దేశవ్యాప్తంగా కలకలం సృష్టిస్తున్న పార్లమెంట్ భద్రతా ఉల్లంఘన కేసులో ఢిల్లీ పోలీసుల దర్యాప్తు కొనసాగుతుంది కొద్దీ దిగ్భ్రాంతి కలిగించే పలు విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. పార్లమెంట్లో పసుపు రంగు గ్యాస్ డబ్బాలతో గందరగోళం సృష్టించి, ప్రస్తుతం పోలీసుల కస్టడీలో ఉన్న నిందితులు తొలుత అక్కడ ఆత్మాహుతి యత్నం చేయడం ద్వారా మరింతగా సంచలనం కలిగించాలని ప్రణాళిక వేసుకున్నట్లు వెల్లడైంది.
తొలుత ఆ నిందితులు తమని తాము నిప్పంటించుకోవాలని ప్రణాళికలు రచించినట్టు పోలీసులు తెలిపారు. అంతేకాదు కరపత్రాలను విసిరేయాలని కూడా అనుకున్నారు. అయితే ఎందుకనో చివరి నిమిషంలో ఆ ప్లాన్‌ని విరమించుకొని, పసుపు రంగు గ్యాస్ డబ్బాలతో రచ్చ చేసే ప్లాన్‌తో నిందితులు ముందుకెళ్లినట్లు పోలీసులు వెల్లడించారు.
‘‘లోక్‌సభ ఛాంబర్లోకి దూకే ప్రణాళికను ఖరారు చేయడానికి ముందు.. తమ సందేశాన్ని ప్రభుత్వానికి బలంగా పంపేందుకు గాను నిందితులు ఇతర వ్యూహాలను రచించారు. తమ శరీరాలను ఫైర్‌ప్రూఫ్ జెల్‌తో కప్పుకొని, తమని తాము నిప్పంటించుకోవాలని ప్లాన్ చేశారు. పార్లమెంటు లోపల కరపత్రాలను విసిరేయాలని కూడా భావించారు” అంటూ ఓ పోలీస్ అధికారి నిర్ధారించారు.
కానీ.. చివరి నిమిషంలో ఈ రెండు ప్లాన్లను విరమించుకొని బుధవారం అమలు చేసిన ప్రణాళికతో ముందుకు సాగారని చెప్పుకొచ్చారు. అలాగే.. ఈ కేసుకు సంబంధించి మైసూర్‌కు చెందిన బీజేపీ ఎంపీ ప్రతాప్ సింహా వాంగ్మూలాన్ని నమోదు చేయాలని స్పెషల్ సెల్ కౌంటర్ ఇంటెలిజెన్స్ బృందం ప్లాన్ చేసినట్లు ఓ వార్తా సంస్థ వెల్లడించింది.
మరోవైపు.. అధికారులు తమ దర్యాప్తులో భాగంగా శుక్రవారం రాత్రి నిందితులను గతంలో వాళ్లు కలిసి, పార్లమెంట్ భద్రతా ఉల్లంఘన కుట్రకు పన్నిన ప్రాంతాలకు తీసుకెళ్లారు. ఈ ఉల్లంఘనని రీక్రియేట్ చేసేందుకు గాను పోలీసులు పార్లమెంటు అనుమతిని కోరే అవకాశం ఉందని తెలిసింది.
నలుగురు నిందితులు ఏడు స్మోక్ క్యాన్లతో ఘటనను నిర్వహించేందుకు వచ్చారని ఢిల్లీ పోలీసు వర్గాలు తెలిపాయి. ఈ ఉల్లంఘన కుట్ర పన్నిన నిందితులు.. గూగుల్‌లో పార్లమెంటు పరిసర ప్రాంతాలను శోధించారని, పార్లమెంటు భద్రతకు సంబంధించిన పాత వీడియోలను కూడా కలిగి ఉన్నారని వెల్లడైంది.
అంతేకాదు.. పోలీసులు గుర్తించలేని విధంగా సేఫ్ చాట్లు ఎలా నిర్వహించాలో కూడా నిందితులు వెతికారు. తాము పట్టుబడకుండా ఉండేలా సిగ్నల్ యాప్‌లో మాట్లాడుకునేవారని పోలీసు విచారణలో తేలింది. అటు.. ప్రధాన సూత్రధారిగా భావిస్తున్న లలిత్ ఝాని త్వరలోనే రాజస్థాన్‌లోని నాగౌర్‌కు తీసుకెళ్లనున్నారు.