తీవ్రవాదులకు కొన్ని దేశాలు సహకారం అందిస్తున్నాయని పేర్కొంటూ వాటిపై చర్యలు తీసుకోవాంటూ చైనా, పాక్ పేర్లను ప్రస్తావించకుండానే ఐక్యరాజ్య సమితిలో భారత శాశ్వత ప్రతినిధి రుచిరా కాంబోజ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో ఆమె మాట్లాడుతూ సీమాంతర ఉగ్రవాదం, హింస కారణంగా భారతీయులం ఎంతో నష్టపోయామని చెప్పారు.
ఉగ్రవాద గ్రూప్‌లు సరిహద్దుల గుండా అక్రమంగా ఆయుధాలను తరలిస్తున్నాయని, ఇందులో డ్రోన్లు సైతం ఉన్నాయని ఆమె పేర్కొన్నారు. ఉగ్రవాద గ్రూప్‌ల నుంచి స్వాధీనం చేసుకున్న ఆయుధాలను బట్టి వారికి ఎవరు సహాయం అందిస్తున్నారనే విషయం స్పష్టమవుతోందని ఆమె తెలిపారు.
ఏ దేశం సహాయం లేకుండా ఇంత పెద్ద ఎత్తున ఆయుధాలను సేకరించలేరని ఆమె స్పష్టం చేశారు. కొన్ని దేశాలు ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పిస్తూనే ఉన్నాయని చెబుతూ నేరాలకు పాల్పడడమే కాకుండా, కరెన్సీని నకిలీ చేయడం, చెలామణి చేయడం, ఆయుధాలు, మాదకద్రవ్యాల సరఫరాకు కూడా పాల్పడుతున్నట్లు రుచిరా కాంబోజ్ వెల్లడించారు.
సరిహద్దు ఉగ్రవాద కార్యకలాపాలకు మద్దతు ఇవ్వడానికి ఇతర మార్గాలను సరఫరా చేయడం వంటి మార్గాల ద్వారా హాని కలిగిస్తున్నారని ఆమె తెలిపారు. తీవ్రవాద గ్రూపులు, వారికి మద్దతిచ్చే వారిపై ఐక్యరాజ్యసమితి ఏ మాత్రం సహనం చూపించొద్దని ఆమె కోరారు. ఉగ్రవాదులు హింసను కొనసాగించేందుకు ఆయుధాలను అందించడం ద్వారానే అతిపెద్ద సహాయాన్ని అందజేస్తున్నామని ఆమె చెప్పారు.
కౌన్సిల్ తీవ్రవాద అంశాల పట్ల, వారికి మద్దతిచ్చే వారి పట్ల ఏమాత్రం సహనం చూపకపోవడం చాలా ముఖ్యమన్నారు. సరిహద్దు ఉగ్రవాదం, అక్రమ ఆయుధాలను ఉపయోగించి ఉగ్రవాద గ్రూపులు చేస్తున్న హింసతో భారతదేశం ఇబ్బంది పడుతుందన్నారు. ఉగ్రవాదులకు చిన్నపాటి ఆయుధాలు, మందుగుండు సామాగ్రి అందించడం వల్ల కలిగే నష్టాలను భారత్‌కు తెలుసునన్నారు. ఉగ్రవాదుల ఏరివేతలో పెరుగుతున్న ఆయుధాలు చూస్తుంటే ఏ దేశం సహాయం లేకుండా వాళ్లు విజృంభించలేరని అర్థమవుతోంది. డైవర్షన్ పాయింట్లు, ట్రాఫికింగ్ మార్గాలను గుర్తించేందుకు అంతర్జాతీయ సహకారం అవసరమని నొక్కి చెప్పారు.