ఆంధ్ర ప్రదేశ్ లో నకిలీ ఓట్ల వ్యవహారంపై కేంద్ర ఎన్నికల సంఘం వద్ద ప్రధాన రాజకీయ పార్టీలు పరస్పరం ఫిర్యాదులు చేస్తున్నారు. ఇప్పటికే పలుసార్లు వైసిపి, టిడిపి పరస్పర ఫిర్యాదులు చేసుకోగా తాజాగా గురువారం మళ్లీ వారితో పాటు బీజేపీ కూడా ఫిర్యాదు చేసింది.
కేంద్ర ఎన్నికల సంఘం అధికారులతో వైసిపి ఎంపిలు వి విజయసాయిరెడ్డి, ఎ అయోధ్యరామిరెడ్డి, ఎస్ నిరంజన్‌రెడ్డి, భీశెట్టి సత్యవతి, మద్దిల గురుమూర్తి సమావేశమయ్యారు. అనంతరం విజయసాయిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఐదు అంశాలు ఇసికి వివరించామని, చట్ట విరుద్ధంగా టిడిపి వ్యవహరిస్తుందని తెలిపామని పేర్కొన్నారు.
ప్రజా ప్రాతినిధ్య చట్టం నిబంధనలు ఉల్లంఘించేలా ‘మై పార్టీ డాష్ బోర్డ్ డాట్ కామ్’ ద్వారా ఓటర్ వివరాలు టిడిపి నమోదు చేస్తుందని ఆయన ఆరోపించారు. అమెరికా సర్వర్‌లో ఓటర్ డేటా స్టోర్ చేస్తున్నారని పేర్కొన్నారు. సేవామిత్ర అనే అప్లికేషన్‌పై గతంలో చేసిన ఫిర్యాదు మేరకు నమోదైన ఎఫ్ఐఆర్లో పురోగతి లేదని ఇసికి తెలిపామని చెప్పారు.
టిడిపి చట్ట వ్యతిరేక కార్యకలపాలపై చర్యలు తీసుకోవాలని కోరామని పేర్కొంటూ 30 ఇళ్లకు ఏజెంట్లను నియమించి ఇమేజ్ మోడ్‌లో ఉన్న డేటాను ఎక్సెల్ ఫార్మాట్లోకి మారుస్తున్నారని ఆరోపించారు. టిడిపి మేనిఫెస్టో డాట్ కామ్ ఎన్నికల నియమావళిని ఉల్లంగిస్తోందని కూడా ఫిర్యాదు చేశారు.
వ్యక్తి పేరు, ఇంటిపేరు, తండ్రిపేరు, అడ్రస్ మార్చడంతో నకిలీ ఓట్లు చేరుస్తున్నారని విమర్శించారు. ఆధారాలతో సహా అన్ని అంశాలూ ఇసికి అందించామని చెబుతూ బాబు భవిష్యత్‌కు గ్యారెంటీ కార్డు పేరుతో ఓటర్ల డేటా టిడిపి సేకరిస్తుందని ధ్వజమెత్తారు. తెలంగాణలో ఎన్నికలైన తరువాత ఓటర్లు ఎపిలో ఓటు నమోదు చేసుకునేలా టిడిపి డ్రైవ్ నిర్వహిస్తుందని తెలిపారు.
మరోవైపు ఢిల్లీలో కేంద్ర ఎన్నికల కమిషన్‌ను టిడిపి ఎంపిలు కనకమేడల రవీంద్ర కుమార్, గల్లా జయదేవ్, కె రామ్మోహన్నాయుడు కలిశారు. ఈ సందర్భంగా ఎపిలో నకిలీ ఓట్ల నమోదు, టిడిపి సానుభూతిపరుల ఓట్ల తొలగింపుపై ఇసికి టిడిపి ఎంపిలు ఫిర్యాదు చేశారు.
అనంతరం ఎంపి కనకమేడల రవీంద్ర కుమార్ మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో జరుగుతున్న ఓట్ల అవకతవకలపై ఫిర్యాదు చేశామని తెలిపారు. ఎపిలో ప్రభుత్వం ఏ విధంగా ప్రజలను తప్పుదోవ పట్టించిందో చెప్పామని పేర్కొంటూ దొంగే దొంగ అన్నట్టు వైసిపి నేతల తీరు ఉందని ధ్వజమెత్తారు.
యంత్రాగాన్ని, రాష్ట్ర ప్రభుత్వ అధికారులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఆయన విమర్శించారు. 10 లక్షల ఓటర్లు ఫిర్యాదు చేశారని, వాటిపై చర్యలు తీసుకోవాలని కోరామని వెల్లడించారు. ఎన్నికల అధికారులు 22న ఎపిలో పర్యటిస్తామని చెప్పారని తెలిపారు. చర్యలు తీసుకుంటామని ఇసి అధికారులు హమీ ఇచ్చారని చెప్పారు.
కాగా, నకిలీ ఓట్ల నమోదు, ఓట్ల తొలగింపుపై బిజెపి కూడా కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి, కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరి, ఎంపి సిఎం రమేష్, బిజెపి జాతీయ కార్యదర్శి సత్యకుమార్.. ఇసిని కలిసి ఫిర్యాదు చేశారు.
అనంతరం పురందేశ్వరి మీడియాతో మాట్లాడుతూ.. కొంతకాలంగా ఎపిలో ఓటర్ లిస్ట్ టాంపరింగ్ జరుగుతుందన్న వార్తల నేపథ్యంలో సిఇసిని కలిశామని చెప్పారు. దొంగ ఓట్లకు సంబంధించిన వాటికి రుజువు ఇచ్చామని, కేంద్ర ఎన్నికల సంఘం సానుకూలంగా స్పందించిందని తెలిపారు. వలంటీర్ వ్యవస్థలో లోపాలు ఉన్నాయని పురందేశ్వరి ఆరోపించారు.