కొత్త సీజన్లో అమెరికాకు భారతీయ మామిడి పండ్లను ఎగుమతి చేయడానికి అమెరికా వ్యవసాయ మంత్రిత్వ శాఖ (యూఎస్డీఏ) ఆమోదాన్ని కేంద్రం పొందడంతో అమెరికాలోని వినియోగదారులకు ఇప్పుడు రెండేళ్ల తర్వాత భారతదేశం నుండి అద్భుతమైన నాణ్యమైన మామిడి పండ్లు అందుబాటులోకి రానున్నాయి.
కరోనా మహమ్మారి కారణంగా అంతర్జాతీయ ప్రయాణాలపై విధించిన పరిమితుల కారణంగా రేడియేషన్ సదుపాయాన్ని తనిఖీ చేయడానికి యూఎస్డీఏ ఇన్స్పెక్టర్లు భారతదేశాన్ని సందర్శించలేక పోవడంతో భారతీయ మామిడి పండ్ల ఎగుమతిని అమెరికా 2020 నుండి పరిమితం చేసింది.
ఇటీవల, నవంబర్ 23, 2021న జరిగిన 12వ భారతదేశం – అమెరికా వాణిజ్య విధానం ఫోరమ్ సమావేశంలో తీసుకున్న నిర్ణయంపై అనుగుణంగా, భారత వ్యవసాయం, రైతుల సంక్షేమ శాఖ, యూఎస్డీఏ అమలు కోసం ఫ్రేమ్‌వర్క్ ఒప్పందంపై సంతకం చేశాయి.
ఈ ఒప్పందం ప్రకారం, భారతదేశం అమెరికాకు మామిడి, దానిమ్మ ఎగుమతులు చేయగా; అమెరికా నుండి భారత్ చెర్రీస్, అల్ఫాల్ఫా ఎండుగడ్డి దిగుమతికి రేడియేషన్‌పై ఉమ్మడి ప్రోటోకాల్‌ను అనుసరిస్తాయని వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ తెలిపింది.
రెండు దేశాల మధ్య అంగీకరించిన విధంగా రేడియేషన్ చికిత్స ప్రీక్లియరెన్స్ పర్యవేక్షణను దశల వారీగా భారతదేశానికి బదిలీ చేయడంతో సహా సవరించిన పని ప్రణాళిక రూపొందించారు.
పరస్పర ఒప్పందంలో భాగంగా, ఆల్ఫోన్సో రకం మామిడితో ప్రారంభమయ్యే మామిడి సీజన్లో భారతదేశం మార్చి నుండి అమెరికాకు మామిడిని ఎగుమతి చేస్తుంది.
2017-18లో భారతదేశం 800 మెట్రిక్ టన్నుల మామిడిని అమెరికాకు ఎగుమతి చేసింది. పండ్ల ఎగుమతి విలువ 2.75 మిలియన్ల అమెరికా డాలర్లు కావడంతో పాటు, అమెరికాలో భారతీయ మామిడిపండ్లకు భారీ ఆమోదం, వినియోగదారుల ప్రాధాన్యత లభించింది.
అదేవిధంగా, 2018-19లో, 3.63 మిలియన్ల అమెరికా డాలర్ల విలువ గల 951 మెట్రిక్ టన్నుల మామిడిపండ్లు అమెరికాకు ఎగుమతి చేశారు. 2019-20లో అమెరికాకు 4.35 మిలియన్ డాలర్ల విలువ గల 1,095 మెట్రిక్ టన్నులను ఎగుమతి చేశారు.
ఎగుమతిదారుల నుండి అందిన అంచనాల ప్రకారం, 2022లో మామిడి ఎగుమతి, 2019-20 గణాంకాలను అధిగమించవచ్చు. ఈ ఒప్పందం కారణంగా మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, ఆంధ్రప్రదేశ్,తెలంగాణ వంటి సాంప్రదాయ మామిడి ఉత్పత్తి బెల్ట్‌ల నుండి ఎగుమతులకు మార్గం సుగమం చేస్తుంది.
వ్యవసాయ, ప్రాసెస్డ్ ఫుడ్ ప్రొడక్ట్స్ ఎక్స్పోర్ట్ డెవలప్మెంట్ అథారిటీ (ఏపీఈడీఎ) ఉత్తర ప్రదేశ్, బీహార్, పశ్చిమ బెంగాల్ ల నుండి లాంగ్రా, చౌసా, దుషెహ్రీ, ఫాజ్లీ వంటి ఉత్తర, తూర్పు భారతదేశం నుండి ఇతర రుచికరమైన మామిడి పండ్లను ఎగుమతి చేయడానికి కూడా అవకాశం కల్పిస్తుందని తెలిపింది.
దానిమ్మపండు ఏప్రిల్ 2022 నుండి ఎగుమతి అవుతుంది. అమెరికా నుండి అల్ఫాల్ఫా ఎండుగడ్డి, చెర్రీస్ ఎగుమతులు ఏప్రిల్ 2022లో ప్రారంభమవుతాయి.