తెలంగాణ గవర్నర్గా వ్యవహరిస్తున్న డా. తమిళిసై సౌందరరాజన్ పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతుట్లు తెలుస్తున్నది. సొంత రాష్ట్రం తమిళనాడు నుంచి ఆమె పోటీ చేసేందుకు సిద్ధమయ్యారనే వార్తలు వినిపిస్తున్నాయి. మంగళవారం గవర్నర్ జరుపుతున్న ఢిల్లీ పర్యటన సహితం ఈ విషయంలో ఓ నిర్ణయం తీసుకొనేందుకు అని ప్రచారం జరుగుతుంది.
ఈ పర్యటనలో ఆమె కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ కానున్నారు. తన ఎంపీ అభ్యర్థిత్వంపై ఆమె అమిత్ షాను కోరనున్నట్లు తెలుస్తోంది. తమిళనాడులోని సౌత్ చెన్నై లేదా తిరునల్వేలి నుంచి పోటీకి ఆమె సిద్ధపడుతున్నట్లు తెలుస్తోంది. తమిళిసై గతంలో రెండు సార్లు ఎంపీగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు.
2009లో చెన్నై నార్త్, 2019లో తూత్తూకూడి నుంచి ఎంపీగా పోటీ చేసి పరాజయం చవి చూశారు. మరో మూడు పర్యాయాలు అసెంబ్లీకి పోటీ చేసినా.. ఆమె గెలుపు తలుపు తట్టలేదు. పార్టీకీ ఆమె చేసిన సేవలను గుర్తించిన కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం 2019 సెప్టెంబర్లో తమిళిసైని తెలంగాణ గవర్నర్గా నియమించారు. 2021 నుంచి పుదుచ్చేరి లెప్టెనెంట్ గవర్నర్గా అదనపు బాధ్యతలు అప్పగించారు.
తమిళనాడు బిజెపి అధ్యక్షురాలిగా సమర్ధవంతంగా పనిచేస్తున్న సమయంలో ఆమె క్రియాశీల రాజకీయాల నుండి రాజ్ భవన్ కు చేరుకోవాల్సి వచ్చింది. అయితే, సొంతరాష్ట్రంతో తన సంబంధాలను ఆమె కొనసాగిస్తూనే ఉన్నారు. ఇప్పుడు రాజ్యాంగబద్దమైన పదవిని వదిలి ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలని ఆమె భావిస్తున్నట్లు తెలుస్తున్నది.
ఎంపీగా పోటీ చేసేందుకు తమిళిసైకి ప్రధాని మోదీ, అమిత్ షా గ్రీన్ సిగ్నల్ ఇస్తే వచ్చే నెలలో రాష్ట్రానికి కొత్త గవర్నర్ను కేంద్రం నియమించే అవకాశం ఉందని ప్రచారం జరుగుతుంది. జనవరిలో రాష్ట్ర గవర్నర్ మార్పు ఖాయమంటూ జోరుగా ప్రచారం జరుగుతోంది. అయితే ఎవరిని గవర్నర్గా నియమిస్తారనేది చర్చనీయాంశమైంది.
బిజెపి సహితం దక్షిణాదిన పార్టీ బలహీనంగా ఉన్న తమిళనాడు, ఆంధ్ర ప్రదేశ్ లపై దృష్టి సారిస్తున్న సమయంలో లోక్ సభ ఎన్నికలలో బలమైన అభ్యర్థులను నిలబెట్టేందుకు చూస్తున్నది.