మహారాష్ట్ర రాజకీయాల్లో ఉద్దవ్ థాక్రే నేతృత్వంలోని శివసేన (యూబీటీ)కి భారీ షాక్ తగిలింది. అదే సమయంలో మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే నాయకత్వంలోని శివసేన వర్గానికి ఊరట లభించింది. షిండే నేతృత్వంలోని 40 మంది ఎమ్మెల్యేల సస్పెన్షన్ చెల్లదంటూ మహారాష్ట్ర స్పీకర్ ఉత్తర్వులు జారీ చేశారు.
అంతేగాక, ఏక్ నాథ్ షిండే వర్గమే నిజమైన శిసేన అంటూ స్పీకర్ తేల్చి చెప్పారు. ఎన్నికల సంఘం కూడా ఇదే చెప్పిందని స్పీకర్ నర్వేకర్ స్పష్టం చేశారు. షిండే వర్గంలోనే మెజార్టీ ఎమ్మెల్యేలు ఉన్నారని తెలిపారు. కాగా, 2022లో శివసేన రెండు వర్గాలు విడిపోయిన విషయం తెలిసిందే. షిండే వర్గం బీజేపీతో కలిసి మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.
ఏక్నాథ్ షిండే సహా మొత్తం 16 మంది ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలని ఉద్ధవ్ థాక్రే వర్గం చేసిన అభ్యర్థనను తోసిపుచ్చారు. అనర్హత నోటీసులు జారీ చేసిన దాదాపు ఆరు నెలల తర్వాత బుధవారం ఈమేరకు తన నిర్ణయాన్ని వెల్లడించారు మహారాష్ట్ర స్పీకర్ రాహుల్ నర్వేకర్. ఫలితంగా ఏక్నాథ్ షిండేకు పదవీ గండం తప్పింది.
అనర్హత పిటిషన్పై తీర్పు సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు స్పీకర్ రాహుల్ నర్వేకర్. ఏక్ నాథ్ షిండే నేతృత్వంలోని వర్గాన్నే అసలైన శివసేన పార్టీగా గుర్తిస్తున్నట్లు స్పష్టం చేశారు. పార్టీ రాజ్యాంగానికి సంబంధించిన అనేక నిబంధనలను ఈ సందర్భంగా స్పీకర్ ప్రస్తావించారు. వాటన్నింటినీ పరిగణనలోకి తీసుకునే అనర్హత పిటిషన్పై నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు.
కాగా, 2019 అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ 105 స్థానాలు గెలిచి అతిపెద్ద పార్టీగా అవతరించింది. అయితే, ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు 145 సీట్లు అవసరం. అజిత్ పవార్ సహాయంతో బీజేపీ ప్రభుత్వాన్ని నెలకొల్పినా 4 రోజులకే కుప్పకూలింది. ఆ తర్వాత కాంగ్రెస్, ఎన్సీపీ, శివసేన కలిసి ‘మహా వికాస్ అఘాడీ’ పేరుతో కూటమి ఏర్పాటు చేశాయి. ఫలితంగా విపక్ష కూటమిలోని శాసనసభ్యుల సంఖ్య 154కు చేరింది.