పాకిస్థాన్‌లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. ఆర్మీయే లక్షంగా ఆత్మాహుతి దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో సుమారు 23 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 27 మందికి పైగా గాయపడ్డారు.. ఈ దాడిని పాకిస్తాన్ తాలిబాన్‌కి అనుబంధంగా ఉన్న ఉగ్రవాదులు జరిపినట్లుగా అధికారులు తెలుపుతున్నారు.
ఖైబర్ ఫంఖ్తుఖ్వా ప్రావిన్స్‌లోని డేరా ఇస్మాయిల్ ఖాన్ జిల్లాలోని ఓ పాఠశాల భవనాన్ని పాక్ సైన్యం తాత్కాలిక సైనిక స్థావరంగా ఏర్పాటు చేసుకుంది. ఈ ఆర్మీ బేస్‌పై మంగళవారం తెల్లవారు జామున పేలుడు పదార్థాలు నిండిన కారుతో ఉగ్రవాదులు పాఠశాలభవనాన్ని ఢీకొట్టారు.
ఆత్మాహుతి బాంబర్లు సెక్యూరిటీ కాంపౌండ్ లోకి చొరబడి ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. భవనం లోని మూడు గదులు కూలిపోయాయి. అయితే దాడి జరిగిన సమయంలో సైనికులతో పాటు ఇతరులు నిద్రలో ఉన్నారు.. మరణించిన వారిలో చాలా మంది సివిల్ డ్రెస్సుల్లో ఉన్నారు.
అఫ్గానిస్థాన్ సరిహద్దు లోని గిరిజన ప్రాంతాలకు సమీపంలో జరిగిన ఈ దాడికి తామే బాధ్యులమని పాకిస్థాన్‌కు చెందిన తెహ్రీక్ ఏ జిహాద్ పాకిస్థాన్ (టిజెపి) అనే ఉగ్రవాద సంస్థ ప్రకటించింది.
