భద్రతా ఉల్లంఘన ఘటన పార్లమెంటును కుదిపేస్తున్నది. ఘటనపై కేంద్ర హోం మంత్రి అమిత్‌షా ప్రకటన చేయాలని ఉభయసభల్లో ప్రతిపక్ష ఎంపీలు పట్టుబడుతున్నారు. అయితే ఆందోళన చేపడుతున్న విపక్ష ఎంపీలపై కేంద్ర ప్రభుత్వం సస్పెన్షన్ కొరడా ఝళిపిస్తున్నది. వరుసగా ఎంపీలను పార్లమెంట్ నుంచి సస్పెండ్ చేస్తున్నది. తాజాగా మంగళవారం లోక్‌సభ నుంచి మరో 49 మంది ఎంపీలను సస్పెండ్ చేసింది.
దీంతో ఇప్పటివరకూ ఉభయసభల నుంచి సస్పెన్షన్‌కు గురైన ఎంపీల సంఖ్య 141కి చేరింది. ఈ నెల 14న 14 మంది ఎంపీలను (లోక్‌సభ 13, రాజ్యసభ 1) సస్పెండ్ చేయగా, సోమవారం ఒక్కరోజే 78 మందిపై (లోక్‌సభ-33, రాజ్యసభ-45) వేటు వేసిన సంగతి తెలిసిందే. ఒక్క లోక్‌సభలోనే 95 మంది ఎంపీలు సస్పెన్షన్‌కు గురయ్యారు.
ఇండియా కూటమి లోక్‌సభ ఎంపీల్లో దాదాపు మూడింట రెండొంతుల మంది ఎంపీలపై వేటు పడింది. ఇండియా కూటమికి లోక్‌సభలో 138 మంది ఎంపీలు ఉండగా.. సస్పెన్షన్ల తర్వాత 43 మంది మాత్రమే మిగిలారు.
మంగళవారం సస్పెన్షకు గురైన వారిలో ఎన్సీ ఎంపీ ఫరూక్ అబ్దుల్లా, కాంగ్రెస్ ఎంపీలు శశిథరూర్, మనీశ్ తివారీ, కార్తి చిదంబరం, సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ డింపుల్ యాదవ్, ఎన్సీపీ, డీఎంకే, జేడీయూ, ఆప్ పార్టీలకు చెందిన ఎంపీలు ఉన్నారు.
వీరి సస్పెన్షన్‌పై పార్లమెంటరీ వ్యవహారాలను శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి తీర్మానం పెట్టగా.. సభ ఆమోదించినట్టు స్పీకర్ ప్రకటించారు. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయం కారణంగానే విపక్ష పార్టీల ఎంపీలు ఈ విధంగా వ్యవహరిస్తున్నారని జోషి ఈ సందర్భంగా ఆరోపించారు. కాగా, మంగళవారం లోక్‌సభలో గందరగోళ పరిస్థితుల మధ్యనే పలు సవరణలతో కూడిన మూడు నేర న్యాయ బిల్లులను ప్రభుత్వం ప్రవేశపెట్టింది.
ఎంపీల సస్పెన్షన్‌కు వ్యతిరేకంగా విపక్ష పార్టీలు మంగళవారం ఉదయం పార్లమెంట్ భవనం వద్ద మాక్ పార్లమెంట్ నిర్వహించి నిరసన తెలిపాయి. టీఎంసీ ఎంపీ కల్యాణ్ బెనర్జీ ప్రిసైడింగ్ ఆఫీస్‌గా వ్యవహరించారు.
ఈ సందర్భంగా ఆయన ఉపరాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్కర్ను హేళన చేశారని ఆరోపిస్తూ బీజేపీ విమర్శలు గుప్పించింది. ఇది సిగ్గుచేటు అని, రైతుగా తన నేపథ్యానికి కూడా అవమానకరమని ధనకర్ సభలో పేర్కొన్నారు.
మంగళవారం 49 మంది ఎంపీల సస్పెన్షన్ అనంతరం శిరోమణి అకాలీదళ్ ఎంపీ హర్సిమ్రత్ కౌర్ బాదల్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు. బీజేపీ పాలనలో పార్లమెంట్ రాజ్యాంగ శ్మశానంగా మారిందని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ ఎంపీ కార్తి చిదంబరం మాట్లాడుతూ పార్లమెంట్ త్వరలో ఉత్తర కొరియాను తలపిస్తుందని విమర్శించారు.
మళ్లీ ప్రతిపక్షంలోనే .. ప్రధాని మండిపాటు
ప్రస్తుతం ప్రతిపక్షంలో ఉన్న పార్టీలు 2024 లోక్‌సభ ఎన్నికల తర్వాత మరింత కుంచించుకుపోయి మళ్లీ ప్రతిపక్షంలోనే ఉంటాయని ప్రధాని నరేంద్రమోదీ ధ్వజమెత్తారు. మంగళవారం బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తూ.. ప్రతిపక్ష పార్టీల సభ్యులు వారి చర్యల ద్వారా పార్లమెంటు భద్రతకు భంగం కలిగించినవారికి పరోక్షంగా సహకారం అందిస్తున్నాయని ఆరోపించారు.
పార్లమెంట్ కార్యకలాపాలను విపక్షాలు పదేపదే అడ్డుకొంటున్నాయని, ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో ఎదురైన ఓటమి నిరుత్సాహంతో పార్లమెంట్ ఘటనకు విపక్షాలు రాజకీయ రంగు పులుముతున్నాయని విమర్శించారు. వారి లక్ష్యం తమ ప్రభుత్వాన్ని కూలదోయడమేనని, అయితే తమ లక్ష్యం భారత్‌ను మెరుగైన భవిష్యత్తు దిశగా నడపించడమని మోదీ స్పష్టం చేశారు.