యూనియన్ పబ్లిక్ సర్వీసు కమిషన్ కు (యూపీఎస్సీ) తరహాలో తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీసు కమిషన్ (టీఎస్పీఎస్సీ)ను ప్రక్షాళన చేయదలచింనల్టు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడించారు. సుమారు వందేళ్ల సుదీర్ఘ చరిత్రతో పాటు నిర్ధిష్ట కాలపరిమితిలోనే నోటిఫికేషన్, పరీక్షలు, ఇంటర్వ్యూల నిర్వహణ, నియామక ప్రక్రియను చేపట్టడం, అన్నింటా పారదర్శకత పాటిస్తూ ఉండటంపట్ల యూపీఎస్సీని ఆయన అభినందించారు.
న్యూ ఢిల్లీలోని యూపీఎస్సీ కార్యాలయంలో యూపీఎస్సీ ఛైర్మన్ డాక్టర్ మనోజ్ సోని, కార్యదర్శి శశిరంజన్ కుమార్‌లతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి శుక్రవారం భేటీ అయ్యారు. ఈ సందర్భంగా టీఎస్పీఎస్సీ ప్రక్షాళన, యూపీఎస్సీ పని తీరుపై సుమారు గంటన్నర పాటు వారు చర్చించారు.
యూపీఎస్సీ పారదర్శకత పాటిస్తోందని, అవినీతి మరక అంటలేదని, ఇంత సుదీర్ఘకాలంగా అంత సమర్థంగా యూపీఎస్సీ పని చేస్తున్న తీరుపై ముఖ్యమంత్రి ఆరా తీశారు. తెలంగాణలో నియామక ప్రక్రియలో నూతన విధానాలు, పద్ధతులు పాటించాలనుకుంటున్నట్లు ముఖ్యమంత్రి తెలిపారు.
స్పందించిన యూపీఎస్సీ ఛైర్మన్ యువ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నియామకాల ప్రక్రియపై దృష్టి సారించడం అభినందనీయమని పేర్కొన్నారు. యూపీఎస్సీ ఛైర్మన్, సభ్యుల నియామకంలో రాజకీయ ప్రమేయం ఉండదని, సమర్థత ఆధారంగా ఎంపిక ఉంటుందని తెలిపారు.
తాము 2024 డిసెంబరు నాటికి రెండు లక్షల ఉద్యోగ నియామకాలు చేపట్టాలని భావిస్తున్నామని, ఇందుకు టీఎస్ పీఎస్సీని ప్రక్షాళన చేయాలనుకుంటున్నామని ముఖ్యమంత్రి, మంత్రి ఛైర్మన్ దృష్టికి తీసుకెళ్లారు. గత ప్రభుత్వం టీఎస్ పీఎస్సీ ఛైర్మన్, సభ్యుల నియామకాన్ని రాజకీయం చేసి, దానినో రాజకీయ పునరావాస కేంద్రంగా మార్చిందని తెలిపారు.
ఫలితంగా పేపర్ లీకులు, నోటిఫికేషన్ల జారీ, పరీక్షల నిర్వహణ, ఫలితాల వెల్లడి ఓ ప్రహసనంగా మారిందని పేర్కొంటూ తామ రాజకీయ ప్రమేయం లేకుండా ఛైర్మన్, సభ్యుల నియామకం చేపడతామని ముఖ్యమంత్రి తెలిపారు. టీఎస్పీఎస్సీలో అవకతవలకు తావులేకుండా సిబ్బందిని శాశ్వత ప్రాతిపదికన నియమిస్తామని వివరించారు.
స్పందించిన యూపీఎస్సీ ఛైర్మన్ టీఎస్పీఎస్సీని యూపీఎస్సీ తరహాలో తీర్చిదిద్దాలనుకుంటున్నందున టీఎస్పీఎస్ ఛైర్మన్‌తో పాటు సభ్యులకు తాము శిక్షణ ఇస్తామని, సచివాలయ సిబ్బందికి అవగాహన తరగతులు నిర్వహిస్తామని తెలిపారు. సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, ముఖ్యమంత్రి ప్రిన్సిపల్ కార్యదర్శి వి.శేషాద్రి, ఓఎస్డీ అజిత్ రెడ్డి, టీఎస్పీఎస్సీ కార్యదర్శి అనితా రామచంద్రన్, రాష్ట్ర అటవీ, పర్యావరణ శాఖ ముఖ్య కార్యదర్శి వాణీ ప్రసాద్ పాల్గొన్నారు.