డీఎండీకే వ్యవస్థాపక నేత, ప్రముఖ తమిళ నటుడు విజయకాంత్ (71) గురువారం అనారోగ్యంతో కన్నుమూశారు. కెప్టెన్ విజయకాంత్ న్యుమోనియాతో ఆసుపత్రిలో చేరిన తర్వాత వెంటిలేటర్‌పై ఉన్నారని ఎంఐఓటీ ఆసుపత్రి ఒక పత్రికా ప్రకటనలో తెలిపింది. వైద్య సిబ్బంది ఎంతగా శ్రమించినా ఫలితం దక్కలేదని, ఈ ఉదయం కన్నుమూశారని పేర్కొంది.
కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన చెన్నైలోని ఓ ఆసుప్రతిలో చికిత్స పొందతూ తుదిశ్వాస విడిచారు. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన గతంలో కూడా ఆసుపత్రిలో చికిత్స పొందారు. ప్రస్తుతం మళ్లీ ఆయన కరోనా సోకడంతో ఇబ్బంది పడుతున్న క్రమంలో మళ్లీ ఆస్పత్రిలో చికిత్స పొందారు.
2020 సెప్టెంబర్ లో విజయ్ కాంత్ కు కరోనా పాజిటివ్ రావడంతో ఎమ్ఐఓటి ఆసుపత్రిలో చికిత్స అందించారు. ఇక తర్వాత 2018వ తేదీన తీవ్రమైన అనారోగ్య సమస్యలతో అదే ఆసుపత్రిలో చేరిన ఆయన అనంతరం ఆరోగ్యం మెరుగు పడడంతో 11వ తేదీన డిశ్చార్జ్ అయ్యారు. డిస్చార్జ్ అయిన తర్వాత డిఎండికె వర్కింగ్ కమిటీ సాధారణ సమావేశాలలో కూడా విజయకాంత్ పాల్గొన్నారు. అయితే మంగళవారం రాత్రి చికిత్స కోసం మళ్లీ ఆసుపత్రిలో చేరిన ఆయన ఆరోగ్య పరిస్థితిపై డీఎండీకే ప్రధాన కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. తాజాగా ఆయనకు కరోనా సోకిందని, ప్రస్తుతం ఆయన పరిస్థితి క్షీణించింది అని వెల్లడించింది.
గతంలో తమిళనాడు అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా ఉన్న విజయకాంత్ శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తడంతో ఆసుపత్రిలో చేరారని, వెంటిలేటర్ పై ఉంచారని దేశీయ ముర్పోక్కు ద్రవిడ కళగం తన అధికారిక హ్యాండిల్ లో పోస్ట్ ద్వారా తెలియజేసింది. దగ్గు, గొంతునొప్పితో బాధపడుతున్న ఆయన 14 రోజుల పాటు వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు.
40 ఏళ్ల సినీ రంగం, 20 ఏళ్లకు పైగా రాజకీయ రంగంలో ఆయన చెరగని ముద్ర వేసుకున్నారు. సినిమాల్లో కెప్టెన్‌గా అగ్రస్థానాన్ని చేరుకున్నారు. కానీ రాజకీయాల్లో మాత్రం ఆశించినంతగా సక్సెస్ కాలేకపోయారు. అయినా జనాల హృదయాల్లో మాత్రం కెప్టెన్‌గా విజయ్ కాంత్ చిరకాలం స్థానాన్ని సంపాదించుకున్నారు. తమిళ నటుడు విజయ్ కాంత్ పోలీస్ అధికారిగా 20కి పైగా సినిమాలలో కనిపించారు.
విజయకాంత్ దర్శకత్వం వహించిన ఒకే ఒక చిత్రం ‘విరుధగిరి’. అందులో ఆయనే హీరో. ఇక 1984లో విజయకాంత్ నటించిన 18 సినిమాలు విడుదల కావడం విశేషంగా చెబుతారు. ఆయన నటించిన ఆఖరి సినిమా ‘సగప్తం’ . 2015 సంవత్సరంలో ఈ సినిమాను తీశారు. ‘మనకనక్కు’లో కోలీవుడ్ నటుడు కమల్‌హాసన్‌తో, ‘వీరపాండియన్’లో తమిళ నటుడు శివాజీ గణేశన్‌తో కలిసి విజయ్ కాంత్ నటించారు.