2023లో ప్రధాని నరేంద్ర మోదీ మొత్తం 11 దేశాల్లో పర్యటించారు. ప్రపంచ దేశాల్లో ప్రబల ఆర్థిక శక్తులుగా ఉన్న దాదాపు అన్ని దేశాల్లో 2023 లో ఆయన పర్యటించారు. జపాన్ లోని హిరోషిమాలో 2023 మే లో జరిగిన గ్రూప్ ఆఫ్ సెవెన్ (జీ7) శిఖరాగ్ర సదస్సుకు ప్రధాని మోదీ హాజరయ్యారు.
ఆ సమావేశం అనంతరం ప్రధాని మోదీ పపువా న్యూ గినియా కు వెళ్లారు. అక్కడ ఇండియా-పసిఫిక్ ఐలాండ్స్ కోఆపరేషన్ (ఎఫ్ఐపీఐసీ-3) 3వ సదస్సుకు అధ్యక్షత వహించారు. పపువా న్యూ గినియా నుంచి ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్ ఆహ్వానం మేరకు ప్రధాని మోదీ ఆస్ట్రేలియాలో పర్యటించారు.
సిడ్నీలో ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్ తో కలిసి ప్రధాని మోదీ స్థానిక భారతీయులతో సమావేశమయ్యారు. అంతేకాక, అక్కడి హారిస్ పార్క్ ప్రాంతాన్ని ‘లిటిల్ ఇండియా’గా గుర్తించనున్నట్లు ప్రకటించారు. ఈ మూడు దేశాల పర్యటనను ప్రధాని మోదీ మే 19 వ తేదీ నుంచి మే 25 వ తేదీ వరకు పూర్తిచేశారు.
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ప్రథమ మహిళ జిల్ బైడెన్ ఆహ్వానం మేరకు జూన్ నెలలో అమెరికా, ఈజిప్ట్ దేశాల్లో ప్రధాని మోదీ పర్యటించారు. మొదట జూన్ 20న అమెరికా వెళ్లారు. జూన్ 21న ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయంలో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు.
జూన్ 22న ప్రధాని మోదీకి వైట్ హౌజ్ లో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ప్రథమ మహిళ జిల్ బైడెన్ ఘనంగా స్వాగతం పలికారు. అదేరోజు అమెరికా పార్లమెంటు ఉభయ సభల సంయుక్త సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. అనంతరం అమెరికా నుంచి ఈజిప్ట్ పర్యటనకు వెళ్లారు.
ఈ సంవత్సరం జులై నెలలో 13వ తేదీ నుంచి 15వ తేదీ వరకు ప్రధాని మోదీ ఫ్రాన్స్, యూఏఈలలో పర్యటించారు. ఫ్రాన్స్ బాస్టిల్ డే సైనిక పరేడ్ కు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఫ్రాన్స్ నుంచి యూఏఈ కి వెళ్లారు. యూఏఈలోని అబుదాబికి వెళ్లిన మోదీ ఆ దేశ అధ్యక్షుడు షేక్ మహ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ తో చర్చలు జరిపారు.
బ్రిక్స్ సదస్సులో పాల్గొనడం కోసం ప్రధాని మోదీ ఆగస్ట్ 22న దక్షిణాఫ్రికా వెళ్లారు. అక్కడ జోహన్నెస్ బర్గ్ లో జరిగిన బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశంలో పాల్గొన్నారు. అనంతరం గ్రీస్ వెళ్లారు. ఒక భారతీయ ప్రధాని గ్రీస్ కు వెళ్లడ 40 సంవత్సరాల తరువాత ఇదే ప్రథమం. గ్రీస్ ప్రభుత్వం ప్రధాని మోదీకి గ్రాండ్ క్రాస్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ హానర్ ప్రదానం చేసింది.
న్యూఢిల్లీలో జి 20 శిఖరాగ్ర సమావేశానికి కొద్ది రోజుల ముందు, ఈ సెప్టెంబర్ నెలలో ఇండోనేషియా అధ్యక్షుడు జోకో విడోడో ఆహ్వానం మేరకు ప్రధాని మోడీ 18 వ తూర్పు ఆసియా శిఖరాగ్ర సమావేశం, 20 వ ఆసియాన్- భారత శిఖరాగ్ర సదస్సులో పాల్గొనడం కోసం ఇండోనేషియా వెళ్లారు.