హిట్అండ్ రన్ కేసుల్లో కఠిన శిక్షలు విధించేందుకు ఉద్దేశించిన కొత్త చట్టంపై రెండు రోజులుగా ఆందోళన చేస్తున్న ట్రక్కు డైవర్లు తమ ఆందోళనను విరమిస్తున్నట్లు ప్రకటించారు. మంగళవారం కేంద్రంతో కీలక చర్చలు జరిపిన అనంతరం అన్ని సమస్యలు పరిష్కారమయ్యాయని అలిండియా మోటార్ ట్రాన్స్పోర్టు అసోసియేషన్( ఎఐఎంటిసి) ప్రకటించింది.
కొత్త చట్టానికి వ్యతిరేకంగా చేస్తున్న ఆందోళనను త్వరలోనే ఉపసంహరించుకుంటామని దేశవ్యాప్తంగా ట్రక్కర్ల సంఘాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ అసోసియేషన్ ప్రకటించింది. ‘భారతీయ న్యాయసంహితలోని నిబంధనలపై మేము ప్రభుత్వంతో సమావేశమై చర్చించాం. కొత్త చట్టాలు ఇంకా అమలు కాలేదు. ఎఐఎంయుసితో చర్చించిన తర్వాతే దాన్ని అమలు చేయడం జరుగుతుంది’ అని అసోసియేషన్ కోర్ కమిటీ చైర్మన్ మల్కిత్ సింగ్ చెప్పారు.
త్వరలోనే సమ్మె ముగుస్తుందని, డ్రైవర్లందరినీ విధుల్లో చేరాలని కోరినట్లు కూడా ఆయన చెప్పారు. ఇదిలా ఉండగా కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లా కూడా దీనిపై ఒక ప్రకటన చేశారు. ‘హిట్ అండ్ రన్ కేసుల్ల్లో పదేళ శిక్షను విధించడానికి ఉద్దేశించిన చట్టంపై భారత మోటారు ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ (ఎఐ ఎంటిసి)తో చర్చ జరిగింది. ఈ చట్టం ఇంకా అమలు కాలేదు. ఎఐఎంటిసితో చర్చించిన తర్వాత దాన్ని అమలు చేస్తాం’అని భల్లా తెలిపారు.
కాగా, ఇటీవల ఆమోదించిన కొత్త చట్టంలో హిట్ అండ్ రన్ కేసులకు సంబంధించి తీసుకు వచ్చిన కఠిన నిబంధనలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ట్రక్కు డైవర్లు సోమవారం నుండి ఆందోళనకు దిగడంతో ఎక్కడి వాహనాలు అక్కడే ఆగిపోయాయి. ముఖ్యంగా పెట్రోలు ట్యాంకర్ల డ్రైవర్లు కూడా సమ్మె చేస్తుండడంతో పెట్రోలు బంకుల్లో నిల్వలు నిండుకున్నాయి.
దీంతో పలు రాష్ట్రాల్లో ముఖ్యంగా ఉత్తరాదిన పెట్రోలు బంకుల వద్ద భారీ క్యూలు కనిపించాయి. ట్రక్కు డైవర్ల సమ్మెను ముందే ఊహించి ప్రభుత్వ రంగ చమురు సంస్థలు పెట్రోలు బంకుల్లో నిల్వలను ఉంచినప్పటికీ భారీ రద్దీ కారణంగా రాజస్థాన్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, పంజాబ్ రాష్ట్రాల్లోని దాదాపె 2 వేల పెట్రోలు బంకులు మూతపడ్డాయి.
రెండు మూడు రోజలుకు సరిపడా నిల్వలు ఉన్నాయని, అయితే సమ్మె కొనసాగితే మాత్రం ఇబ్బంది ఎదురయ్యే అవకాశం ఉందని ఆ సంస్థలు అంటున్నాయి. నిల్వలు నిండుకుంటాయేమోనన్న భయంతో వాహన యజమానులు పెట్రోలు బంకులకు పరుగులు తీయడంతో బంకుల వద్ద భారీ క్యూలు కనిపింఛాయాయి.
ఉత్తరాది రాష్ట్రాలతో పోలిస్తే దక్షిణాది రాష్ట్రాల్లో పరిస్థితి కాస్త మెరుగ్గా ఉంది. తెలంగాణ రాజధాని హైదరాబాద్లో మాత్రం కొన్ని పెట్రోలు బంకుల వద్ద నో స్టాక్ బోర్డులు దర్శనమిచ్చాయి.