ఎన్నారై వ్యాపారవేత్త సీసీ థంపీపై గతంలో నమోదు చేసిన మనీలాండరింగ్ కేసులో కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ పేరును తాజాగా ఈడీ చేర్చింది. గతంలో ఆమె భర్త రాబర్ట్ వాద్రా పేరును ఈ కేసులో చేర్చిన ఈడీ ఇప్పుడు ప్రియాంక పేరును కూడా కేసులో ప్రస్తావించింది.
కాంగ్రెస్ మాజీ అధినేత్రి సోనియాగాంధీ అల్లుడు రాబర్ట్ వాద్రా, కుమార్తె ప్రియాంక గాంధీ వాద్రా ఢిల్లీకి చెందిన రియల్ ఎస్టేట్ ఏజెంట్ ద్వారా హర్యానాలో భూమి కొనుగోలు చేశారని, వారు ఎన్నారై సీసీ థంపీకి భూమికి విక్రయించారని ఈడీ ఓ ప్రకటనలో తెలిపింది. ప్రియాంకకూ, థంపీకి వ్యాపార బంధం ఉందని ఆరోపించింది.
ఈ కేసులో పరారీలో ఉన్న ఆయుధ వ్యాపారి సంజయ్ భండారీతో పాటు థంపీ, బ్రిటీష్ జాతీయుడు సుమిత్ చద్దా కూడా నిందితులుగా ఉన్నారు.ఈడీ గత నెలలో దాఖలు చేసిన తాజా ఛార్జిషీట్ లో ప్రియాంక, థంపీ ఇద్దరికీ ఆస్తులు విక్రయించిన ఎస్టేట్ ఏజెంట్ హెచ్ఎల్ పహ్వా హర్యానాలో భూమి కొనుగోలు కోసం నగదు తీసుకున్నారని, కానీ ఆమె ఈ లావాదేవీలో పూర్తి మొత్తం చెల్లించలేదని ఈడీ తెలిపింది.
పహ్వా 2006లో ప్రియాంక గాంధీకి వ్యవసాయ భూమిని విక్రయించి, 2010లో ఆమె నుంచి తిరిగి కొనుగోలు చేశాడనేది ఇక్కడ ప్రధాన ఆరోపణ. మరోవైపు విచారణలో భాగమైన లండన్లో ఆస్తి కొనుగోలుకు సంబంధించి కూడా ఈడీ ప్రియాంక పేరు ప్రస్తావించింది.
ఈ కేసు దర్యాప్తు సమయంలో సీసీ థంపి, రాబర్ట్ వాద్రా మధ్య సుదీర్ఘమైన, బలమైన సంబంధాలు ఉన్నట్లు కనుగొన్నట్లు ఈడీ ప్రకటనలో తెలిపింది.
వారి మధ్య వ్యక్తిగత, స్నేహపూర్వక బంధమే కాకుండా సాధారణ, ఒకే విధమైన వ్యాపార ఆసక్తులు కూడా ఉన్నట్లు వెల్లడించింది.
జనవరి 2020లో అరెస్టయిన థంపి, తనకు రాబర్ట్ వాద్రా పదేళ్లకు పైగా తెలుసని యూఏఈతో పాటు ఢిల్లీ పర్యటనల సమయంలో తాము చాలాసార్లు కలుసుకున్నామని ఈడీకి చెప్పినట్లు తెలుస్తోంది.