ప్రధాని నరేంద్ర మోదీ శనివారం అయోధ్యలో ఇటీవల అభివృద్ధి చేసిన అయోధ్య ధామ్ రైల్వే స్టేషన్‌ను, నూతనంగా నిర్మించిన వాల్మీకి ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ లను ప్రారంభించారు. తొలుత ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఘనంగా స్వాగతం పలకగా, ప్రధాని రోడ్ షో జరిపారు.
సుమారు రూ. 240 కోట్ల ఖర్చుతో అయోధ్య రైల్వే స్టేషన్‌ను రీడెవలప్ చేశారు. మూడు అంతస్థుల్లో నిర్మించిన ఈ స్టేషన్లో అన్ని ఆధునిక సౌకర్యాలను ఏర్పాటు చేశారు. లిఫ్ట్‌లు, ఎస్కలేటర్లు, ఫుడ్ ప్లాజాలు, పూజా సామాగ్రి షాపులు, క్లోక్ రూమ్‌లు, చైల్డ్ కేర్ రూమ్‌లు, వెయిటింగ్ హాల్స్‌ను ఏర్పాటు చేశారు. కొత్తగా నిర్మించిన అయోధ్య స్టేషన్‌కు ఐజీబీసీ గ్రీన్ స్టేషన్ సర్టిఫికేట్ ఇచ్చింది.
రైల్వే స్టేషన్‌ను ప్రారంభించిన తర్వాత ప్రధాని మోదీ కొత్త గా వస్తున్న అమృత్ భారత్ రైలు ఎక్కారు. ఆ రైలులో ఉన్న విద్యార్థులతో ఆయన ముచ్చటించారు. అమృత్ భారత్, వందేభారత్ రైళ్లకు పచ్చజెండా ఊపి ప్రారంభించారు. రెండు అమృత్ భారత్, ఆరు వందేభారత్ రైళ్లను ఈరోజు ప్రారంభించారు.
అనంతరం ప్రధాని మాట్లాడుతూ.. “అయోధ్య ధామ్ కు అమృత్ భారత్ రైలును ప్రారంభిస్తున్నాం. అన్ని ప్రధాన నగరాలను కలుపుతూ వందేభారత్ రైళ్లు ఉన్నాయి. త్వరలో మరిన్ని నగరాలకు వందే భారత్ రైళ్లు విస్తరిస్తాం. దేశంలో మారుమూల ఆలయాలకు రైలు సౌకర్యం కల్పిస్తాం. గయ, లుంబిని, కపిలవస్తు, సారనాథ్ క్షేత్రాలను మరింత అభివృద్ధి చేస్తాం” అని తెలిపారు.
అయోధ్యలో అన్ని వసతులతో టౌన్ షిప్ లు నిర్మిస్తున్నామని చెబుతూ అయోధ్యలో రద్దీ మేరకు రహదారులు విస్తరిస్తామని చెప్పారు. అయోధ్యలో 4 కోట్ల మంది నివసించేలా అన్ని సౌకర్యాలు కల్పించామని వెల్లడించారు. ఉత్తర్ ప్రదేశ్ అభివృద్ధిలో అయోధ్యది కీలక పాత్ర అని పేర్కొన్నారు.
“అయోధ్య విమానాశ్రయానికి మహర్షి వాల్మికీ పేరు నామకరణం చేశాం. త్రికాలదర్శి అయిన మహర్షి వాల్మీకి పేరు పెట్టడం జన్మధన్యం. రోజు 10 లక్షల మందికి సేవలు అందించేలా అయోధ్య విమానాశ్రయాన్ని నిర్మించాం. అయోధ్య ధామ్ లో ఎక్కడ చూసినా.. రామనామం వినిపించాలి” అని చెప్పారు.
“జనవరి 22న రాత్రి దేశమంతా ప్రతి ఇంటా దీపాలు వెలిగించాలి. జనవరి 23 నుంచి ప్రజలంతా అయోధ్యకు రావొచ్చు. అయోధ్యను శుభ్రంగా ఉంచటం అయోధ్య వాసులదే బాధ్యత” అని చెప్పారు.
సంవత్సరానికి దాదాపు 10 లక్షల మంది విమాన ప్రయాణం చేసే విధంగా ఎయిర్‌పోర్టును నిర్మించారు. ఇక విమానాశ్రయంలో రామాయణ ఇతివృత్తం దర్శనమిచ్చేలా పేయింటింగ్స్ వేశారు. వాల్మీకి రాసిని రామాయణం ఆధారంగా ఆ కలర్‌ఫుల్ మ్యూరల్స్ వేశారు. రూ.1450 కోట్లతో వాల్మీకి విమానాశ్రయాన్ని నిర్మించినట్లు పీఎంవో ఓ ప్రకటనలో తెలిపింది.
వాల్మీకి విమానాశ్రయాన్ని ప్రారంభించగానే ఢిల్లీ నుంచి అయోధ్యకు ఇవాళ మధ్యాహ్నం ఇండిగో విమానం బయలుదేరింది. ఆ విమాన కెప్టెన్ అశుతోష్ శేఖర్ ప్రయాణికులకు స్వాగతం పలికారు. జై శ్రీరామ్ అంటూ ప్రయాణికులు నినాదాలు చేశారు.