లోక్‌సభలో భద్రతా వైఫల్య ఘటనలో ఆరో వ్యక్తి, కీలక నిందితుడుగా భావిస్తున్న లలిత్ ఝాను పాటియాలా హౌస్ కోర్టు శుక్రవారంనాడు ఏడు రోజుల పోలీస్ కస్టడీకి పంపింది. ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ స్పెషల్ సెల్ ఈ ఘటనపై దర్యాప్తు జరుపుతోంది. ఢిల్లీ పోలీసులు 15 రోజలు కస్టడీ కోరగా.. కోర్టు 7 రోజుల కస్టడీకి అనుమతించింది.
బీహార్‌కి చెందిన లలిత్ ఝా కోల్‌కతాలో టీచర్‌గా పనిచేస్తున్నారని, రెండేళ్ల క్రితం కోల్‌కతా నుండి వెళ్లిపోయినట్లు తెలిపారు. గురువారం సాయంత్రం పోలీసులకు లొంగిపోవడంతో వెంటనే అతన్ని అరెస్టు చేశారు. భద్రతా ఉల్లంఘనల ఘటనకు తెరవెనుక సూత్రధారిగా భావిస్తున్న లలిత్ ఝూ పోలీసు విచారణలో కీలక వివరాలు వెల్లడించినట్టు తెలుస్తోంది.
విప్లవ భావజాలం గల వీళ్లంతా దేశం దృష్టిని ఆకర్షించేందుకు ఈ ఘటనకు పాల్పడినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. ఈ క్రమంలో ఒకవేళ ప్లాన్-ఎ విఫలమైతే, ప్లాన్-బీకి పాల్పడేందుకు ప్రధాన సూత్రధారి లలిత్ ఝా కుట్ర పన్నినట్లు వెల్లడైంది.
బుధవారం నాటి ఘటనకు సంబంధించి అరెస్టు చేసిన ఐదుగురు నిందితులపై పోలీసులు చట్టవ్యతిరేక కార్యకలాపాల (నిరోధక) చట్టం (ఉపా) కింద కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. నిందితులు డి.మనోరంజన్, సాగర్, అమోల్ షిండే, నీలందేవిలను బుధవారం అదుపులోకి తీసుకోగా, మరో నిందితుడు విశాల్‌ను గురుగ్రామ్‌లో అరెస్ట్ చేశారు.