కాళేశ్వరం ప్రాజెక్టు విచారణపై కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ విధానాన్ని అవలంబిస్తోందని బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపి బండి సంజయ్ కుమార్ మండిపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో రూ.లక్ష కోట్ల అవినీతికి బిఆర్ఎస్ ప్రభుత్వం పాల్పడిందని చెప్పిన కాంగ్రెస్ నేతలు ఇపుడు అందుకు భిన్నంగా మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణంపైనే జ్యుడీషియల్ విచారణ కోరడం సిగ్గు చేటని ధ్వజమెత్తారు.
బిఆర్ఎస్ నేతల అవినీతిని కాపాడేందుకు కాంగ్రెస్ నేతలు ప్రయత్నిస్తున్నారా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం కోరితే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిన అవకతవకలపై సిబిఐ విచారణ జరిపించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం కాంగ్రెస్ ప్రభుత్వానికి సహకరించేందుకు తాము సిద్ధమని చెప్పారు.
కాళేశ్వరంపై సిబిఐ విచారణ ఎందుకు జరిపించడం లేదని సంజయ్ ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో రూ.లక్ష కోట్ల అవినీతి జరిగిందని కాంగ్రెస్ చెప్పిందని ఆయన గుర్తు చేశారు. మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అవకతవకలపై విచారణ ఎందుకు జరిపించడం లేదని ఆయన నిలదీశారు.
ఇప్పటికైనా కాళేశ్వరం ప్రాజెక్టుపై సిబిఐ విచారణ కోరాలని ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం, ప్రజలకు మేలు జరిగే విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి పూర్తిగా సహకరించేందుకు తమ పార్టీ సిద్ధంగా ఉందని హామీ ఇచ్చారు.