మహారాష్ట్రలో ప్రభుత్వాలు మారినా రైతుల వెతలు మాత్రం తీరటం లేదు. దేశానికి వెన్నెముకగా చెప్పుకునే మన రైతులు వ్యవసాయం గిట్టుబాటుకాక అప్పుల ఊబిలో కూరుకుపోయి ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఈ ఏడాది 10 నెలల్లో మహారాష్ట్రలో 2,366 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని ఆ రాష్ట్ర మంత్రి అనిల్ భాయిదాస్ పాటిల్ స్వయంగా అసెంబ్లీకి నివేదించారు.
అత్యధికంగా అమరావతి రెవిన్యూ డివిజన్లో 951 మంది రైతులు మరణించారని చెప్పారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే కునాల్ పాటిల్ అడిగిన ప్రశ్నకు మంత్రి ఈ మేరకు లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. ఈ ఏడాది జనవరి నుంచి అక్టోబర్ వరుకు ప్రభుత్వానికి అందిన నివేదికల ప్రకారం మహారాష్ట్రలో మొత్తం 2.366 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని తెలిపారు.
వారిలో ఛత్రపతి శంభాజీనగర్ డివిజన్లో 877 మంది, నాగపూర్ డివిజన్లో 257 మంది, నాసిక్ డివిజన్లో 254 మంది, పుణే డివిజన్లో 27 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని, వారి కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం రూ.1 లక్ష చొప్పున సాయం అందించినట్టు చెప్పారు.
గత జనవరి నుంచి జూన్ మధ్య మరాఠ్వాడాలో 483 మంది ఆత్మహత్య చేసుకున్నట్లు అధికారిక లెక్కలు చెప్తున్నాయని, వాస్తవానికి ఆ సంఖ్య ఎక్కువగానే ఉంటుందని రైతు సంఘాలు చెబుతున్నాయి. మరణించిన రైతుల్లో 67 మంది కుటుంబాలు ఎక్స్‌గ్రేషియాకు అర్హత లేవని అధికారులు తేల్చారని ఆరోపించాయి.
రూ.1 లక్ష పరిహారం ఇస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించినా వాస్తవానికి రూ.30 వేలు మాత్రమే నగదు రూపంలో ఇస్తున్నారని, మిగతా రూ.70 వేలు ఫిక్స్డ్ డిపాజిట్ చేసి భవిష్యత్తులో క్లెయిమ్ చేసుకునేలా చేశారని తెలిపాయి.