కాంగ్రెస్ పార్టీ అంటేనే అవినీతికి, దోపిడీకి గ్యారంటీ అని భారతీయ జనతా పార్టీ (బీజేపీ) పార్లమెంటరీ బోర్డు సభ్యుడు డా. కే. లక్ష్మణ్ ధ్వజమెత్తారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అంటే అభివృద్ధికి, పేదల సంక్షేమానికి గ్యారంటీ అని ఆయన తెలిపారు. జార్ఖండ్‌లో కాంగ్రెస్ నేత ధీరజ్ సాహు నివాసంలో బయటపడ్డ కోట్లాది రూపాయల నోట్ల కట్టల గురించి ప్రస్తావిస్తూ విచ్ఛిన్నకర రాజకీయాలకు కాంగ్రెస్ చిరునామాగా మారిందని విమర్శించారు.
సాహు నివాసంలో దొరికిన నగదును లెక్కించే మెషీన్లు సైతం పాడైపోయాయని, 5 రోజులుగా లెక్కించే పని కొనసాగుతోందని చెప్పారు. ఇప్పటి వరకు రూ. 300 కోట్లు లెక్కించగలిగారని, ఇంకా లెక్కించాల్సింది చాలా ఉందని తెలిపారు. సాహు కాంగ్రెస్ పార్టీ తరఫున మూడు పర్యాయాలు రాజ్యసభకు ఎన్నికయ్యారని గుర్తు చేశారు.
ఇలాంటి అవినీతిపరులకు కాంగ్రెస్ కొమ్ముకాస్తోందని లక్ష్మణ్ ఆరోపించారు. ఎందుకంటే సాహు వంటి నేతలు కాంగ్రెస్ పార్టీకి ఏటీఎంలా మారారని విమర్శించారు. ధీరజ్ సాహు వ్యవహారంపై ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే, రాహుల్, ప్రియాంక గాంధీ ఎవరూ మాట్లాడడం లేదని డా. లక్ష్మణ్ ప్రశ్నించారు.
యూపీఏ హయాంలో రూ. 12 లక్షల కోట్ల విలువైన కుంభకోణాలు జరిగాయని దుయ్యబట్టారు. విపక్ష కూటమి (ఇండియా) నేతల అవినీతిని వెలికి తీస్తుంటే దర్యాప్తు సంస్థలపై బురద జల్లుతున్నారని మండిపడ్డారు. అవినీతి పరులు తిన్న సొమ్మంతా ప్రధాని మోదీ కక్కిస్తారని లక్ష్మణ్ స్పష్టం చేశారు. జార్ఖండ్ రాష్ట్రంలో కుంభకోణాలు పెరిగిపోయాయని ఆరోపించారు.
చిన్న అవినీతి ఆరోపణ కూడా లేకుండా ప్రధాని మోదీ పాలన అందిస్తుంటే ప్రతిపక్షాలు సహించలేకపోతున్నాయని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా ప్రజలు మోదీకి బ్రహ్మరథం పడుతున్నారని, చెబుతూ మరోసారి బీజేపీ గెలుపొంది మోడీ మూడో పర్యాయం ప్రధాని కావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.
అంతేకాదు, మోదీ నేతృత్వంలో భారతదేశం ప్రపంచంలోనే 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా కూడా ఎదుగుతుందని ఆయన చెప్పారు. అవినీతిపరులకు ప్రజలు బుద్ధి చెప్పాలని లక్ష్మణ్ కోరారు.
కాగా, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి ఎంపికపై ఒకట్రెండు రోజుల్లో నిర్ణయం వెలువడుతుందని డా. లక్ష్మణ్ చెప్పారు. ప్రజాస్వామ్యయుతంగా ఎమ్మెల్యేల అభిప్రాయాలు తెలుసుకుని, ఆ ప్రకారం పార్టీ నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. సిట్టింగ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌ను కొనసాగించాలా? లేదా కొత్త వ్యక్తిని ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెట్టాలా? అన్న విషయం కూడా ఎమ్మెల్యేల అభిప్రాయం మేరకే నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.