తెలంగాణ ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టి నెలరోజులు పూర్తిచేసుకున్న ఎ రేవంత్ రెడ్డి తన తొలి నెలరోజుల పాలన పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించగా డిసెంబర్ 7న తెలంగాణ రెండో సీఎంగా రేవంత్ రెడ్డి ప్రమాణస్వీకారం చేశారు. ఆయన పాలనకు నేటితో నెల రోజులు పూర్తయ్యాయి.
ఈ నేపథ్యంలో తన నెల రోజుల పాలనను గుర్తు చేస్తూ రేవంత్ స్పెషల్ ట్వీట్ చేశారు. ఈ 30 రోజుల పాలన తనకు ఎంతో సంతృప్తిని కలిగించిందని చెప్పారు. ‘సంకెళ్లను తెంచి, స్వేచ్ఛను పంచి జనం ఆకాంక్షలను నిజం చేస్తూ సాగిన ఈ నెల రోజుల ప్రస్థానం తృప్తినిచ్చిందని తెలిపారు.
“సేవకులమే తప్ప పాలకులం కాదన్న మాట నిలబెట్టుకుంటూ.. పాలనను ప్రజలకు చేరువ చేస్తూ.. అన్నగా నేనున్నానని హామీ ఇస్తూ జరిగిన నెల రోజుల ప్రయాణం కొత్త అనుభూతిని ఇచ్చింది. పేదల గొంతుక వింటూ.. యువత భవితకు దారులు వేస్తూ.. మహాలక్ష్ములు మన ఆడబిడ్డల మొఖంలో ఆనందాలు చూస్తూ.. రైతుకు భరోసా ఇస్తూ.. సాగిన నెల రోజుల నడక ఉజ్వల భవిత వైపునకు అడుగులు వేస్తోంది” అంటూ తెలిపారు.
పెట్టుబడులకు కట్టుబడి ఉన్నామంటూ, పారిశ్రామిక వృద్ధికి పెద్దపీట వేస్తూ.. నగరాల అభివృద్ధికి నగిషీలు చెక్కుతూ, మత్తులేని చైతన్యపు తెలంగాణ కోసం గట్టి పట్టుదలతో సాగిన ఈ నెల రోజుల పాలన బాధ్యతగా సాగిందని ముఖ్యమంత్రి చెప్పుకొచ్చారు. రేవంతన్నగా తనను గుండెల్లో పెట్టుకున్న తెలంగాణ గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోయేలా ఇక ముందు కూడా తన బాధ్యత నిర్వర్తిస్తా అని భరోసా ఇస్తూ సీఎం రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు.
కాగా, తెలంగాణ అసెంబ్లీ ఫలితాలు గత నెల 3న విడుదల కాగా, కాంగ్రెస్ పార్టీ 64 సీట్లతో సత్తా చాటాంది. రెండు సార్లు అధికారం దక్కించుకున్న బీఆర్ఎస్ను 39 స్థానాలకే పరిమితం చేసింది. డిసెంబర్ 7న రేవంత్ రెడ్డి సీఎంగా ప్రమాణస్వీకారం చేశారు. అనంతరం తనదైన మార్కు పాలనతో ముందుకువెళ్తున్నారు.
డిసెంబర్ 9న కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారంటీల్లో రెండు గ్యారంటీలు అమలు చేశారు. మిగతా గ్యారంటీల అమలు కోసం ప్రజాపాలన పేరిట ప్రత్యేక కార్యక్రమం చేపట్టి ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. త్వరలోనే అర్హులందరికీ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన గ్యారంటీలు అమలు చేస్తామని రేవంత్ రెడ్డి వెల్లడించారు.