ఇండియా కూటమి తదుపరి సమావేశాన్ని ఈనెల 19న ఢిల్లీలో నిర్వహించే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. 2024 లోక్‌సభ ఎన్నికలకు సీట్ల సర్దుబాటు, కీలకమైన సానుకూల అజెండా రూపకల్పన, ఉమ్మడి ర్యాలీల ఏర్పాటు కూటమి ముందున్న సవాళ్లలో ప్రధానమైనవి.
పార్టీల నేతల అందుబాటు విషయాన్ని దృస్టిలో పెట్టుకుని ఇప్పటికైతే 19వ తేదీన ఈ సమావేశం ఖరారు అయిందని కాంగ్రెస్ నేత జైరాం రమేష్ తెలిపారు. ఇండియా భేటీ చాలా కాలంగా వాయిదా పడుతూ వస్తోంది.
ప్రధాని మోదీకి కౌంటర్‌గా ‘నేను కాదు.. మేము’ అనే నినాదంతో ముందుకు వెళ్లాలని ఈ సమావేశంలో నిర్ణయించే అవకాశం ఉందని కాంగ్రెస్ సీనియర్ నేత ఒకరు తెలిపారు. మధ్యభారతంలోని మూడు కీలక రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ తాజా ఓటమి నేపథ్యంలో సీట్ల సర్దుబాటులో ఆ పార్టీకి గడ్డు పరిస్థితి ఎదురుకానుందని భావిస్తున్నారు.
ఇదిలా ఉండగా, ఎన్నికల ప్రచార దశలో , ప్రత్యేకించి మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ సీట్ల సర్దుబాట్ల విషయంలో మొండిగా వ్యవహరించిందని, పెద్దన్న పాత్ర వహించిందని , కాంగ్రెస్‌తో కలిసి సాగడం కుదరదని సమాజ్‌వాది పార్టీ నేత అఖిలేష్ యాదవ్ మండిపడ్డారు. అయితే అఖిలేశ్‌తో ఉన్న విభేదాలను కాంగ్రెస్ పరిష్కరించుకుందని ఆ పార్టీవర్గాలు తెలిపాయి.
దీంతో కూటమి సమావేశంలో అఖిలేశ్ పాల్గొనే అవకాశం ఉంది. టీఎంసీ అధినేత్రి మమత ఈనెల 17-19మధ్యలో ఢిల్లీలో ఉంటారు. ఆమె కూడా సమావేశంలో పాల్గొనే అవకాశం ఉందని భావిస్తున్నారు.
కాగా, ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలకు అనుకూలంగా రాజకీయాలు చేసేవారు గాంధీ కుటుంబం చుట్టూ ఉంటే గనుక, 2024 ఎన్నికల్లో కాంగ్రె్‌సకు మరింత గడ్డు పరిస్థితి ఎదురుకానుందని శివసేన (యూబీటీ) నేత సంజయ్ రౌత్ హెచ్చరించారు. మధ్యప్రదేశ్ పీసీసీ అధ్యక్షుడు కమల్‌నాథ్‌ను ఉద్దేశించి సంజయ్‌రౌత్ ఈ వ్యాఖ్యలు చేశారు.
ఈవీఎంల పనితీరుపైనా రౌత్ సందేహాలు వ్యక్తం చేశారు. మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పోస్టల్ బ్యాలెట్ లెక్కించినంత సేపూ 199 నియోజకవర్గాల్లోనూ కాంగ్రెస్ అధిక్యంలో ఉందని గుర్తుచేశారు.