2023 సంవత్సరంలో చంద్రయాన్ 3, ఆదిత్య ఎల్ 1 ప్రయోగాలతో మంచి ఊపు మీద ఉన్న భారత అంతరిక్ష పరిశోధన సంస్థ – ఇస్రో 2024 ఏడాదిని ఘనంగా ప్రారంభించేందుకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలోనే జనవరి 1 వ తేదీనే కీలక ప్రయోగాన్ని చేపట్టేందుకు రంగం సిద్ధం చేసింది. పీఎస్ఎల్వీ-సి58 రాకెట్ ప్రయోగాన్ని చేపట్టేందుకు సన్నాహాలు చేస్తోంది.
ఎక్స్ రే పొలారిమీటర్ ఉపగ్రహం (ఎక్స్‌పోశాట్)ను పీఎస్ఎల్వీ వాహకనౌక అంతరిక్షంలోకి మోసుకెళ్లనుంది. దాంతోపాటు మరో 10 పేలోడ్లను నింగిలోకి తీసుకెళ్లనుంది. ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీహరికోటలో ఉన్న సతీశ్ ధవన్ స్పేస్ సెంటర్ నుంచి ఈ ప్రయోగాన్ని ఇస్రో ప్రయోగించనుంది.
రాకెట్ సన్నద్ధత, లాంచ్ ఆథరైజేషన్ సమావేశాలను ఇస్రో శాస్త్రవేత్తలు శనివారం నిర్వహించారు. ఇందులో రాకెట్ అనుసంధానం, ఉపగ్రహ అమరిక, పరీక్షలు వంటి అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. ఇక ఈ పీఎస్ఎల్వీ – సీ58 రాకెట్ కౌంట్‌డౌన్ ప్రక్రియ ఆదివారం ఉదయం 8.10 గంటలకు ప్రారంభమైంది. 25 గంటలపాటు కొనసాగనున్న కౌంట్‌డౌన్ సోమవారం ఉదయం 9.10 గంటల వరకుకొనసాగనుంది.
ఇక పీఎస్ఎల్వీ-సి58 వాహకనౌక షార్‌లోని మొదటి ప్రయోగ వేదిక నుంచి నింగిలోకి రేపు దూసుకెళ్లనుంది. ఇది ఎక్స్‌పోశాట్‌ను కక్ష్యలోకి వదిలిపెట్టిన తర్వాత పీఎస్ 4..10 ఇతర పేలోడ్లను హోస్ట్ చేయనుంది. ఎక్స్‌పోశాట్ ఉపగ్రహం భారత్ అంతరిక్ష ఆధారిత ఎక్స్-రే ఖగోళ శాస్త్రంలో సంచలనాత్మక పురోగతికి నాంది కానుందని ఇస్రో శాస్త్రవేత్తలు తెలిపారు.
ఇమేజింగ్, టైం-డొమైన్ అధ్యయనాలు, స్పెక్ట్రోస్కొపీపై ప్రధానంగా దృష్టి సారించిన గత ప్రయోగాల లాగా కాకుండా ఎక్స్-రే ఖగోళ శాస్త్రానికి ఒక కొత్త కోణాన్ని పరిచయం చేస్తూ, ఎక్స్-రే మూలాలను అన్వేషించడం ఎక్స్‌పోశాట్ లక్ష్యమని పేర్కొన్నారు. ఈ ఎక్స్‌పోశాట్ ఉపగ్రహ జీవితకాలం అయిదేళ్లు అని చెప్పారు. పీఎస్ఎల్వీ చివరి దశ మరో 10 పరికరాలను అంతరిక్షానికి మోసుకెళ్లనుందని తెలిపారు. దీనికి పీఎస్ఎల్వీ ఆర్బిటల్ ఎక్స్పెరిమెంటల్ మాడ్యూల్ (పీవోఈఎం) అని పేరు పెట్టారు.