కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ మరోయాత్రకు శ్రీకారం చుట్టారు. ఇప్పటికే ‘భారత్ జోడో యాత్ర’ పేరుతో కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకూ పాదయాత్ర చేసిన విషయం తెలిసిందే. తాజాగా రెండో విడతలో ‘భారత్ న్యాయ యాత్ర’ పేరుతో 14 రాష్ట్రాల్లో పర్యటించనున్నారు. ఈ యాత్ర జనవరి 14న ప్రారంభమై మార్చి 20న ముగియనుంది.
మణిపూర్ నుంచి ముంబై వరకూ సుమారు 85 జిల్లాల మీదుగా ఈ యాత్ర సాగనుంది. భారత్ న్యాయ యాత్రను కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే జెండా ఊపి ప్రారంభించనున్నారు. జోడో యాత్రకు కొనసాగింపుగా చేపడుతున్న ఈ యాత్రను రాహుల్ గాంధీ బస్సులో చేస్తారని కాంగ్రెస్ పార్టీ వెల్లడించింది.
ఆయా ప్రాంతాల్లో ప్రజల కష్టాలను తెలుసుకుంటూ ముందుకు సాగుతారని కాంగ్రెస్ పేర్కొంది. తూర్పు నుంచి పశ్చిమానికి యాత్ర చేపట్టాలన్న ప్రతిపాదనలపై పార్టీ సీడబ్ల్యూసీ మీటింగ్ లో చర్చించి ఈ యాత్రకు రూపకల్పన చేసినట్లు తెలిపింది. ఈ యాత్రలో సుమారు 6,200 కిలోమీటర్ల మేర రాహుల్ గాంధీ బస్సు యాత్ర చేపడతారని వివరించింది.
కాగా, రాహుల్ గతేడాది ‘భారత్ జోడో యాత్ర’ పేరుతో చేసిన పాదయాత్ర సెప్టెంబర్ 7, 2022న ప్రారంభమైన ఈ ఏడాది జనవరి 30న ముగిసింది. సుమారు 12 రాష్ట్రాల మీదుగా రాహుల్ పాదయాత్ర చేశారు. 145 రోజుల (దాదాపు 5 నెలలు) పాటు సాగిన ఈ సుదీర్ఘ యాత్ర దాదాపు 3970 కి.మీ మేర సాగింది.
