మరికొన్ని నెలల్లో ఏపీ అసెంబ్లీకి జరగనున్న తరుణంలో అధికార వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీకి షాక్‌ల మీద షాక్‌లు తగులుతున్నాయి. ఇప్పటికే నలుగురు ఎమ్మెల్యేలు పార్టీకి రాజీనామా చేయగా ఇటీవల ఎమ్మెల్సీ వంశీకృష్ణ వైసీపీని జనసేన పార్టీలో చేరారు. తాజాగా పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి దాడి వీభద్రరావు వైసీపీకి రాజీనామా చేస్తున్నట్లు సీఎం జగన్‌కు లేఖ రాశారు.
తన అనుచరులతో కలిసి పార్టీ వీడుతున్నట్లు ఏకవాక్యంతో రాజీనామా లేఖను సీఎంకు పంపారు. కొంత కాలంగా ఆయన వైసీపీపై తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలిసింది. మంత్రి గుడివాడ అమర్నాథ్తో ఉన్న వైరుధ్యాలు, వైసీపీ అధిష్టానం పట్టించుకోకపోవడం లాంటి కారణాలతో ఆయన పార్టీ మార్పుపై వార్తలు వచ్చాయి.
దాడి వీరభద్రరావు తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 1985లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అనకాపల్లి నియోజకవర్గం నుండి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. ఆ తర్వాత 1989, 1994, 1999 ఎన్నికల్లో వరుసగా మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచాడు. 1994లో ఎన్టీఆర్ హయాంలో సమాచార మరియు ప్రజా సంబంధాల శాఖ మంత్రిగా పనిచేశారు.
2004,2009 అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయి 2013లో ఎమ్మోల్సీగా ఎన్నికయ్యాడు. ఆయన 2014 అసెంబ్లీ ఎన్నికలకు ముందు టీడీపీ నుండి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరి 2014 ఎన్నికల తర్వాత వైసీపీకి రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీలో చేరాడు. ఆ తర్వాత 2019 మార్చిలో తెలుగుదేశం పార్టీని వీడి వైసీపీలో చేరారు.
కానీ తనకు పార్టీలో పెద్దగా గౌరవం దక్కలేదని పలుమార్లు ఆయన అనుచరులతో తన గోడును వెల్లబోసుకున్నాడు. అనకాపల్లి ఎమ్మెల్యే సీటును గత ఎన్నికల్లో గుడివాడ అమర్నాథ్కు కేటాయించి, విశాఖ పశ్చిమ నియోజకవర్గాన్ని దాడి తనయుడు దాడి రత్నాకర్‌కు ఇచ్చారు.
అయితే అక్కడ పోటీ చేసిన రత్నాకర్ ఓటమి పాలయ్యారు. దీంతో పార్టీలో దాడి ప్రభావం తగ్గిందనే వార్తలు వచ్చాయి. ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ తన ఉనికిని చాటుకోవాలని ప్రయత్నిస్తున్న దాడి తాజాగా పార్టీకి రాజీనామా చేశారు.