డా. టి ఇంద్రసేనారెడ్డి, పర్యావరణ, సామజిక శాస్త్రవేత్త
పంతొమ్మిదవ శతాబ్దంలో విశేషంగా ప్రభావం చూపిన భారతీయ హిందూ సన్యాసి, ఆధునిక భారతదేశంలో అత్యంత ప్రభావవంతమైన వ్యక్తులలో ఒకరిగా స్వామి వివేకానందను పరిగణిస్తున్నారు. భారతదేశం గురించి తెలుసుకోవడానికి వివేకానంద రచనలను అధ్యయనం చేయాలని రవీంద్రనాథ్ ఠాగూర్ సూచించారు.
భారత స్వాతంత్య్ర వీరుడు సుభాష్ చంద్రబోస్ వివేకానందను తన ఆధ్యాత్మిక గురువుగా భావించారు. మహాత్మాగాంధీ వివేకానంద రచనలు చదివిన తర్వాత జాతి పట్ల తనకున్న ప్రేమ వెయ్యి రెట్లు పెరిగిందని చెప్పారు.
అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా నవంబర్ 2010లో భారతదేశంలో చేసిన ప్రసంగంలో వివేకానంద మాటలను ఉటంకించారు. తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత, వివేకానంద తనను రాజకీయాల్లోకి రావడానికి ప్రేరేపించారని తెలిపారు.
వివేకానంద జన్మదినమైన జనవరి 12న భారతదేశంలో జాతీయ యువజన దినోత్సవంగా జరుపుకుంటారు.
అయినా, ఆధునిక భారతదేశ నిర్మాణంలో స్వామి వివేకానంద ప్రభావం గురించి భారతీయ చరిత్రకారులు సరిగ్గా అంచనా వేయలేదని చెప్పవచ్చు.
ఆయన కేవలం కాషాయ వస్త్రాలు ధరించి, సనాతన భారతీయ తత్వం పట్ల ప్రపంచ ప్రజల దృష్టిని ఆకట్టుకునే విధంగా చేయడంతో పాటు, భారతీయులలో ఆత్మనూన్యతా భావాన్ని రూపుమాపేందుకు విశేషమైన కృషి చేశారని అందరికి తెలుసు. కానీ జాతీయ లేదా ప్రపంచ సంఘటనల గమనంపై ఆయన ప్రభావాన్ని పూర్తిగా అంచనా వేయలేక పోతున్నాము.
ఎందుకంటే అటువంటి వ్యక్తుల ప్రభావం లోతైనది. పైగా, సర్వవ్యాప్తి చెందినది. అయితే ఎక్కువగా అంతర్లీనంగా ఉంటుంది. ముఖ్యంగా భారతదేశ స్వతంత్ర సమరయోధులపై ఆయన ప్రభావం విశేషంగా ఉన్నదని చెప్పవచ్చు. స్వామి వివేకానందను భారత స్వాతంత్య్ర ఉద్యమ జ్యోతిగా, దేశంలోని అనేక తరాలకు చెందిన స్వాతంత్య్ర సమరయోధులకు స్ఫూర్తి ఇచ్చిన యోగిగా చెప్పవచ్చు.
ఫ్రెంచ్ విప్లవం వోల్టేర్, రూసో, మాంటెస్క్యూ వంటి ఫ్రెంచ్ తత్వవేత్తల నుండి ఏ విధంగా ప్రేరణ పొందిందో, అదే విధంగా భారతదేశ స్వాతంత్య్ర పోరాటం కూడా అత్యంత గౌరవనీయమైన స్వామి వివేకానంద నుండి ప్రేరణ పొందిందని స్పష్టం అవుతుంది. స్వతంత్రం సిద్దించి 75 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా ఆజాది కా అమృత్ మహోత్సవ్ సందర్భంగా స్వామిజీ ప్రభావాన్ని స్మరించుకొందారు.
వివేకానంద జాతీయ జీవనంలోకి వచ్చిన సమయంలో భారతదేశం తన రాజకీయ, ఆర్థిక ప్రాబల్యాన్ని కోల్పోయింది. దాదాపుగా తన గుర్తింపును, అద్భుతమైన గతాన్ని మరచిపోయింది. ఈస్టిండియా కంపెనీ, బ్రిటీష్ వారి రెండు వందల సంవత్సరాల నిర్లక్ష్య దోపిడికి గురవుతూ, భారత దేశపు గొప్ప సంప్రదాయాల అభ్యాసం, శాస్త్రీయ సాధనలకు అశనిపాతంగా పరిణమిస్తున్న సమయంలో ఆయన రంగ ప్రవేశం చేశారు.
ఆయన ప్రభావం ఎక్కువగా యువతపై కనిపిస్తుంది. నాటి యువ స్వతంత్ర సమరయోధుల అందరి పుస్తకాలలోనో, జేబులలోనో స్వామిజీ ఫోటోలు ఉండెడివి. 1893లో చికాగో ప్రసంగంకు బయలుదేరడానికి ముందే మద్రాస్ లో భారత్ స్వతంత్రం పొందబోతున్నదని స్పష్టంగా చెప్పారు. స్వతంత్ర పోరాటానికి ఆయన ఒక విధంగా బలమైన స్ఫూర్తి కేంద్రంగా నిలిచారు.
ఆయన చికాగోలో చేసిన చారిత్రాత్మక ప్రసంగం పాశ్చాత్య ప్రపంచం భారతదేశాన్ని చూసే విధానాన్ని మార్చడమే కాకుండా, తమ పట్ల భారతదేశ ప్రజల అభిప్రాయాన్ని కూడా మార్చింది. వారిలో బలీయమైన స్వతంత్ర ఆకాంక్షను ఏర్పరిచింది.
నేతాజీ సుభాష్ చంద్రబోస్ పై వివేకానంద ప్రభావం చాలావరకు అందరికి తెలిసిందే. అయితే అహింసా విధానం అవలంభించిన మహాత్మా గాంధీ (1869-1948), విప్లవ మార్గం అనుసరించిన హేమచంద్ర ఘోష్ (1888-1980) వంటి విభిన్న ధోరణులు ప్రదర్శించిన వారికి కూడా ఆయన స్ఫూర్తిగా నిలిచారు. చివరకు అరబిందో ఘోష్ (1872-1950) పై కూడా గొప్ప ఆధ్యాత్మిక ప్రభావాన్ని చూపారు.
గాంధీజీ, వాస్తవానికి, 1901లో కలకత్తాలో నగరంలో జరిగిన తన మొదటి కాంగ్రెస్ సమావేశానికి హాజరైనప్పుడు వివేకానందాను ఆయనను కలవడానికి ప్రయత్నించారు. గాంధీజీ తన ఆత్మకథలో, ఆ ఉత్సాహంతో దాదాపు బేలూర్ మఠం వరకు నడిచినట్లు పేర్కొన్నారు. ఆ ప్రదేశాన్ని చూసి చాలా కదిలిపోయిన్నట్లు వ్రాసుకున్నారు.
అయితే స్వామీజీ ఆ సమయంలో కలకత్తాలో ఉన్నారని, చాలా అనారోగ్యంతో ఉండడంతో సందర్శకులు ఎవ్వరిని కలవలేక పోతున్నారని తెలిసి చాలా నిరుత్సాహానికి గురయ్యారు. ఆ తరవాత కొద్దీ కాలానికే స్వామిజి మృతి చెందారు. తదనంతరం, జనవరి 30, 1921న బేలూరు మఠంలో జరిగిన స్వామి వివేకానంద జయంతి వేడుకలకు మహాత్మా గాంధీ హాజరయ్యారు.
ప్రసంగించమని అభ్యర్థించగా ఆయన హిందీలో మాట్లాడారు. ఇతర విషయాలతో పాటు, తాను స్వర్గీయ స్వామి వివేకానంద పట్ల గొప్ప గౌరవాన్ని కలిగి ఉన్నానని, ఆయన రాసిన అనేక పుస్తకాలను అధ్యయనం చేశానని, ఆయన ఆదర్శాల విషయంలో ఆ గొప్ప వ్యక్తితో చాలా విషయాలలో ఏకీభవించాయని చెప్పారు.
వివేకానందుడు జీవించి ఉంటే తాను చేపట్టిన జాతీయ జాగృతికి అది గొప్ప సహాయకారిగా ఉండేదని గాంధీజీ పేర్కొన్నారు. అయినప్పటికీ, ఆయన ఆత్మ మనందరిలో ఉన్నదని చెబుతూ ఆయన ఆశించిన స్వరాజ్యాన్ని స్థాపించడానికి తమ వంతు కృషి చేస్తామని తెలిపారు. అన్నింటికంటే ముందు తమ దేశాన్ని ప్రేమించడం ఆయన నుంచి నేర్చుకోవాలని సూచించారు.
అందరూ ఒకే మనస్తత్వం కలిగి ఉండాలని కూడా చెప్పారు. తమ దేశానికి చెందిన సంపన్నులైన కొద్దిమందితే “అణచివేత”కు గురవుతున్న పేద ప్రజల పట్ల స్వామిజీ వ్యక్తపరచిన సానుభూతిని తాను కూడా పంచుకొంటున్నట్లు ఒక సందర్భంలో గాంధీజీ వ్రాసారు.
“దేశంలో కొందరు ఉన్నత కులాలకు చెందిన వారు తమలోని కొందరిని అణచివేయడం ద్వారా తామే అణచివేతకు గురవుతున్నారని స్వామి వివేకానంద మనకు గుర్తు చేశారు. మిమ్ములను మీరు చులకన చేసుకోకుండా మీ సొంత జాతికి చెందిన ఇతరులను చులకన చేయలేరని స్వామిజీ వారించారు.” అంటూ ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు.
హేమచంద్ర ఘోష్ అగ్రగామి విప్లవకారుడు. ఆయన ఢాకా ముక్తి సంఘ స్థాపకుడు. నవలా రచయిత శరత్చంద్ర ఛటోపాధ్యాయ తన పథేర్ దాబీ (1926) నవలకు కధాంశంగా ఆదర్శ విప్లవకారుడు సబ్యసాచి పాత్ర గురించిన ఆలోచనను అందించింది ఆయనే. కలకత్తాలోని రైటర్స్ బిల్డింగ్‌పై దాడి చేసిన ముగ్గురు యువ విప్లవకారులైన బెనోయ్, బాదల్, దినేష్ లు కూడా ఘోష్ అనుచరులే.
1901లో వివేకానంద స్నేహితుల బృందంతో ఘోష్ ఢాకాను సందర్శించినప్పుడు ఘోష్‌ని కలిశాడు. స్వామీజీ వారికి ఇచ్చిన నిర్దేశిత సూచన: “భారతదేశం రాజకీయంగా మొదట స్వేచ్ఛగా ఉండాలి, ఎందుకంటే ప్రపంచ దేశాలలో ఎవరూ వలస దేశాన్ని గౌరవించరు. వారు చెప్పే మాటలు వినరు. అటువంటి సమయం చాలా దూరంలో లేదని నేను చెబుతున్నాను. దీనిని ఎవ్వరు ఆపలేరు.”.
స్వామిజీ చెప్పిన మాటలను ఆయన ఈ విధంగా వ్రాసారు: “అన్నిటికంటే ముఖ్యంగా సౌశీల్యం కలిగి ఉండండి. మీరు భారతమాతకు సేవ చేయాలనుకుంటే ధైర్యంగా ఉండండి. గొప్ప శక్తిని, ధైర్యాన్ని సంపాదించిన తర్వాత ఆమె బాధను తగ్గించడానికి ముందుకు సాగండి”.
హేమచంద్ర స్వామీజీని సుదూర విగ్రహంగా కాకుండా, భారతీయ యువతకు మార్గం చూపిన అన్నయ్యగా, దేశం కోసం చిన్న వయస్సులోనే తమ జీవితాన్ని త్యాగం చేసిన విప్లవకారుల హృదయానికి చాలా దగ్గరగా ఉన్న వ్యక్తిగా ప్రేమగా గుర్తు చేసుకున్నారు.
ఒక వైపు, గాంధీ “అణచివేతకు గురయిన తరగతుల” పట్ల వివేకానంద ద్వారా సానుభూతితో కదిలించబడ్డాడు. మరోవైపు, హేమచంద్ర వంటి యువకులు బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాడటానికి తమను తాము సంఘటితం చేసుకునేలా ప్రేరేపించారు. ఇంకోవైపు, జాతీయవాద నాయకుడు అరబిందో ఘోష్ ఆధ్యాత్మిక పరిణామంలోకూడా స్వామీజీ గణనీయమైన పాత్ర పోషించారు.
ఆయన చివరకు శాశ్వతమైన అన్వేషణలో ప్రాపంచిక జీవితాన్ని విడిచి పట్టారు. ఆధ్యాత్మిక స్పృహ ఉన్నత స్థాయిల గురించి తనకు బోధించడానికి స్వామీజీ ఆత్మ చాలా రోజులు అలీపూర్ జైలులో తనను సందర్శించిందని శ్రీ అరబిందో అంగీకరించారు:
“నేను జైలులో పక్షం రోజుల పాటు నాతో మాట్లాడుతున్న వివేకానంద స్వరాన్ని నిరంతరం వింటున్నాను. నా ఏకాంత ధ్యానం ఆయన అతని ఉనికిని అనుభవించింది. స్వరం ప్రత్యేకమైన, పరిమితమైన కానీ చాలా ముఖ్యమైన ఆధ్యాత్మిక అనుభవంపై మాత్రమే మాట్లాడింది. ఆ విషయంపై చెప్పవలసినదంతా చెప్పడం ముగించిన వెంటనే ఆ స్వరం ఆగిపోయింది”.
శ్రీ అరబిందో తన ఆధ్యాత్మిక అనుభవం గురించి ఇలా వ్రాసారు: “మనం రామకృష్ణుడి నుండి ఉద్భవించామని కూడా గుర్తుంచుకోండి. నా కోసం రామకృష్ణ గారు స్వయంగా వచ్చి నన్ను మొదట ఈ యోగా వైపు మళ్లించారు. నేను అలీపూర్ జైలులో ఉన్న సమయంలో వివేకానంద మా సాధనకు ఆధారమైన ఆ జ్ఞానానికి పునాదులు ఇచ్చారు”.
వివేకానంద ప్రభావం పొందిన మరి అనేక మంది జాతీయవాద నాయకులు ఉన్నారు. వివిధ వ్యక్తులపై ఆయన ప్రభావం వైవిధ్యంగా, బహు కోణాలను కలిగి ఉందని కూడా మనకు అర్ధం అవుతుంది. అది సామాజిక, రాజకీయ, ఆధ్యాత్మిక రంగాలను చెంది ఉంటుంది.
మొత్తం మీద, దేశం కోసం వారిని జీవించే విధంగా అందుకోసమే చనిపోయేలా ప్రేరేపించింది. భారతదేశం స్వాతంత్య్రం గురించి. 1897లో, స్వామీజీ ఇలా అన్నారు: “రాబోయే యాభై సంవత్సరాలలో ఇది (స్వాతంత్య్రం) మాత్రమే మనకు ముఖ్యాంశం – ఇది, మన గొప్ప తల్లి భారతదేశం.” సరిగ్గా యాభై సంవత్సరాల తర్వాత, భారతదేశం స్వాతంత్య్రం పొందింది!