ప్రముఖ నటి, లోక్‌సభ మాజీ సభ్యురాలు జయప్రద చిక్కుల్లో చిక్కుకున్నారు. ఆమె కోసం ఉత్తరప్రదేశ్ పోలీసులు విస్తృతంగా గాలిస్తున్నారు. ప్రత్యేకంగా స్పెషల్ టీమ్‌ను కూడా ఏర్పాటు చేశారు. అదే సమయంలో మిస్సింగ్ కేసు సైతం ఆమెపై నమోదు కావడం కలకలం రేపుతోంది.
జయప్రదపై నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ అయింది. 2019 నాటి ఎన్నికల ప్రచార సమయంలో ప్రవర్తనా నియమావళి ఉల్లంఘించినట్లు ఆమెపై రెండు కేసులు నమోదయ్యాయి. ఎన్నికల నియమావళికి విరుద్ధంగా రామ్‌పూర్ లోక్‌సభ పరిధిలో రోడ్డును ప్రారంభించారు. అలాగే పిప్లియాలో నిర్వహించిన బహిరంగ సభలో అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు.
ఈ రెండు కేసుల్లో ఆమె నిందితురాలిగా ఉన్నారు. విచారణను ఎదుర్కొంటున్నారు. ఇదివరకే ఆమెకు న్యాయస్థానం సమన్లనూ జారీ చేశారు. విచారణకు హాజరు కావాలంటూ పలుమార్లు రామ్‌పూర్ కోర్టు న్యాయమూర్తి ఆదేశించారు. ఈ కేసులో ఆమె రెండుసార్లూ విచారణకు హాజరు కాకపోవడంతో జయప్రదకు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేశారు.
కోర్టుకు హాజరు కాకపోవడంతో న్యాయమూర్తి ఆమెపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. జనవరి 10వ తేదీలోగా ఆమెను తన ముందు ప్రవేశపెట్టాలని పోలీసులను ఆదేశించారు. ఇప్పటివరకు ఆమె గురించి ఆచూకీ తెలియరావట్లేదు. గడువు దగ్గరపడుతుండటంతో రామ్‌పూర్ జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ ఆమెను వెతకడానికి ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు.
ఆ టీమ్ కూడా జయప్రద ఆచూకీని కనిపెట్టలేకపోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. త్వరలోనే ఆమెను అరెస్ట్ చేస్తామని రామ్‌పూర్ జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ తెలిపారు. జయప్రద కోసం మరిన్ని బృందాలను ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్లు తెలిపారు. గడువులోగా న్యాయస్థానం ముందు హాజరు పర్చుతామని చెప్పారు.