ఆవిష్కరణలు జరగని దేశంలో అభివృద్ధి నిలిచిపోతుందని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. సరికొత్త ఆవిష్కరణలతో భారత్ ఇన్నోవేషన్ హబ్‌గా మారిందని పేర్కొంటూ 2015లో 81వ ర్యాంకులో ఉండగా ప్రస్తుతం 40వ స్థానానికి చేరామని సంతోషం వ్యక్తం చేశారు.
`ఈ ఏడాది భారత్ నుంచి దరఖాస్తు చేసే పేటేంట్ల సంఖ్య పెరిగింది. దేశ ప్రజల శక్తిసామర్థ్యాలు అందికీ ప్రేరణగా నిలుస్తాయి.’ అని ప్రధాని మోదీ తెలిపారు. ఈ ఏడాది చివరి ఆదివారం కావడంతో మన్‌కీబాత్ కార్యక్రమంలో ప్రధాని మోదీ మాట్లాడుతూ దేశప్రజలందరికీ కొత్త ఏడాది శుభాకాంక్షలు తెలిపారు. ఈ ఏడాది దేశం ఎన్నో ఘనతలు సాధించిందని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. సుదీర్ఘకాలంగా ఎదురుచూస్తున్న మహిళా బిల్లు ఆమోదం పొందిందని చెప్పారు. ప్రపంచంలోనే ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ మారడంపై ప్రజలు లేఖలు రాసి సంతోషం వ్యక్తంచేశారు.
జీ20 విజయవంతంపై ప్రజలు లేఖలు రాసిన విషయాన్ని గుర్తు చేశారు. ‘ప్రస్తుతం దేశంలోని ప్రతి ప్రాంతం ఆత్మవిశ్వాసంతో నిండి ఉంది. దేశ ప్రజల్లో వికసిత్, ఆత్మనిర్భర్ భారత్ స్ఫూర్తి రగిలించింది. 2024లోనూ ఈ స్ఫూర్తిని ఇలాగే కొనసాగించాలి. దీపావళి సందర్భంగా దేశీయ ఉత్పత్తుల ద్వారా మన శక్తిని నిరూపించాం’ అని చెప్పారు.
చంద్రయాన్-3 విజయవంతంపై ఇప్పటీకీ సందేశాలు వస్తున్నాయి. శాస్త్రవేత్తల కృషితో చంద్రయాన్ విజయవంతమవడం అందరికీ గర్వకారణం.‘నాటు నాటు’ పాటకు ఆస్కార్ దక్కడంతో దేశం మొత్తం ఉర్రూతలూగింది. ఎలిఫెంట్ విస్పరర్స్‌కు అవార్డు దక్కడంతో భారతీయుల ప్రతిభ వెలుగుచూసింది. భారత సృజనాత్మకతను ప్రపంచవ్యాప్తంగా చాటామని వివరించారు.
ఈ ఏడాది క్రీడాకారుల ఘనతలు దేశం గర్విచేలా చేశాయి. క్రీడల్లో మన అథ్లెట్లు అద్భుత ప్రతిభ చూపారు. ఆసియా క్రీడల్లో 107, పారా గేమ్స్‌లో 111 పతకాలతో సత్తాచాటారు. వన్డే ప్రపంచకప్‌లో భారత క్రికెట్ జట్టు అందరి మనసులు దోచింది. అండర్-19 టీ20 ప్రపంచకప్‌లో మహిళల జట్టు విజయం ప్రేరణగా నిలుస్తుంది. 2024 పారిస్ ఒలింపిక్స్‌కు భారత క్రీడాకారులు సన్నద్ధమవుతున్నారని ప్రధాని చెప్పారు.
ఆజాదీ కా అమృత్ మహోత్సవ్, మేరీ మాటీ-మేరా దేశ్ వంటి కార్యక్రమాలను దిగ్విజయంగా నిర్వహించాం. ఈ కార్యక్రమాల్లో దేశవ్యాప్తంగా కోట్లాది ప్రజలు భాగస్వాములయ్యారు. దేశంలో 70 వేలకుపైగా అమృత్ సరోవర్లను నిర్మించామని గుర్తు చేశారు.