హిజాబ్ నిషేధం ఎత్తివేతపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని కర్ణాటక హోం మంత్రి జీ పరమేశ్వర స్పష్టం చేశారు. ఈ విషయంపై లోతుగా అధ్యయనం చేసిన తర్వాత హిజాబ్ నిషేధం ఎత్తివేతపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. ఇప్పటి వరకు తమ ప్రభుత్వం ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయలేదని పేర్కొంటూ ఒకవేళ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య చేసి ఉంటే, వాటిని పరిశీలిస్తామని చెప్పారు.
కాగా, హిజాబ్ నిషేధంపై ప్రకటన చేసిన 24 గంటలు గడవకముందే సిద్ధరామయ్య యూటర్న్ తీసుకున్న విషయం తెలిసిందే. తాను అలాంటి ప్రకటన చేయలేదని, అధికారులతో చర్చించిన అనంతరం తుది నిర్ణయం తీసుకుంటామని శనివారం పేర్కొన్నారు.
శుక్రవారం మైసూర్ పర్యటన సందర్భంగా హిజాబ్‌పై నిషేధాన్ని ఎత్తేస్తారా? అని ఓ మీడియా ప్రతినిధి ప్రశ్నించగా, హిజాబ్ ధరించడంపై ఉన్న ఆంక్షలను మేం ఇంకా ఉపసంహరించుకోలేదు. హిజాబ్ ధరించడంపై ఉన్న ఆంక్షలను ఎత్తివేయాలని ఆలోచిస్తున్నామని, దానిపై చర్చలు జరిపి, ఆపై ఖరారు చేస్తామని తాను బదులిచ్చానని సిద్ధరామయ్య చెప్పారు.
మహిళలు తమకు నచ్చిన దుస్తులను ధరించొచ్చు. అది వారి హక్కు అని సీఎం శుక్రవారం పేర్కొన్నారు. ప్రధాని మోదీ పదేపదే వ్యాఖ్యానించే సబ్ కా సాత్, సబ్ కా వికాస్ ఉట్టి బోగస్ మాటలు అని ధ్వజమెత్తారు. దుస్తులు, కులాల ఆధారంగా ఈ దేశ ప్రజలను, సమాజాన్ని బీజేపీ విభజిస్తోందని మండిపడ్డ సంగతి తెలిసిందే.