వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలో 10 సీట్లకు పైగా సాధించడమే లక్ష్యంగా ముందుకు సాగాలని బీజేపీ శ్రేణులకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. తెలంగాణ పర్యటనకు గురువారం వచ్చిన అమిత్ షా రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలోని కొంగర కలార్‌లో ఉన్న శ్లోక కన్వెక్షన్‌లో జరిగిన బీజేపీ రాష్ట్ర విస్తృత స్థాయి సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ విస్తృత స్థాయి సమావేశంలో మండల అధ్యక్షుడి నుంచి జాతీయ స్థాయి నేతల వరకు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా లోక్ సభ ఎన్నికలకు సన్నద్ధం కావడంపై పార్టీ శ్రేణులకు అమిత్ షా దిశానిర్ధేశం చేస్తూ ప్రతి బీజేపీ కార్యకర్త కష్టపడి పనిచేస్తే దేశంలో 400 పైగా సీట్లు గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. గత ఎన్నికల్లో బీజేపీ తెలంగాణాలో కేవలం ఒక్క సీటు మాత్రమే సాధించిందని, అయితే ఈ ఎన్నికల్లో 8 సీట్లు సాధించామని హర్షం వ్యక్తం చేశారు.
వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో అధికారంలోకి వస్తామని, తెలంగాణలో 64 లేక 95 అసెంబ్లీ సీట్లు రావచ్చని ఆయన జోస్యం చెప్పారు. గత ప్రభుత్వంలో కేసీఆర్ ప్రభుత్వం పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడిందని ఆరోపిస్తూ మాదిగ సమాజానికి న్యాయం చేస్తున్న ఏకైక పార్టీ బీజేపీనే అని స్పష్టం చేశారు.
25 శాతానికి పైగా ఓట్లు 10కి పైగా ఎంపీ సీట్లే లక్ష్యంగా పని చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ప్రతి కార్యకర్త పార్టీ నాది అనేలా పనిచేయాలన్నారు. ముందుగా సమావేశంలో రాజకీయ తీర్మానాన్ని డీకే అరుణ ప్రవేశపెట్టారు. వచ్చే ఎన్నికల్లో నరేంద్ర మోడీ విజయం చారిత్రక అవసరమనే తీర్మానం ప్రవేశపెట్టగా సమావేశంలో అందరూ ఆమోదించారు.
గురువారం తెలంగాణ పర్యటనకు వచ్చిన అమిత్ షా ముందుగా చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారిని కేంద్రమంత్రి అమిత్ షా దర్శించుకున్నారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూజారులచే ఆశీర్వచనాలు తీసుకున్నారు. అమిత్ షా వెంట కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఉన్నారు.
ఆ తర్వాత బీజేపీ నేతలతో సమావేశమై విభేదాలు పక్కన పెట్టి అంతా కలిసి పనిచేయాలని స్పష్టం చేశారు. బేధాభిప్రాయాలు ఉండకూడదని తేల్చి చెప్పారు. అంతా కలిసి పనిచేసి సార్వత్రిక ఎన్నికల్లో పనిచేయాలన్నారు. సిట్టింగ్ స్థానాల్లో వారే పోటీ చేస్తారని చెప్పారు.
ప్రతి లోక్‌సభ స్థానం కీలకమే
వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో ప్రతి నియోజకవర్గాన్ని కీలకంగా భావించి పనిచేయాలని అమిత్ షా నొవాటెల్‌లో తెలంగాణ ముఖ్య నేతల సమావేశంలో సూచించారు. మూడు లేదా నాలుగు లోక్‌సభ స్థానాలను ఒక యూనిట్‌గా తీసుకుని బస్సు యాత్రలు నిర్వహించాలని, వీటిలో పార్టీ ముఖ్య నేతలంతా భాగస్వాములు అయ్యేలా చూసుకోవాలని చెప్పారు.
కనీసం 10 స్థానాలు గెలవాలని లక్ష్యంగా పెట్టుకోవాలని, మిగతా చోట్ల కూడా గట్టి పోటీ ఇచ్చేలా పనిచేయాలని కోరారు. ‘రిజర్వుడు నియోజకవర్గాలను కూడా ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవాలి. గెలిచే సీటు.. ఓడిపోయే సీటు అని చూడకూడదు. ప్రతీ నియోజకవర్గం మనకు కీలకమే. మోదీ హవా ఉంది. దానిని మనం సద్వినియోగం చేసుకోవాల’ని అమిత్ షా చెప్పారు.
జనవరి రెండో వారంలో మెజారిటీ అభ్యర్థులతో తొలి జాబితా ప్రకటించేలా చర్యలు తీసుకోవాలని పార్టీ రాష్ట్ర ఇన్చార్జి సునీల్ బన్సల్‌కు సూచించారు.ఇందుకు అనుగుణంగా ప్రతీ నియోజకవర్గం నుంచి ముగ్గురు ఆశావహుల జాబితాను వారం రోజుల్లో అందించాలని చెప్పారు. సిటింగ్ ఎంపీలకు ఈ సందర్భంగా అమిత్ షా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం.
ఈ సమావేశానికి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి జీ కిషన్‌రెడ్డి, బీజేపీ పార్లమెంటరీ బోర్డు సభ్యుడు డాక్టర్ కె.లక్ష్మణ్, జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్, జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, అసెంబ్లీ ఎన్నికల ఇన్చార్జి ప్రకాశ్ జావడేకర్, జాతీయ కార్యవర్గసభ్యులు ఈటల రాజేందర్ హాజరయ్యారు.