ఓడిపోయినప్పటికీ బీఆర్ఎస్ పార్టీలో మార్పు రాలేదని, తెలంగాణ ప్రజలన్నీ గమనిస్తున్నారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విమర్శించారు. గవర్నర్ ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై రాష్ట్ర శాసనసభలో జరిగిన చర్చకు సమాధానం ఇస్తూ ప్రజలంతా కుటుంబ పాలనకు వ్యతిరేకంగా తీర్పునిచ్చారని చెప్పారు. ప్రజా తీర్పును గౌరవించకపోతే బయటికే పంపుతారని స్పష్టం చేసారు.
“ప్రగతి భవన్ లో ప్రజావాణి కార్యక్రమం తీసుకొచ్చాం. గతంలో ప్రగతి భవన్ లోకి రాకుండా హోంమంత్రిని అడ్డుకున్నారు. బీఆర్ఎస్ పాలన కేవలం కుటుంబం వరకే పరిమితం. ప్రగతిభవన్ ముం.దు గద్దర్ గంటల తరబడి నిరీక్షించినా లోనికి అనుమతించలేదు ప్రజాతీర్పును చూసి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తట్టుకోలేకపోతున్నారు. ప్రజా తీర్పును బీఆర్ఎస్ గౌరవించాలి” అంటూ హితవు చెప్పారు.
తాము ఎన్నికల హామీలో ఇచ్చిన ఆరు గ్యారెంటీలను తప్పకుండా అమలు చేస్తామని, అన్ని వివరాలను సభ ముందు ఉంచుతామని, ప్రతిపక్షాలు ఇచ్చే సూచనలు పరిగణనలోకి తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఇవాళ గడీలు బద్దలుకొట్టి ప్రజావాణికి జనం క్యూ కడుతుంటే బీఆర్ఎస్ నేతలు భరించలేకపోతున్నారని ఎద్దేవా చేశారు.
తెలంగాణ కోసం డీఎస్పీగా ఉన్న నళిని రాజీనామా చేసిందని గుర్తు చేస్తూ అలాంటి ఉద్యమకారిణి గురించి ఈ బీఆర్ఎస్ ఆలోచించిందా..?” అని సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. తెలంగాణ ఉద్యమంలో నమోదైన కేసుల ఎత్తివేత విషయంలో కూడా బీఆర్ఎస్ విఫలమైందని ధ్వజమెత్తారు.
రైతు ఆదాయంలో తెలంగాణ స్థానం 25గా ఉందని, ఈవిషయాన్ని రాజ్యసభలో కేంద్రమంత్రి పేర్కొన్నారని గుర్తు చేశారు. రైతుల ఆత్మహత్యల్లో తెలంగాణ స్థానం ఎప్పుడు చూసిన ఒకటి లేదా రెండుగా ఉంటుందని చెబుతూ రైతు బ్రతికి ఉన్నప్పుడు ఆదుకోవాలి కానీ చనిపోయిన తర్వాత బీమా ఇవ్వడమేంటి..? అని నిలదీశారు.
గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ప్రత్యామ్నాయ పంటలను పండిచకుండా.. కేవలం వరిపైనే ఆధారపడాల్సి వచ్చిందని పేర్కొంటూ వరి వద్దని చెప్పి.. కేసీఆర్ ఫామ్ హౌస్ లో మాత్రం వరిని పండించారని ఎద్దేవా చేశారు.
విద్యుత్ విషయంలోనూ గత బీఆర్ఎస్ ప్రభుత్వం అబద్ధాలను చెప్పిందని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు.
విద్యుత్ తలసరి వినియోగంలో తెలంగాణ పదో స్థానంలో ఉందని పేర్కొన్నారు. విద్యుత్ తలసరి వినియోగంలో తెలంగాణ మొదటి స్థానంలో లేదని స్పష్టం చేశారు. ఈ విషయంలో బీఆర్ఎస్ అబద్ధాలు చెప్పవద్దని కోరారు.