ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రిగా విష్ణు డియో సాయ్ ఎంపికయ్యారు. గత వారం రోజులుగా ఛత్తీస్‌గఢ్ సీఎం ఎంపిక కోసం తీవ్ర కసరత్తు చేసిన బీజేపీ అధిష్ఠానం ఆఖరికి విష్ణు డియో సాయ్ వైపు మొగ్గు చూపింది. ఆదివారం ఉదయం సమావేశమైన బీజేపీ శాసనసభాపక్షం విష్ణు డియోను సీఎంగా ఎన్నుకున్నట్లు ప్రకటించింది.
విష్ణు డియో సాయ్ గతంలో ఛత్తీస్‌గఢ్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా పనిచేశారు. అంతేగాక ప్రధాని నరేంద్రమోదీ తొలి క్యాబినెట్లో కేంద్ర మంత్రిగా కూడా పనిచేశారు. గనులు, ఉక్కు మంత్రిత్వ శాఖకు ప్రాతినిథ్యాన్ని వహించారు.2020 నుంచి 2022 వరకు బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడిగా పని చేశారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో కుంకురి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి, విజయం సాధించారు. సిట్టింగ్ ఎమ్మెల్యే, కాంగ్రెస్‌కు చెందిన యూడీ మింజ్‌ను ఓడించారు. ఆయనకు 87,604 ఓట్లు పోల్ అయ్యాయి.
గిరిజన నాయకుడు, వివాదరహితుడు కావడం వల్ల ఆయన అభ్యర్థిత్వానికి అంగీకారం తెలిపింది. విష్ణుదేవ్ సాయి పేరును అధికారికంగా ప్రకటించనుంది. కాగా- ఛత్తీస్‌గఢ్‌లో జరిగిన మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోరంగా ఓడిపోయిన విషయం తెలిసిందే.
భూపేష్ బఘేల్ సారథ్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం మట్టికరిచింది. బీజేపీ ఇక్కడ ఘన విజయాన్ని సాధించింది. మొత్తం 90 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్న ఛత్తీస్‌గఢ్‌లో బీజేపీ 54 స్థానాల్లో విజయదుందుభి మోగించింది. కాంగ్రెస్ పార్టీ 35 స్థానాలకే పరిమితమైంది.