కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీ చేపట్టనున్న భారత్ జోడో న్యాయ్ యాత్రకు అడ్డంకులు ఎదురయ్యాయి. జనవరి 14న తూర్పు ఇంఫాల్‌లోని హట్టా కాంగ్జెబుంగ్‌లో బహిరంగ ర్యాలీ నుండి యాత్రను ప్రారంభించనున్నట్లు పార్టీ ప్రకటించింది. అయితే బహిరంగ ర్యాలీ చేపట్టేందుకు మణిపూర్ రాష్ట్ర ప్రభుత్వం అనుమతి నిరాకరించింది.
అనుమతి నిరాకరణపై సీనియర్ కాంగ్రెస్ నేత కెసి. వేణుగోపాల్ స్పందించారు. ఎన్నికల సన్నాహాలకు ఎలాంటి ఆటంకం కలగకుండా యాత్ర చేపడతామని తెలిపారు. ఇది రాజకీయ యాత్ర కాదని, ఈ దేశ ప్రజలకు న్యాయం చేయాలని కోరుతున్నామని పేర్కొన్నారు. కాంగ్రెస్ రాష్ట్ర యూనిట్ తగిన సమయంలోనే పోలీస్ క్లియరెన్స్‌ను అభ్యర్థించిందని చెప్పారు.
ఎదురు దెబ్బలు యాత్రను అడ్డుకోలేవని పేర్కొంటూ ఈ సమస్యను రాజకీయం చేయబోమని ఆయన స్పష్టం చేశారు. మణిపూర్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు, సీనియర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే కె మేఘచంద్ర, పార్టీ నాయకుల బృందంతో కలిసి బుధవారం ఉదయం ముఖ్యమంత్రి ఎన్ బీరెన్ సింగ్‌ను కలిశారు.
ఆ క్రమంలో రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితిని సాకుగా చూపుతూ భేటీ సందర్భంగా సీఎం అనుమతి నిరాకరించారని ఆయన చెప్పారు. యాత్రను తమ ప్రభుత్వం అనుమతించదని సిఎం ఎన్ బీరెన్ సింగ్ అన్నారని మేఘచంద్ర వెల్లడించారు. ప్రభుత్వ నిర్ణయం దురదృష్టకరమని, ఈ చర్య ప్రజల, రాజకీయ హక్కుల ఉల్లంఘనగా పేర్కొన్నారు. బహిరంగ ప్రదేశాల్లో యాత్రకు అనుమతి లేకపోవడంతో.. థౌబాల్ జిల్లాలోని ఓ ప్రైవేటు స్థలానికి మార్చినట్లు మేఘచంద్ర వెల్లడించారు.
ఇదిలా ఉండగా ముఖ్యమంత్రి బీరేన్ సింగ్ మంగళవారం విలేకరులతో మాట్లాడినపుడు కాంగ్రెస్ చేపట్టనున్న భారత్ న్యాయ యాత్రకు అనుమతి ఇచ్చే విషయాన్ని పరిశీలిస్తున్నట్లు చెప్పారు. భద్రతా సంస్థల నుంచి నివేదికలు అందిన తర్వాత దీనిపై తుదినిర్ణయం తీసుకుంటామని ఆయన తెలుపుతూ రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి సంక్లిష్టంగా ఉందని ఆయన గుర్తు చేశారు.
కాగా, రాహుల్ చేపట్టనున్న ‘భారత్ జోడో న్యాయ్ యాత్ర ’ జనవరి 14న ప్రారంభమై మార్చి 30న ముగుస్తుంది. 66 రోజులపాటు 15 రాష్ట్రాల్లోని 110 జిల్లాల మీదుగా దాదాపు 6,713 కిలోమీటర్ల పాటు కొనసాగనుంది.