కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌కు సీబీఐ మరోసారి నోటీసులు జారీ చేయడం రాజకీయంగా కలకలం రేపుతోంది. కేరళకు చెందిన జై హింద్ టీవీ ఛానల్లో పెట్టుబడులకు సంబంధించిన వివరాలు ఇవ్వాలంటూ డీకే శివకుమార్, ఆయన భార్య ఉషతోపాటు మరో 30 మందికి సీబీఐ అధికారులు నోటీసులు జారీ చేశారు.
ఈ కేసు విచారణలో భాగంగా ఈ నెల 11 వ తేదీన ఢిల్లీలోని సీబీఐ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని ఆ నోటీసుల్లో సీబీఐ అధికారులు పేర్కొన్నారు. జై హింద్ ఛానల్లో పెట్టుబడులు, అందులో డీకే శివకుమార్‌కు ఉన్న వాటాకు సంబంధించిన వివరాలు తెలియజేయాలని ఆ నోటీసుల్లో అధికారులు కోరారు.
ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారన్న ఆరోపణలు, ఢిల్లీలోని డీకే శివకుమార్ ఫ్లాట్లలో రూ.8 కోట్లకు పైగా నగదు దొరికిన వ్యవహారంలో కర్ణాటక డిప్యూటీ సీఎంపై ఇప్పటికే సీబీఐ, ఈడీ అధికారులు కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
2013 నుంచి 2018 మధ్యలో డీకే శివ కుమార్‌కు ఉన్న సంపాదనలో రూ.74 కోట్లు లెక్కకు మించిన ఆదాయం ఉందని 2020 లో సీబీఐ అధికారులు కేసు నమోదు చేసి విచారణ కొనసాగిస్తున్నారు. అయితే తనకు జై హింద్ ఛానల్లో వాటా ఉందని 2017-18 ఎన్నికల్లో దాఖలు చేసిన ప్రమాణ పత్రం, ఆస్తి వివరాలలో డీకే శివ కుమార్ ప్రకటించారు.
యడియూరప్ప ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు డీకే శివ కుమార్‌పై కేసు పెట్టిన అప్పటి బీజేపీ ప్రభుత్వం. ఆ కేసు విచారణను సీబీఐకి అప్పగించింది. అయితే గతేడాది కర్ణాటకలో జరిగిన ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ నవంబరు 20 వ తేదీన నిర్వహించిన మంత్రి వర్గ సమావేశంలో ఆ కేసు విచారణ కోసం సీబీఐకి ఇచ్చిన అనుమతిని సిద్ధరామయ్య కేబినెట్ రద్దు చేసింది.
అయితే ఆ కేబినెట్ నిర్ణయాన్ని బీజేపీ నేత బసనగౌడ పాటిల్ యత్నాళ్ హైకోర్టులో సవాలు చేస్తూ రిట్ పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్‌పై ప్రస్తుతం విచారణ కొనసాగుతోంది. ఈ క్రమంలోనే తాజాగా తనకు సీబీఐ అధికారులు నోటీసులు జారీ చేయడంపై కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివ కుమార్ స్పందించారు.
తాను జై హింద్ ఛానల్లో రహస్యంగా పెట్టుబడులు పెట్టలేదని డీకే శివకుమార్ ఇప్పటికే స్పష్టం చేశారు. త్వరలోనే దేశంలో లోక్‌సభ ఎన్నికలు రానున్న నేపథ్యంలో తనపై ఒత్తిడిని మరింత పెంచేందుకు కేంద్ రప్రభుత్వం దర్యాప్తు సంస్థల ద్వారా వేధిస్తోందని డీకే శివకుమార్ ఆరోపించారు. తనను రాజకీయంగా అంతం చేయాలని బీజేపీ చూస్తోందని.. అందుకే ఇలా సీబీఐ నోటీసులు పంపించిందని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.