పార్లమెంట్ సమావేశాల వేళ లోక్ సభలో కలకలం రేగింది. లోక్ సభలోకి ఇద్దరు ఆగంతుకులు చొరబడ్డారు. సభలో టియర్ గ్యాస్ వదిలి భయాందోళనలను సృష్టించారు. ఈ గందరగోళంతో ఎంపీలు భయపడి పరుగులు తీశారు. కొందరు ఎంపీలు వారిని పట్టుకుని భద్రతా సిబ్బందికి అప్పగించారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.
లోక్ సభ సెక్యూరిటీ వైఫల్యం వల్లే దుండగులు లోపలికి ప్రవేశించారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. విజిటర్స్ గ్యాలరీ నుంచి సభ్యుల మధ్యలోకి దూకి ముందుకు దూసుకెళ్లడం వీడియోలో కనిపిస్తోంది. కాగా, 2001 లో ఇదే రోజు పార్లమెంట్ పై దాడి జరిగింది. ఈ దాడికి నేటితో 22 ఏళ్లు పూర్తయ్యాయి.
సరిగ్గా ఇదే రోజు ఆగంతుకులు లోక్ సభలో చొరబడడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇద్దరు యువకులు లోక్ సభలోకి చొరబడి ఎంపీలపై టియర్ గ్యాస్ వదలడం వీడియోలో కనిపిస్తోంది. దుండగుల వద్ద ఆయుధాలు కూడా ఉండి ఉండొచ్చని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
అత్యంత భద్రత ఉండే పార్లమెంట్ ఆవరణలోకి ప్రవేశించడమే కష్టం కాగా.. ఈ దుండగులు ఇద్దరు పార్లమెంట్ లోపలికి ప్రవేశించడంపై ఆశ్చర్యం వ్యక్తమవుతోంది. లోక్ సభ సెక్యూరిటీపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ అనూహ్య పరిణామంతో స్పీకర్ సభను వాయిదా వేశారు.
సభలో వదిలిన పొగ.. ప్రమాదకరమైనది కాదు అని లోక్ సభ స్వీకర్ తెలిపారు. మైసూర్ ఎంపి ప్రతాప్ సింహా పేరుతో పాస్ తీసుకుని సభలోకి దుండగులు వచ్చినట్లు గుర్తించారు. ఇద్దరు ఆగంతకులను నీలం, అమోల్ షిండే గా గుర్తించి వారిని అదుపులోకి తీసుకున్నారు.
లోక్ సభలో జరిగిన ఘటనపై స్పందించిన సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పి) ఎంపి డింపుల్ యాదవ్ ట్వీట్ చేశారు. ‘‘ఇది లోక్‌సభలో భద్రతా ఉల్లంఘన అని.. ఇక్కడికి వచ్చే వారందరూ – అది సందర్శకులు లేదా రిపోర్టర్లు.. వారు ట్యాగ్‌లను కలిగి ఉండరు. కాబట్టి ప్రభుత్వం దీనిపై దృష్టి పెట్టాలని నేను భావిస్తున్నాను. ఇది పూర్తి భద్రతా లోపం అని నేను భావిస్తున్నాను. లోక్‌సభ లోపల ఏదైనా జరిగి ఉండవచ్చు…” అంటూ డింపుల్ యాదవ్ ట్వీట్ చేశారు.
ఈ ఘటనపై శివసేన (యూబీటీ) ఎంపీ అరవింద్ సావంత్ స్పందిస్తూ ఆగంతకుల దుశ్చర్యతో సభలో కలకలం రేగిందని, అయితే ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదని చెప్పారు. ఆగంతకులు కిందకు దూకినప్పుడు చివరి బెంచీల్లో సభ్యులు ఎవరూ లేకపోవడంతో వారిని సులభంగా పట్టుకున్నారని అన్నారు. కాగా లోక్‌సభలో ఆగంతకులు గ్యాస్ వదలడం తీవ్ర భద్రతా వైఫల్యమని కాంగ్రెస్ ఎంపీ కార్తీ చిదంబరం అన్నారు.
సభ జరుగుతుండగా అనూహ్యంగా 20 ఏండ్ల వయసున్న ఇద్దరు వ్యక్తులు విజిటర్స్ గ్యాలరీ నుంచి సభలోకి దూకి పసుపు రంగు గ్యాస్‌ను వదిలారని చెప్పారు. వారు కొన్ని నినాదాలు చేశారని, వారు వదిలిన గ్యాస్ విష వాయువు కావచ్చని, ఇది తీవ్ర భద్రతా వైఫల్యమని కార్తీ చిదంబరం పేర్కొన్నారు. 2001లో డిసెంబర్ 13న పార్లమెంట్‌పై దాడి జరగ్గా సరిగ్గా ఇదే రోజు ఈ ఘటన జరగడం గర్హనీయమని, ఇది ముమ్మాటికీ భద్రతా వైఫల్యమేనని కార్తీ చిదంబరం వ్యాఖ్యానించారు.