కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ సంచలన నిర్ణయం తీసుకుంది. కొత్తగా ఎన్నికైన సంజయ్ సింగ్ నేతృత్వంలోని రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డబ్ల్యుఎఫ్ఐ) పాలక కమిటీని కేంద్రం సస్పెండ్ చేసింది. కొత్తగా ఎన్నికైన సంఘం తొందరపాటు నిర్ణయాలను తీసుకుందని కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ ఆదివారం విడుదల చేసిన అధికారిక ప్రకటనలో పేర్కొంది.
డబ్ల్యుఎఫ్‌ఐలో ఇప్పటికే ఉన్న నియమాలు, నిబంధనలను పూర్తిగా విస్మరించిందని తెలిపింది. అండర్ 15, అండర్ 20 నేషనల్స్ యుపిలోని గోండా జిల్లా నందినీ నగర్లో ఈ ఏడాది చివరలో జరుగుతాయని డబ్ల్యుఎఫ్ఐ కొత్తగా ఎన్నికైన అధ్యక్షుడు సంజయ్ సింగ్ డిసెంబర్ 21న ప్రకటించిన సంగతి తెలిసిందే.
ఈ ప్రకటన నిబంధనలకు విరుద్ధమని క్రీడా శాఖ ప్రకటించింది. జాతీయ పోటీల్లో పాల్గొనే క్రీడాకారులకు 15 రోజుల ముందు నోటీసు ఇవ్వాల్సిన అవసరం ఉందని స్పష్టం చేసింది. ఇది తొందరపాటు చర్య అని మండిపడింది.
” కొత్త పాలకమండలి డబ్ల్యుఎఫ్ఐ రాజ్యాంగాన్ని అనుసరించలేదు. మేము ఫెడరేషన్‌ను రద్దు చేయలేదు. కానీ తదుపరి ఆదేశాల వరకు సస్పెండ్ చేస్తున్నాము. వారు విధి విధానాలు, నిబంధనలు అనుసరించాలి ” అని క్రీడా మంత్రిత్వ శాఖ అధికారి ప్రకటనలో పేర్కొన్నారు.
డబ్ల్యుఎఫ్ఐ రాజాంగ పీఠికలోని క్లాజ్ 3 (ఇ) ప్రకారం.. యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్ (యుడబ్లుడబ్ల్యు) ఎగ్జిక్యూటివ్ కమిటీ ఎంపిక చేసిన ప్రదేశాల్లో మాత్రమే సబ్ జూనియర్, జూనియర్, సీనియర్ రెజ్లింగ్ పోటీలను నిర్వహించాల్సి వుందని, అందుకు విరుద్ధంగా ప్రకటన చేయడంతో కొత్త ప్యానెల్‌ను సస్పెండ్ చేసినట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి.
సంజయ్ సింగ్ గత గురువారంనాడు డబ్ల్యూఎఫ్ఐ కొత్త అధ్యక్షుడిగా 47 ఓట్లకు 40 ఓట్లు గెలుచుకుని సంచలన విజయం సాధించారు. అధ్యక్షుడిగా ఎన్నిక కాగానే ఆయన ఈ ఏడాది చివర్లో గోండా (యూపీ)లోని నందిని నగర్లో నేషనల్స్ జరుగుతాయని ప్రకటించారు. ఈ ప్రకటనను తొందరు పాటు చర్యగా, రెజ్లర్లకు తగిన నోటీసు ఇవ్వకుండా తీసుకున్న నిర్ణయంగా క్రీడల మంత్రిత్వ శాఖ ఆదివారంనాడు ఒక ప్రకటనలో తెలిపింది.
”కొత్తగా ఏర్పాటు చేసిన డబ్ల్యూఎఫ్ఐ ప్యానెల్ పూర్తిగా మాజీ ఆఫీస్ బేరర్ల అధీనంలో ఉన్నట్టు, స్పోర్ట్స్ కోడ్‌ను పూర్తిగా ఉల్లంఘించినట్టు కనిపిస్తోంది” అని క్రీడా మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. మాజీ ఆఫీస్ బేరర్ల అధీనంలో ఫెడరేషన్ కార్యకలాపాలు నడుస్తున్నట్టు భావించాల్సి వస్తోందని, గతంలో క్రీడాకారులు లైంగిక వైధింపులను ఎదుర్కొన్నట్టు చేసిన ఆరోపణల అంశం ప్రస్తుతం కోర్టు విచారణ ముందు ఉందని తెలిపింది.
సంజయ్ సింగ్ గతంలో ఉత్తరప్రదేశ్ రెజ్లింగ్ బాడీ ఉపాధ్యక్షుడిగా ఉన్నారు. డబ్ల్యూఎఫ్ఐ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ జాయింట్ సెక్రటరీగా 2019 నుంచి ఉన్నారు. డబ్ల్యూఎఫ్ఐ కొత్త అధ్యక్షుడిగా ఆయన ఎన్నిక కావడంపై రెజ్లర్లు నిరసనకు దిగారు. సాక్షి మాలిక్ తాను రిటైర్ అవుతున్నట్టు ప్రకటించగా, బజ్రంగ్ పునియా ‘పద్మశ్రీ’ అవార్డును తిరిగి ఇచ్చేస్తూ ప్రధానికి లేఖ రాశారు.
రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డబ్ల్యుఎఫ్ఐ) నూతన పాలకమండలిపై కేంద్రం బహిష్కరణ వేటు నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని, అయితే ఈ నిర్ణయం ఆలస్యమైందని ప్రముఖ అథ్లెట్లు పేర్కొన్నారు. స్పోర్ట్స్ బాడీ నిబంధనలను ఉల్లంఘించిన డబ్ల్యుఎఫ్‌ఐపై కఠిన చర్యలు తీసుకోవాలని, కేంద్రం ముందుగానే స్పందించాల్సి వుందని వారు తెలిపారు.
రెజ్లర్లకు న్యాయం జరుగుతుందనే నమ్మకం ఉందని ఒలింపియన్ మరియు రెజ్లర్ గీతా ఫోగట్ ఎక్స్‌లో పేర్కొన్నారు. ”డబ్ల్యుఎఫ్ఐ పాలక మండలిని క్రీడా మంత్రిత్వ శాఖ సస్పెండ్ చేసింది. ఆలస్యంగానైనా రెజ్లర్లకు న్యాయం జరుగుతుందన్న విశ్వాసం ఉంది” అని గీతా ఫోగట్ ట్విటర్లో పేర్కొన్నారు.
‘‘ ఓ మహిళ రెజ్లింగ్‌ను విడిచిపెడుతున్నట్లు ప్రకటించారు. మరో రెజ్లర్ పద్మశ్రీని వెనక్కి ఇచ్చేశారు. ఇప్పుడు రెజ్లింగ్ ఫెడరేషన్‌ను సస్పెండ్ చేశారు. కేంద్రం ముందుగానే చర్యలు తీసుకుని ఉండాల్సింది’’ అని ఇండియన్ బాక్సర్, ఒలింపిక్ పతక విజేత, కాంగ్రెస్ నేత విజేందర్ సింగ్ పేర్కొన్నారు.