దేశంలో మూడో అతిపెద్ద ఫోన్ అపరేటర్‌గా ఉన్న వొడాఫోన్-ఐడియా లిమిటెడ్ కీలక ప్రకటన చేసింది. కంపెనీలోని మేజర్ వాటాను ప్రభుత్వానికి అప్పగించినట్లు మంగళవారం అధికారికంగా ప్రకటించింది. దీంతో వొడాఫోన్- ఐడియాలో 35.8 శాతం వాటా ప్రభుత్వం చేతుల్లోకి వెళ్లింది.
గత కొద్దికాలంగా.. వొడాఫోన్, ఐడియా కస్టమర్లను భారీగా కోల్పోవడం, లాభదాయక పరిస్థితులు కనిపించకపోవడంతో ఈ చర్య తీసుకోవాల్సి వచ్చిందని సోమవారం జరిగిన బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ల సమావేశంలో ప్రభుత్వ వాటాకు అంగీకారం తెలిపినట్లు కంపెనీ వెల్లడించింది.
అలాగే స్టాక్ ఎక్స్సేంజ్లోని వాటాలను కంపెనీ వివరించింది. లండన్‌కు చెందిన వొడాఫోన్ గ్రూప్ పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ 28.5 శాతం, ఆదిత్యా బిర్లా గ్రూప్ 17.8 శాతం వాటాలను కలిగి ఉందని పేర్కొంది. వ్యవస్థాపకులతో పాటు కంపెనీ ప్రస్తుత షేర్ హోల్డర్లందరిపై ఇది ప్రభావం చూపనుంది.
తాజాగా కంపెనీ తీసుకున్న నిర్ణయంతో.. భారత ప్రభుత్వం 36 శాతం వాటానాను కలిగి ఉండడంతో కీలక పాత్ర పోషించే అవకాశముంది. ఇదిలా ఉండగా.. ఈ కీలక పరిణామం తర్వాత మంగళవారం నాటి స్టాక్ సూచీల్లో వొడాఫోన్ ఐడియా షేర్లు 19 శాతం పడిపోవడం గమనార్హం.