దేశంలో కరోనా వైరస్ సబ్ వేరియంట్ జేఎన్.1 విజృంభిస్తోంది. కొత్త వేరియంట్ కేసులు తాజాగా 600 మార్క్‌ను దాటాయి. జనవరి 4వ తేదీ వరకూ ఈ తరహా కేసులు దేశవ్యాప్తంగా 619కి పెరిగినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. మొత్తం 12 రాష్ట్రాల్లో జేఎన్.1 వైరస్ కేసులు బయటపడ్డాయి.
అందులో కర్ణాటకలో అత్యధికంగా 199 కేసులు వెలుగుచూశాయి. ఇక కేరళ, మహారాష్ట్ర రెండు, మూడు స్థానాల్లో నిలిచాయి. కేరళలో జేఎన్.1 కేసులు 148 నమోదు కాగా, మహారాష్ట్రలో 110 వెలుగుచూశాయి. ఢిల్లీలో 15, గోవాలో 47, గుజరాత్లో 36, ఆంధ్రప్రదేశ్‌లో 30, తమిళనాడులో 26, రాజస్థాన్‌లో నాలుగు, తెలంగాణలో రెండు, ఒడిశా, హర్యానాలో ఒక్కొక్కటి చొప్పున మొత్తం 619 కేసులు నమోదయ్యాయి.
మరోవైపు బిఎ2.86 రకానికి చెందిన ఈ జేఎన్.1 ఉపరకాన్ని ప్రత్యేకమైన ‘వేరియంట్ ఆఫ్ ఇంట్రెస్ట్’గా ప్రపంచ ఆరోగ్య సంస్థ వర్గీకరించిన విషయం తెలిసిందే. దీని వ్యాప్తి వేగంగా ఉన్నప్పటికీ.. ముప్పు తక్కువేనని స్పష్టం చేసింది. ప్రస్తుతం దేశంలో ఈ రకం కేసులు పెరుగుతున్నప్పటికీ ప్రజలు భయపడాల్సిన అసవరం లేదని కేంద్ర ఆరోగ్య శాఖ అధికారులు చెబుతున్నారు. అయితే, ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.
ఇదిలా ఉండగా.. ప్రస్తుతం దేశంలో రోజూవారీ కరోనా వైరస్ కేసులు భారీగానే నమోదవుతున్నాయి. అయితే, అదే సమయంలో కోలుకుంటున్న వారి సంఖ్య కూడా రోజూవారీ కేసులకు సమానంగా ఉండటం కాస్త ఊరట కలిగిస్తోంది.
తాజాగా 24 గంటల వ్యవధిలో 761 కొత్త కేసులు బయటపడగా నిన్న 838 మంది వైరస్ నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో 4,334 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ఇక నిన్న ఒక్కరోజే 12 మరణాలు నమోదయ్యాయి. కేరళలో ఐదుగురు, కర్ణాటకలో నలుగురు, మహారాష్ట్రలో ఇద్దరు, ఉత్తరప్రదేశ్‌లో ఒకరు ప్రాణాలు కోల్పోయారు.