భారత్ వ్యతిరేక ప్రచారం చేపడుతున్నందుకు తెహ్రీక్-ఏ-హురియత్‌ను కేంద్ర ప్రభుత్వం ఆదివారం నిసేధించింది. చట్టవ్యతిరేక కార్యకలాపాల (నియంత్రణ) చట్టం కింద టీఈహెచ్‌ను చట్ట వ్యతిరేక సంస్ధగా కేంద్రం ప్రకటించింది. ఈ సంస్ధ జమ్ము కశ్మీర్‌ను భారత్ నుంచి విడదీసి ఇస్లామిక్ పాలన నడవాలని కోరుకుంటున్నాయని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పేర్కొన్నారు.
ఈ సంస్ధకు గతంలో దివంగత వేర్పాటువాద వేత సయ్యద్ అలీ షా గిలానీ నేతృత్వం వహించాడు. టీఈహెచ్ భారత్ వ్యతిరేక ప్రచారాన్ని ముమ్మరంగా చేపడుతూ జమ్ము కశ్మీర్లో వేర్పాటువాదాన్ని ప్రేరేపించేందుకు ఉగ్ర కార్యకలాపాలను చేపట్టడం కొనసాగిస్తోందని అమిత్ షా పేర్కొన్నారు. ఉపాచట్టం కింద జమ్మూ కశ్మీర్లో తెహ్రీక్-ఎ-హురియత్‌ను
చట్టవిరుద్ధమైన సంస్థగా ప్రకటించినట్లు వెల్లడించారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో ఏ వ్యక్తి, సంస్ధ భారత్ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే ఉపేక్షించేది లేదని హోంమంత్రి అమిత్ షా ట్విట్టర్ వేదికగా హెచ్చరించారు. జమ్మూ కాశ్మీర్, లఢక్‌లల్లో ఎలాంటి అశాంతియుత వాతావరణాన్ని తాము కోరుకోవట్లేదని, అలాంటి కార్యకలాపాలన్నింటిపైనా కఠిన చర్యలను తీసుకుంటామని అమిత్ షా స్పష్టం చేశారు. ఇందులో భాగంగానే హురియత్‌ను యూఏపీఏ కిందికి చేర్చినట్లు చెప్పారు.
2004లో ఏర్పాటైన పార్టీ ఇది. సయ్యద్ అలీ షా గిలానీ దీన్ని నెలకొల్పారు. జమాతె ఇస్లామీ కాశ్మీర్ నుంచి వేరుపడిన తరువాత ఆయన తెహ్రీక్-ఇ- హురియత్‌ను స్థాపించారు. జమ్మూ కాశ్మీర్లో ఎన్నికలను నిర్వహించడానికి కేంద్ర ప్రభుత్వం సంసిద్ధతను వ్యక్తం చేసిన వేళ.. ఈ పార్టీపై కఠిన చర్యలు తీసుకుంది కేంద్ర హోం మంత్రిత్వ శాఖ.
కాగా కేంద్రం ఇటీవల జాతి వ్యతిరేక, వేర్పాటువాద కార్యకలాపాలకు పాల్పడుతోందంటూ ముస్లిం లీగ్ జమ్ము కశ్మీర్ (మసరత్ ఆలం వర్గం) ఎంఎల్‌జేకే(ఎంఏ)ను నిషేధించింది. జమ్ము కశ్మీర్లో ఇస్లామిక్ పాలన ఏర్పాటు దిశగా ప్రజలను ఈ సంస్ధ రెచ్చగొడుతోందని కేంద్రం గుర్తించింది.