బంగ్లా యుద్ధం – 27
ఒక దేశంగా బంగ్లాదేశ్ ఆవిర్భావం హింసాత్మకంగా జరిగింది. ఈ సందర్భంగా జరిగిన కల్లోలానికి మూలాలు 1947 నాటి భారత్ విభజనలోనే ఉన్నాయి. బ్రిటిష్ వలస పాలకులు ఉపఖండాన్ని విడిచిపెట్టి వెళ్లే సమయంలో జరిగిన మతపరమైన హింసలో సుమారు 2 లక్షల మంది మృతి చెందారు. మరో కోటి మంది నుండి 1.5 కోట్ల మందివరకు నిరాశ్రయులయ్యారు.
కొత్తగా ఏర్పడిన స్వతంత్ర పాకిస్థాన్‌లో వెయ్యి మైళ్లకు పైగా భారత భూభాగంతో వేరు చేస్తున్న రెండు వేర్వేరు భౌగోళిక ప్రాంతాలు ఉన్నాయి. రెండు ప్రాంతాలు గణనీయమైన ముస్లిం జనాభాను కలిగి ఉండగా, పశ్చిమ పాకిస్తాన్ ఎక్కువగా పంజాబీ, పష్టున్లు, సింధీలు, బలూచ్, ఇతర చిన్న జాతులతో నిండి ఉంది.
అందుకు విరుద్ధంగా, ఆధునిక బంగ్లాదేశ్‌గా మారిన తూర్పు పాకిస్తాన్ జనాభా ప్రధానంగా జాతిపరంగా బెంగాలీగా ఉంది, ఎందుకంటే ఈ భూభాగం గతంలో బెంగాల్‌లోని భారత ప్రాంతంలో భాగంగా ఉంది.
ఈ రెండు ప్రాంతాల మధ్య గల వైరుధ్యాలు, ముఖ్యంగా భాష, రాజకీయ, ఆర్ధిక అసమానతల వంటి వ్యత్యాసాలు బాంగ్లాదేశ్ స్వతంత్ర పోరాటంకు పునాదులు వేసాయి.
1948లో, పాకిస్తాన్ నిర్మాతగా పేరొందిన ముహమ్మద్ అలీ జిన్నా, బ్రిటిష్ ఇండియాలో ఉత్తర, వాయువ్య ప్రాంతాలలో ముస్లింలు మాట్లాడే ఉర్దూ మాత్రమే దేశానికి జాతీయ భాషగా ఉండాలని పట్టుబడుతూ వచ్చారు. తూర్పు పాకిస్థానీయులు ఎక్కువగా మాట్లాడే బంగ్లాను పశ్చిమ పాకిస్థానీ నాయకత్వం “ముస్లిమేతర” భాషగా పరిగణించింది.
ఇస్లాం పేరుతో ఐక్యమైన రెండు సాంస్కృతికంగా విభిన్న ప్రాంతాలకు ఒకే గుర్తింపు సాధింప గలిగింది ఉర్దూ భాష మాత్రమే అని భావించాడు. ఆ భాష ద్వారా మాత్రమే ఎటువంటి చారిత్రక, భౌగోలిక ప్రాతిపదిక లేకుండా ఏర్పడిన పాకిస్థాన్ కు ఒక జాతీయ గుర్తింపు తీసుకొచ్చి, ఏకీకృతం చేయగలదని ప్రయత్నం చేస్తూ వచ్చారు.
తూర్పు పాకిస్తాన్లో, బెంగాలీ నోబెల్ బహుమతి గ్రహీత రవీంద్రనాథ్ ఠాగూర్ రాసిన బెంగాలీ పుస్తకాలు, పాటలు, కవితలను నిషేధించడంతో భాషాపరమైన దురాక్రమణ ప్రారంభించారు. విద్యా మాధ్యమంగా బంగ్లా భాషను ప్రాధమిక స్థాయిలో కూడా నిషేధించారు. పోస్టల్ స్టాంపులు, రైల్వే టిక్కెట్లతో సహా అన్ని కరెన్సీ, అధికారిక పత్రాలను ఉర్దూలో ముద్రిస్తూ వచ్చారు.
అప్పటికే పశ్చిమ, తూర్పు పాకిస్తాన్ల మధ్య చెలరేగిన ఉద్రిక్తతలను భాష నిషేధం తీవ్రతరం చేసింది. రెండు ప్రాంతాల మధ్య గణనీయమైన ఆర్థిక అసమానతలు దీనికి ప్రధాన కారణం. పశ్చిమ పాకిస్తాన్ దేశంలోని మొత్తం పరిశ్రమలు, వాణిజ్యాన్ని నియంత్రిస్తుంది. అయితే తూర్పు పాకిస్తాన్ ప్రధానంగా ముడి పదార్థాల సరఫరాదారుగా ఉంది.
1959-60లో పశ్చిమ పాకిస్తాన్లో తలసరి ఆదాయం తూర్పు పాకిస్తాన్‌తో పోలిస్తే 32 శాతం ఎక్కువ. 1969-70 నాటికి, పశ్చిమ పాకిస్తాన్లో ఇది 81 శాతంఎక్కువ. విద్యా మౌలిక సదుపాయాలతో సహా పెట్టుబడి విధానాలు పశ్చిమ పాకిస్తాన్‌కు స్థిరంగా అనుకూలంగా ఉన్నాయి.
పశ్చిమ పాకిస్థానీలోని ఇస్లామాబాద్ నగరంలో ఉన్న కేంద్ర ప్రభుత్వానికి తూర్పు పాకిస్థానీయులకు అంతగా ప్రవేశం లేదు. రాజకీయాల్లో వారికి చాలా తక్కువగా ప్రాతినిధ్యం లభిస్తూ వచ్చింది. పశ్చిమ పాకిస్తాన్ రాజకీయ నాయకత్వం బెంగాలీలను “నిజమైన” ముస్లింలుగా చూడలేదు. రాజకీయ వర్గాల్లో, సామాజికంగా, బెంగాలీ సాంస్కృతిక పద్ధతులను సామాజికంగా చులకనగా భావిస్తుండేవారు.
సామూహిక తిరుగుబాటు
తూర్పు పాకిస్తానీలను ఉర్దూ ద్వారా “ఇస్లాం మతపరం” చేయడానికి, “హిందూ ప్రభావాల” నుండి బెంగాలీ సంస్కృతిని “శుద్ధి” చేయడానికి చేసిన ప్రయత్నాలు భారీ అహింసాత్మక ప్రదర్శనలు, సమ్మెలకు దారితీశాయి. ఫిబ్రవరి 21, 1952న, విద్యార్థులు, ఇతర కార్యకర్తలు “భాషా ఆందోళన్” అనే భాషా ఉద్యమాన్ని ప్రారంభించారు.
ఈ ఉద్యమం బంగ్లాను తూర్పు పాకిస్తాన్‌కు రాష్ట్ర భాషగా గుర్తించాలని డిమాండ్ చేసింది. ఐదుగురు లేదా అంతకంటే ఎక్కువ మంది వ్యక్తులు సమావేశమై బహిరంగ సభలు నిర్వహించడాన్ని నిషేధించే క్రిమినల్ ప్రొసీడ్యూరల్ కోడ్ సెక్షన్ 144ను ధిక్కరిస్తూ వేలాది మంది పాఠశాల, కళాశాల విద్యార్థులు నిరసన తెలిపారు.
ఆ తర్వాత జరిగిన అణచివేత అనేక మంది ప్రాణాలను బలిగొంది. 1950 నుండి 1969 వరకు ఇది తూర్పు పాకిస్తాన్ అంతటా స్వయంప్రతిపత్తి కోసం పెరుగుతున్న ఉద్యమాన్ని ప్రేరేపించింది.
1969లో ఒక సామూహిక తిరుగుబాటును పోలీసులు క్రూరంగా అణిచివేశారు. అది మార్షల్ లా విధించడానికి దారితీసింది.
1970లో, తూర్పు పాకిస్తాన్లో “భోలా” అనే విధ్వంసకర తుఫాను 300,000 నుండి 500,000 మంది ప్రాణాలను బలిగొంది. పశ్చిమ పాకిస్తాన్ ప్రభుత్వపు ఉదాసీన ప్రతిస్పందన ఉద్రిక్తతలను మరింత పెంచింది.
అదే సంవత్సరం తూర్పు పాకిస్తాన్లో బెంగాలీ రాజకీయ నాయకుడు షేక్ ముజిబుర్ రెహమాన్ నేతృత్వంలోని ఏకైక మెజారిటీ రాజకీయ పార్టీ జాతీయ ఎన్నికలలో భారీ విజయం సాధించడంతో పెద్ద మలుపు వచ్చింది. ఫెడరల్ ప్రభుత్వానికి నాయకత్వం వహించే తూర్పు పాకిస్తానీ రాజకీయ పార్టీని కోరుకోనందున పాకిస్తాన్ నాయకత్వం ఫలితాలను అంగీకరించడానికి ఇష్టపడలేదు.
దీని ఫలితంగా తూర్పు పాకిస్తాన్లో శాసనోల్లంఘన ఉద్యమం ప్రారంభమైంది. బెంగాలీ స్వయంప్రతిపత్తి కోసం డిమాండ్ పెరగడంతో, పాకిస్తాన్ ప్రభుత్వం ఆపరేషన్ సెర్చ్‌లైట్” పేరుతో ఉద్భవిస్తున్న ఉద్యమాన్ని అణిచివేసేందుకు సైనిక చర్యగా ప్రారంభించింది. ఒక్క రాత్రిలోనే కనీసం 7,000 మంది బెంగాలీ పౌరులను – హిందువులు, ముస్లింలను చంపింది. మార్చి 26న బంగ్లాదేశ్ ను స్వతంత్రంగా ప్రకటిస్తూ విముక్తి యుద్ధం ప్రారంభమైంది.
విముక్తి పోరాటంలో ఎక్కువగా సామాన్యులే
విముక్తి పోరాటంలో ఎక్కువగా పాల్గొన్నది సాధారణ పౌరులే. పురుషులు, స్త్రీలు, ముస్లింలు, హిందువులు, బెంగాలీయేతర స్థానికులు పోరాడారు. బంగ్లాదేశ్ స్వాతంత్య్ర పోరాటం ప్రచ్ఛన్న యుద్ధం విస్తృత సందర్భంలో జరగడం గమనార్హం.
ప్రచ్ఛన్న యుద్ధ సమయంలో, భారతదేశం సోవియట్ యూనియన్‌తో పొత్తు పెట్టుకుంది. అయితే దక్షిణాసియాలో సోవియట్ ప్రభావాన్ని ఎదుర్కోవడానికి, ఆఫ్ఘనిస్తాన్, చైనాలలో తన భౌగోళిక వ్యూహాత్మక ప్రయోజనాలను పరిరక్షించడానికి అమెరికా పాకిస్తాన్‌తో పొత్తు పెట్టుకుంది. పాకిస్తానీ సైన్యం విముక్తి పోరాటాన్ని అణచివేయడాన్ని తీవ్రతరం చేయడంలో నిక్సన్ పరిపాలనకు తెలిసి, దాని మద్దతుతోనే జరగడం గమనించాలి.
పాకిస్తానీ సైన్యం, దానికి స్థానికంగా సహాయ సహకారాలు అందించినవారు ప్రత్యేకంగా హిందువులను లక్ష్యంగా చేసుకున్నారు, 1961 జనాభా లెక్కల ప్రకారం తూర్పు పాకిస్థాన్‌లోని 50 మిలియన్ల జనాభాలో 18 శాతం మందిగా హిందువులు ఉన్నారు. భారత్ కు శరణార్థులుగా వచ్చిన సుమారు కోటి మందిలో వీరే అధికంగా ఉన్నారు. మరో రెండు కోట్ల మంది వరకు అంతర్గతంగా నిరాశ్రయులయ్యారు.
ఒక అంచనా ప్రకారం రెండు లక్షల నుండి 4 లక్షల మంది వరకు బెంగాలీ మహిళలు ఓ క్రమపద్ధతిలో అత్యాచారానికి గురయ్యారు. సుమారు 5 లక్షల మంది జాతి నిర్మూలన పేరుతో హతమార్చిన్నట్లు స్వతంత్ర నివేదికలు తెలుపుతున్నాయి. యుద్ధంలో 30 లక్షల బెంగాలీలు మరణించారని బంగ్లాదేశ్ ప్రభుత్వం చెబుతోంది.
డిసెంబర్ 3న, బంగ్లాదేశ్ పక్షాన భారతదేశం అధికారికంగా యుద్ధంలోకి ప్రవేశించింది. పది రోజుల తర్వాత, చివరి సైనిక చర్యల్లో 300 మంది బెంగాలీ విద్యావేత్తలు, వైద్యులు, ఇంజనీర్లు , జర్నలిస్టులు, కళాకారులు, ఉపాధ్యాయులను పాకిస్తానీ సైనికులు స్థానికుల సహకారంతో ఊచకోత కోశారు. వారిలో హిందువులు, ముస్లింలు కూడా ఉన్నారు.
డిసెంబర్ 16, 1971న, పాకిస్తానీ సైన్యం భారత సైన్యానికి లొంగిపోయింది, దీనిని బంగ్లాదేశ్ విజయ దినంగా పేర్కొంటారు. స్వాతంత్య్రం వచ్చిన వెంటనే, యునైటెడ్ స్టేట్స్ ఏజెన్సీ ఫర్ ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ అధికారులు, అమెరికా విదేశాంగ కార్యదర్శి హెన్రీ కిస్సింజర్ మధ్య జరిగిన సమావేశంలో ఆ నాటి సవాళ్ళకు “బాస్కెట్ కేస్” అని పేరు పెట్టారు.
సంవత్సరాల తరబడి ఆర్థిక అసమానతలు, 1970 తుఫాను, యుద్ధం కారణంగా 70 శాతం కన్నా ఎక్కువ జనాభాను దారిద్య్ర రేఖకు దిగువకు నెట్టివేశారు. అయితే స్వాతంత్య్రం వచ్చిన 50 సంవత్సరాలలో, బంగ్లాదేశ్ కొన్ని ముఖ్యమైన పురోగతిని సాధించిందనడంలో సందేశం లేదు.
ఇది శిశు మరణాలు, లింగ అసమానత, ఆర్థిక అభివృద్ధిని దూకుడుగా పరిష్కరించింది. నేడు, వృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థతో, ఐక్యరాజ్యసమితి దానిని అతి తక్కువ అభివృద్ధి చెందిన దేశ కేటగిరీ నుండి గ్రాడ్యుయేట్ పొందేందుకు ఇది ట్రాక్‌లో ఉంది. అయినప్పటికీ, బంగ్లాదేశ్ ఇప్పటికీ అపారమైన సవాళ్లను ఎదుర్కొంటోంది.
మహిళలు, బాలికలపై హింస, అవినీతి, పత్రికా స్వేచ్ఛ లేకపోవడం తీవ్రమైన ఆందోళన కలిగించే అంశాలుగా ఉన్నాయి. లౌకికవాద సూత్రాలపై స్థాపించిన ఈ దేశం నేడు ఇస్లామిస్టుల పెరుగుదలను ఎదుర్కొంటోంది. స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొన్న వారికి, పాకిస్తానీ మిలిటరీకి సహకరించిన వారికి మధ్య విభజన ఈ రోజు బంగ్లాదేశ్ రాజకీయ దృశ్యాన్ని ఆకృతి చేస్తూనే ఉంది.