ ఎంపీ బిధురికి షోకాజ్ నోటీస్ జారీకి దారితీసింది. అయితే గురువారం లోక్సభ ప్రివిలేజెస్ కమిటీ సమావేశంలో అలీపై చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలకు బీజేపీ ఎంపీ బిధురి విచారం వ్యక్తం చేశారు.
మరోవైపు శుక్రవారం లోక్సభ నుంచి బహిష్కరించిన తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) నాయకురాలు మహువా మోయిత్రాకు న్యాయం చేయాలని బీఎస్పీ ఎంపీ డానిష్ అలీ డిమాండ్ చేశారు. బాధితురాలిని దోషిగా చూడవద్దంటూ రాసి ఉన్న ప్లకార్డు మెడలో వేసుకుని నిరసన తెలిపారు. అలాగే తనను దూషించిన బీజేపీ ఎంపీ బిధురిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సంఘటన నేపథ్యంలో ఆయనను బీఎస్పీ నుంచి తొలగించినట్లు తెలుస్తున్నది.