యావత్ దేశాన్ని కుదిపేసిన పార్లమెంట్లో పొగబాంబు ఘటనలో సూత్రధారి ఓ `ట్యూషన్ టీచర్’ అని ఢిల్లీ పోలీసులు భావిస్తున్నారు. అతను ఇప్పటివరకు పట్టుబడలేదు. ఘటన జరిగిన వెంటనే రంగంలోకి దిగిన దర్యాప్తు సంస్థలు ఇప్పటికి ఐదుగురిని అదుపులోకి తీసుకున్నాయి. కానీ, దాడి వెనుక మాస్టర్‌మైండ్ లలిత్ ఝా మాత్రం ఇంకా పరారీలోనే ఉన్నాడు.
అయితే, అతడి చరిత్రకు సంబంధించి ఇప్పుడిప్పుడే పలు అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. జాతీయ మీడియా కథనాల ప్రకారం, లలిత్ ఝా కోల్‌కతాలో దాదాపు ఏడాదిన్నర పాటు ఓ ఇంట్లో అద్దెకు ఉన్నాడట. బారాబజార్ ప్రాంతంలో అతడు ఉండేవాడని తెలుస్తోంది. మీడియాలో అతడి ఫొటో చూసి అక్కడి స్థానికులు ఆశ్చర్యపోయారు.
తను టీచర్ అని లలిత్ చెప్పుకుతిరిగేవాడని పేర్కొన్నారు. ఇరుగుపొరుగు పిల్లలందరూ అతడిని ట్యూషన్ సర్గా పిలిచేవారని తెలిపారు. మరో విషయం ఏంటంటే ఆ ఇంటి ఓనర్‌తో లలిత్ ఝా నేరుగా అద్దె ఒప్పందం కుదుర్చుకోలేదని స్థానికులు చెబుతున్నారు. మరో వ్యక్తి ద్వారా లలిత్ ఆ ఇంట్లో చేరినట్టు తెలుస్తోంది.
కానీ ఈ విషయమై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. ఇక లలిత్ ఇంటి బాగోగులు రవి అగర్వాల్ అనే మరో వ్యక్తి చూసుకునేవాడని ఇరుగుపొరుగు చెబుతున్నారు. అతడితో మాట్లాడుకున్నాక లలిత్ ఆ ఇంట్లో దిగాడట. ఆ ఇంటి ఓనర్ విదేశాల్లో ఉంటున్నాడు. మరోవైపు, రవి అగర్వాల్ ఆచూకీ కూడా లభ్యం కాలేదు.
అయితే, లలిత్‌ను ఆ ఇంట్లో చూసి ఏడాదికి పైనే అయ్యిందని స్థానికులు చెబుతున్నారు. స్థానికంగా ఉన్న ఓ స్వచ్ఛంద సంస్థతో కూడా లలిత్‌కు సంబంధాలు ఉన్నాయని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో లలిత్ కోసం పోలీసులు విస్తృతంగా గాలిస్తున్నారు. లలిత్ చివరిసారిగా ఢిల్లీకి 125 కిలోమీటర్ల దూరంలో ఉన్న నీమ్రానాలో కనిపించినట్లు పోలీసులు పేర్కొన్నారు.
నిరుద్యోగం, రైతుల సమస్యలు, మణిపూర్ హింస వంటి అంశాలపై నిరసన వ్యక్తం చేస్తూ పార్లమెంట్‌పై దాడి చేయాలని లలిత్ ఝా నేతృత్వంలోనే కుట్ర జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు. 22 ఏండ్ల క్రితం డిసెంబర్ 13వ తేదీనే ఉగ్రవాదులు పార్లమెంట్‌పై దాడి చేసి 9 మందిని పొట్టన పెట్టుకున్న రోజునే ఈ కలర్ స్మోక్ దాడి చేయాలని లలిత్ నిర్ణయించినట్లు తెలిసింది.
లలిత్ సూచనల మేరకు మిగతా ఐదుగురు విధ్వంసానికి పాల్పడినట్లు పోలీసుల విచారణలో తేలింది. కోల్‌కతా చెందిన లలిత్ వృత్తిరీత్యా టీచర్. భగత్ సింగ్‌ను ఆదర్శంగా తీసుకున్న లలిత్ తాను దేశం దృష్టిని ఆకర్షించాలనే ప్రయత్నంలో భాగంగా ఈ కుట్రకు ప్రణాళిక రచించినట్లు తెలిసింది.
లలిత్ ఝా బుధవారం ఉదయం సాగర్ శర్మ, మనోరంజన్, అమోల్ షిండే, విక్కీ శర్మను గురుగ్రామ్‌కు పిలిపించుకుని మాట్లాడారు. అనంతరం దాడికి పాల్పడ్డారు. పార్లమెంట్ బయట కలర్ స్మోక్‌ను వదిలిన అనంతరం వీడియోను చిత్రీకరించి, సోషల్ మీడియాలో విడుదల చేసి లలిత్ పారిపోయినట్లు తెలిసింది.
