తాజాగా తెలంగాణ మంత్రి జగదీశ్ రెడ్డికి కరోనా సోకింది. ప్రస్తుతం ఆయన హోం ఐసోలేషన్ లో ఉంటూ చికిత్స పొందుతున్నారు. ఇటీవల తనను కలసిన వారిని పరీక్షలు చేయించుకోవాలని ఆయన సూచించారు. ఇప్పటికే హైదరాబాద్ లో ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, సినీ ప్రముఖులు మహేష్ బాబు, మంచు లక్ష్మి, థమన్, బండ్ల గణేష్ ప్రభూతులు కరోనాకు గురయ్యారు.
రాష్ట్రంలో కూడా వైరస్ వ్యాప్తి తీవ్రంగా ఉంది. సోమవారం ఒక్కరోజే 1,825 కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం తెలంగాణలో దాదాపు 15 వేల యాక్టివ్ కేసులు ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో కరోనాతో ఒకరు మృతి చెందారు. ఇక వైరస్ బారి నుంచి 350 మంది కోలుకున్నారు.
వరంగల్ కాకతీయ మెడికల్ కళాశాలలో కరోనా కలకలం రేపింది. తాజాగా 15 మంది మెడికల్ స్టూడెంట్స్ కు కరోనా పాజిటివ్ నిర్దారణ అయ్యింది. దీంతో కాలేజీలో కోవిడ్ సోకిన విద్యార్థుల సంఖ్య 41కు చేరింది. దీంతో వారంతా హోం ఐసోలేషన్ లో ఉండి చికిత్స పొందుతున్నారు. రోజురోజుకు కాలేజీలో కేసుల సంఖ్య పెరుగుతుండటంతో ప్రొఫెసర్లు, విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఉస్మానియా వైద్య కశాశాలలో 24 మంది వైద్య విద్యార్థులు కొవిడ్ బారినపడ్డారు. దాదాపు 200 మందికిపైగా ఉండే ఒక్కో హాస్టల్లో 12 మంది చొప్పున కరోనా బారినపడడంతో మిగిలిన వైద్య విద్యార్థుల్లో ఆందోళన మొదలైంది. మిగిలిన విద్యార్థుల నుంచి నమూనాలను సేకరించి ప రీక్షల కోసం పంపారు.
మరోవైపు గత వారం రోజులుగా నర్సింగ్ విద్యార్థులకు ఉస్మానియా మెడికల్ కాలేజ్లో పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఉస్మానియా ఆస్పత్రిలో మరో ముగ్గురు సిబ్బందికి పాజిటివ్ నిర్ధారణ అయింది. గాంధీలో 10మంది హౌస్ సర్జన్ల కు పాజిటివ్ వచ్చింది. ఇక్కడ 52 మంది కరోనా రోగులు చికిత్స పొందుతున్నారు.